ఏమైంది నా సినిమా… ?

Sharing is Caring...

రమణ కొంటికర్ల…………………………………..  

ఇప్పుడిక మళ్ళీ రమ్మన్నా దృశ్యమై వస్తుందా…? కళ్లముందు కదలాడే ఓ పాత తీపి జ్ఞాపకమవ్వడం తప్ప..?!!
నాటి 21 ఇంచుల టీవి ఇంతింతై.. 42, 55, 65, 100 అంటూ కార్పోరేట్ కాలేజీల ర్యాంకుల మాదిరిగా పెంచుకుంటూ వెళ్లినా.. 4K HDR QLED  లు పెట్టుకుని గొప్పలు పోయినా… నాటి మట్టివాసనల సినిమా థియేటర్ల అనుభూతి మళ్లీ ఆవిష్కృతమవుతుందా..?
విద్యుత్ కాంతుల ధగధగల ఆకర్షణలతో… మయసభను తలపించే మిరుమిట్లు గొలిపే నిర్మాణసౌధాల మల్టీప్లెక్స్ థియేటర్ లలో… మనం చూడవల్సిన ఏ సినిమా ఏ స్క్రీన్ లో ఉందో వెతుక్కోవడానికే పట్టే కనీసం పదిహేను నిమిషాల అయోమయంలో.. ఎంచుకున్న కేటగిరీలో కుర్చీలోనో, బెంచీలోనో, లేక నేలటిక్కెట్ పైనో కూర్చుని వీక్షకుల ఈలల మధ్య కృష్ణ, కృష్ణంరాజుల ‘యుద్ధం’ చూసిన నాటి క్రేజీరోజులు మళ్లీ రాగలవా..?
ముట్టుకుందామంటే కాలిపోయే  ఆకాశాన్నంటిన ధరల పట్టికతో.. కమర్షియల్ పంథా సంతరించుకున్న మల్టీప్లెక్స్ ల్లో… మా ఊరి కరీం వెల్లిపాయగారె, అల్లం ఛాయ్ దొరుకుతుందా…? పక్కనే వేసిన మునీర్ కట్ బజ్జీల రుచి కనుమరుగైపోయిందిగదా..? కాంతం అప్పాల గుల్లలు ఇంకా మసకబారిన దృశ్యాల నీడలై పలకరిస్తూనే ఉన్నాయిగదా…? అందుకే ఏదేశమేగినా.. ఎందుకాలిడినా.. మేం మర్చిపోలేని తీపి జ్ఞాపకమే మా “సాయిబాబా టాకీస్.”

తెల్లంగీ, తెల్లలుంగీ మీద ప్రొజెక్టర్ రూంలోరీల్ చుట్ట చుట్టిన అందరి ఆత్మబంధువైన ఔసల నర్సయ్య యాదిమర్చిపోతేగదా..?!
అఖండ లక్ష్మీసౌభాగ్యవతి సినిమాకిచ్చిన కుంకుమ భరిణీలు ఇప్పటికీ ఎక్కడో తవ్వకాల్లో బయల్పడే వందలేళ్ల ఎకో ఫ్రెండ్లీ మట్టిఇళ్ల వాసనలో మా చిన్నప్పటి టాకీసునెలా మరువగలమూ…?ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ కోతల నడుమ.. రెండున్నర గంటల సినిమాకై మరో రెండు గంటల పాటు శ్రమించిన నాటి సిబ్బంది జనరేటర్ కష్టాలు..  విద్యుత్ కోతతో మిస్సైన ఎంటర్ టైన్ మెంట్ ఫ్రస్ట్రేషన్ లో…  సిబ్బంది పడే ఇబ్బందులపై కట్ చేసే జోక్స్… ఇలా అన్నీ ఇంకా మా మదిలో మెదలాడుతూనే ఉన్నాయ్!
ఒక సినిమా ఒక థియేటర్ లో వందరోజులాడితే ఆ రోజుల్లో గ్రేట్! దానికి శతదినోత్సవాలు కూడాను!!   కానీ కరెంట్ కష్టాల నడుమ ఎంతందగాడైతేనేం.. ఎంత సోగ్గాడైతేనేం.. శోభన్ బాబు ఒకే సినిమా ‘భార్యామణిని’ వరుసగా 30 రోజుల పాటు చూసిన మరి మేమెంత గ్రేట్..?!!….. అప్పుడే యుక్తవయస్సుకొస్తున్న యవ్వనదశలో సిల్క్ స్మిత పోస్టర్లతో అలరించిన ‘లేడీస్ జేమ్స్ బాండ్’ ను కూడా అలాగే చూడాలనుకున్న మా చిలిపి యువతరం కోరికలకు.. నాటి అందాల హీరోయన్లైన జయసుధ, జయప్రద, శ్రీదేవిలకు ఫ్యాన్లుగా మార్చిన క్రేజ్ కు ఆనాటి సినిమానే వేదిక కదా…?
మా సాయిబాబాలో చూసిన ఒక హీరో, ఒక దొంగ, ఒక పులి, ఒక మగధీరుడు, ఒక పులి-బెబ్బులి, ఒక యమకింకరుడు వంటి సినిమాలవల్లే కదా మాకు చిరంజీవి మెగాస్టారని తెలిసింది..? ఓ అల్లూరి సీతారామరాజు, సింహాసనమే కదా… కృష్ణను సూపర్ స్టార్ సింహాసనంపై కూర్చోబెట్టాయన్న కాస్తో కూస్తో సినిమా నాలెడ్జినిచ్చింది…? కృష్ణంరాజు రెబల్ స్టారని… ఎన్టీవోడు ఈ సినిమా ద్వారానే ముఖ్యమంత్రైండని.. అక్కినేని ప్రేమ విరహ దేవదాసు రచనాశిల్పి శరత్ చంద్ర అని ఎరుకైంది..?
ఆయా సినిమాల్లో హీరోలంతా డిష్యుం డిష్యుం ఫైట్లు చేస్తుంటే… ఓ పక్క విరిగిన కుర్చీలు, బెంచీల్లో సౌకర్యాలనేమాత్రం పట్టించుకునే సోయిలేని వయస్సులో… హీరోల ఫైటింగుల్లో పరకాయ ప్రవేశం చేసి.. మాకు మేమే హీరోలుగా ఊహించుకున్న.. నాటి ఏ డిప్లమసీ లేని.. బోల్డ్ మనసులిప్పుడు చూడగలమా…?  

ఎవరో అడిగారు మీ థియేటర్ ఏసీనా అని..? అవును.. ఇప్పుడు మాది మీ ఏసీ కంటే బంపర్ ఏసీ అని చెప్పేవాళ్లమ్మేం. రేకుల్లేకుండానే సాయంత్రం ఫస్ట్ షో, సెకండ్ షోలు చూసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఎండాకాలపు సాయంత్రాన చింతామణి చెరువు గాలుల్లో… జగిత్యాల జిల్లా (ఒకనాటి ఉమ్మడి కరీంనగర్ )ధర్మపురి లోని మా సాయిబాబా టాకీస్ సూపరేసి కాదని మరెవ్వరనగలరు…?
ఆ టాకీస్ ప్రొజెక్టర్ రూములకాడ ఫిల్ములన్నీ వెతికి.. వాటిని కట్టలు కట్టి.. పెట్టెలు చేసి.. ఇంటికాడ ఫిలమెంట్ తీసిన బల్బుల వెనుకపెట్టి.. చూసినోళ్ల నుంచి నోట్ బక్ జోళ్లను గుంజి.. బాల్యంలో వేసిన సాయిబాబా టాకీస్ డూప్ సినిమా యాది బతికున్నంతకాలం గుర్తుండేదే కదా..?!!
ఒకటా, రెండా ఎన్నో, ఎన్నెన్నో, ఇంకెన్నో, మరెన్నో తీపిగుర్తులు.. మధుర జ్ఞాపకాల దొంతర అది.అందుకే నేటి వరల్డ్ థియేటర్స్ డేను పురస్కరించుకుని… ఆ స్ఫూర్తితో ఇప్పటికీ నాటి బ్లాక్ అండ్ వైట్ రీళ్ల నుంచి ఈస్ట్ మన్ మీదుగా… నేటి శాటిలైట్ పద్ధతిలోనూ ఊళ్లల్లో నడుస్తున్న అన్ని థియేటర్ల  సింబాలిక్ తీపిగుర్తుగా…ఎంత సాంకేతికత వచ్చినా.. మర్చిపోలేని అపారమైన ప్రభావాన్ని, మధురానుభూతుల్ని మాపై వదిలివెళ్లిపోయి.. చరిత్రగా మిగిలిన మా సాయిబాబా టాకీస్ ను ఓ సారి యాజ్జేసుకుంటూ..                                                                                        

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!