Bharadwaja Rangavajhala …………………………
అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … బెజవాడ.
మరి ఆ రోజుల్లో బెజవాడ అంటే తెలుగు సినిమా రాజధాని.అలా ఉండగా ఎవిఎమ్ వారు మూగనోము సినిమా తీస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టరు రంగూన్ రామారావు అనుకోకుండా బెజవాడ వచ్చారు. ఆయన ఏదో పని మీద రాము వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు … రాము తనకు వచ్చిన సినిమా ఫైట్లు డాన్సులూ చేసి చూపించేశాడు.ఎందుకేనా పనికొస్తాయనుకుని. వీడెవడో భలే ఉన్నాడే … అనుకున్న రంగూన్ రామారావు అబ్బాయ్ మూగనోము అనే సినిమాలో ఓ చిన్నకుర్రాడి పాత్ర ఉంది చేస్తావూ? అని అడిగారు.
చేస్తానని ఈ కుర్రాడు ఉత్సాహపడ్డాడు కానీ వాళ్ల అమ్మ సినిమాలూ లేవు గినిమాలూ లేవు … ఇంకోసారా మాటంటే వీపు వాచిపోతుందనేశారు. అయినప్పటికీ వచ్చిన అవకాశం జారవిడుచుకోవడం ఎందుకని అమ్మని బ్రతిమాలి మద్రాసు బయల్దేరిపోయాడు పాపం పసివాడు. అప్పటికి అతనికి తెలియదు తను నిజంగానే పాపం పసివాడు అయిపోతానని. విచిత్రంగా ఎవిఎమ్ వారు ఈ వీర వేంకట రాంబాబును చూసి నీ పేరు పెద్దగా ఉందిగానీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావూ … మా సినిమాలో వేషం నీ కంటే కొంచెం పెద్దదీ అన్నారు..
మరెలా రేపటికల్లా కొంచెం పెద్దై వస్తాగా అన్నాడు ఇతను. మాకు తెల్సులేవయ్యా … రేపటికల్లా పెద్దైనా సరే మాకొద్దు అన్నారు వారు. సరే మీ కర్మ అని వాళ్లని వదిలేసి బయటకు వచ్చేశాడు రాము. ఎటూ మద్రాసు వచ్చేశాం కనుక ఇది కాకపోతే ఇంకోటీ అనుకుని ప్రయత్నాలు ప్రారంభించాడు. రంగూన్ రామారావు నాయత్వంలోనే. ఒక తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది రామూ అంత పాత్రే కావడంతో చేసేశాడు హాయిగా … వీడెవడో భలే ఉన్నాడే … కేకుల్లా టేకులు తినకుండా ఫిలిం మిగిలిస్తున్నాడూ అని ఇండస్ట్రీలో గుప్పుమంది.
ఇండస్ట్రీలో అంతే ఏదైనా అలా గుప్పుమంటుంది. అతను చేసిన తమిళ సినిమా పేరు ఎంగమాను. అది హిందీ బ్రహ్మచారికి తమిళ రీమేకు. ఎప్పుడైతే ఇతని గురించి గుప్పుమందో …ఆ వెంటనే నిండు హృదయాలు సినిమాలో చిన్నప్పటి శోభన్ బాబు వేషం వచ్చింది. చేసేశాడు. పెద్ద హీరోల చిన్నప్పటి వేషాలు వేస్తే పెద్దయ్యాక ఆటోమేటిగ్గా హీరో అయిపోతాం అనుకున్నాడు పాపం .. ఎందుకంటే పాపం పసివాడు కదా.
ఇలా అనుకుని చాలా మంది పెద్ద హీరోల చిన్నప్పటి పాత్రలు చేసేయడం మొదలు పెట్టాడు. ఏదో అలా నడిచేస్తుండగా తనే కీలక పాత్రలో సినిమా తీస్తాం అని ఓ నిర్మాత దర్శకుడు రాంబాబు దగ్గరకు వచ్చారు. ఆ సినిమా పేరు పాపం పసివాడు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు అంతకు ముందు అఖండడు మధ్యలో దేవుడు చేసిన మనుషులు తీసిన దర్శకుడు వి.రామచంద్రరావు గారు ఆ పాపం పసివాడుకు కూడా డైరెక్టరు.
ఇహ లాభం లేదని బొంబాయి పోయి హిందీ సినిమాలు అధికంగా చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు ఆ సినిమా నిర్మాత. అనుకోకుండా ఓ పిల్లాడు తప్పిపోయి ఎడారిలో ఇరుక్కుపోతాడు. నానా కష్టాలూ పడి తల్లిదండ్రులను చేరుకుంటాడు. అదీ కథ. మన వాడు థియేటర్ లో తెర మీద పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. వరదలుగా కన్నీరు ఉరికింది. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
అంత పెద్ద బాల స్టారు అయిపోయాక ఇంక వేషాలకేం కొదువ. అనేకం ఆడుతూ పాడుతూ చేసేశాడు. కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఒంటి మీదకు వయసును తెస్తుంది.తెచ్చింది కూడానూ. అలా చైల్డ్ వేషాలు వేస్తూ కాలక్షేపం చేసేస్తున్న రాము ఆ పాత్రలకన్నా పెద్దయిపోయాడు. ఈ మాట ఇండస్ట్రీనే అనేసింది. దీంతో ఆయన తన వయసుకు తగ్గ హీరో పాత్రలు ఇవ్వమని అడిగాడు. అయితే ఇండస్ట్రీ వారికి వారి కొలతలు వారికి ఉంటాయి కదా …ఇంకోళ్ల కొలతలను వారు అంగీకరించరు కదా … అలా పెద్ద వేషాలు వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాం అంటున్నారుగానీ ఎవరూ ఇవ్వడం లేదు.
అంటే హీరో వేషం వేసే వయసు కూడా కాదప్పుడు రామూది. అప్పటి తెలుగు సినిమా హీరోల వయసు యాభై దాటేయడం జరిగింది.అయినప్పటికీ ప్రయత్నం చేస్తూండగా కాస్త పెద్దబ్బాయి పాత్ర రామదండు లో వచ్చింది. మురళీమోహన్ సరిత వేసిన ఆ సినిమాలో ఓ బాలసైన్యం ఉంటటుంది.ఆ బాలసైన్యంలో ఇతనూ ఉంటాడు. దాని తర్వాత సీతాకోకచిలుక సినిమాలో హీరో మిత్ర బృందం లో ఇతనూ ఓ వేషం వేసేశాడు.
అప్పటికి నూనూగు మీసాల వయసు. తనకు తన వయసుకు తగ్గ పాత్రలు ముఖ్యంగా హీరో వేషాలు ఇవ్వరు అనే విషయం అర్ధమైపోయింద రాముకి. అంతే గ్యాపు వచ్చేసింది. అతనూ ఇక చాల్లే సినిమాలు అనుకుని వేరు వృత్తుల్లోకి డైవర్ట్ అయిపోయాడు. ఏదో కమల్ హసన్ , శ్రీదేవి లాంటి పెట్టిపుట్టిన బాలనటులకు పెద్దయ్యాక కూడా హీరోగానో హీరోయిన్ గానో నిరూపించుకునే పాత్రలు వస్తాయిగానీ అందరికీ రావు కదా అని అర్ధం చేసుకుని మౌనంగానే సినిమా నుంచీ నిష్కృమించాడు. ఆ తర్వాత ఏమయ్యాడో ఏం చేస్తున్నాడో తెలియదు …ఎవరికైనా తెలిస్తే ఈ కథ రెండో భాగం రాయగలరు. … ఆ రెండో భాగం పేరు పాపం పెద్దోడు