సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే ??

Sharing is Caring...

కొన్నాళ్ల క్రితం ఓ చానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో సిరివెన్నెల గురించి రచయిత త్రివిక్రమ్ భావోద్వేగ ప్రసంగం చేసారు.  నాటి ప్రసంగ పాఠం లోని ముఖ్య అంశాలు … ఆయన మాటల్లోనే ……..  
“సిరివెన్నెల సీతారామ శాస్త్రి కవిత్వం గురించి చెప్పటానికి నాకున్న శక్తి చాలదు. అంత వొకాబులరీ నాదగ్గర లేదు. సిరివెన్నెల సినిమాలోని పాట విన్నాకే తెలుగు డిక్షనరీ.. ‘శబ్ద రత్నాకరం’ అనేది ఒకటి ఉంటుంది అని తెల్సింది. . శబ్ద రత్నాకరం చూసి ఆ పాటలోని ఒక్కో పదానికి అర్థం తెలుసుకున్నాను. ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా.

ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని తపన పుట్టేలా కూడా రాయొచ్చు అని సీతారామశాస్త్రి చాటి చెప్పారు.ఒక టీనేజ్ కుర్రాడు ఓ పాటలోని అర్థం తెలుసుకుని ఆ రోజుకు ఆ ఎగ్జైట్ మెంట్ తో పడుకుంటాడు. అలాంటి తపనను రేకెత్తించగలిగిన స్థాయి ఉన్న కవి సిరివెన్నెల. సినిమా పాటలో అనేక గొప్ప పదాలు తీసుకొచ్చి.. ప్రేక్షకుడి ఆలోచన స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి.

చిరంజీవి సినిమాలో “తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం” అనే పదాలు పాటలో రాయడానికి, దర్శకుడు, నిర్మాతను ఒప్పించడానికి సీతారామశాస్త్రికి ఎన్ని గట్స్ ఉండాలో దర్శకుడిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నా.

హీరోల ఇమేజ్, దర్శకుల అర్థంలేని తనం, నిర్మాత వ్యాపార విలువలు, ప్రేక్షకుల అర్థం చేసుకోలేని తనం వీటన్నింటి మధ్యలో కూడా గొప్ప పాటను ఇవ్వడానికి ఆయన జీవితాన్నే ఖర్చు చేసుకున్నారు. ఆయన ఒదులుకున్న కుటుంబం.. ఆయన మాట్లాడలేని మనుషులు.. ఇలా ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు.

సిరివెన్నెల ప్రపంచమంతా పడుకున్నాక లేస్తారు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు.. అర్ధరాత్రి ఉదయించే భానుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని.. అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడటానికి బయల్దేరతారు. మనం జవాబు చెప్పలేని ప్రశ్నలను సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు.. హాల్లో కూర్చుంటాడు.బెడ్రూంలో కొచ్చి నిలబడతాడు. మనల్ని ప్రశ్నిస్తాడు. ఎప్పుడూ ఓటమి ఒప్పుకోవద్దు అని చెప్పి వెళతాడు.

అపుడెపుడో లక్డీకాపూల్ లో అమరావతి థియేటర్లో ‘సింధూరం’ చూశా.సినిమా అయిపోయింది. ఏదో అసంతృప్తి కలిగింది.ఆ చివర్లో ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా’ అనే పాట నన్ను బాగా కదిలించింది.  రెండు చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగల శక్తి సాహిత్యానికి, అక్షరానికి మాత్రమే ఉంటుంది.

సినిమా పాటకు ఇక్కడ విలువ లేదు. చాలామంది కవులు సినిమాలకు పాటలు రాయడం మూలంగా ఎందుకూ పనికి రాకుండా పోయారు. నోబుల్ స్థాయి వచన కవిత్వం రాయగలిగిన సీతారామశాస్త్రి అందరి మధ్యలో వెనకాల కూర్చుండి పోయారు. గొప్ప కవులంతా తెలుగు సినిమాకు పాటలు రాయడం వాళ్ల దురదృష్టం. మనందరి అదృష్టం. నేను తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.”

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!