ఈ’ మైకేలేంజ్ లో’ కథేమిటో? (1)

Sharing is Caring...

Taadi Prakash …………………………………………………… 

Artist Mohan’s Agony and Ecstacy………  ఏలూరు – దిగువ మధ్యతరగతి దీనజనులుండే గానుగుల పేట నించి తిన్నగా వెళితే వెంకట్రామా టాకీసు. అక్కడ రైట్ కి తిరిగి రమా మహల్, షా మహల్ దాటి, విజయ విహార్ ని చూసుకుంటూ ఒక్క నిమిషం నడిస్తే – సెయింట్ థెరిసాస్ గరల్స్ హైస్కూలు, కాలేజీ. భారీ సిమెంట్ గోడల మధ్య, పచ్చని చెట్ల మధ్య పేరొందిన క్రిస్టియన్ విద్యాసంస్థ. మా పెద్దక్క సుశీల, చిన్నక్క హేమలత చదువు అక్కడే. వాళ్ల కోసం మధ్యాహ్నం లంచ్ కేరేజీ తీసుకెళ్లేవాడు ఆర్టిస్ట్ మోహన్. చాలాసార్లు నేనూ వెళ్లాను. బరువైన పెద్ద ఉక్కు గేటులో చిన్న తలుపు తీసుకుని లోపలికి అడుగుపెడితే.. 

ఒక మహత్తరమైన దృశ్యం… వందల మంది ఆడపిల్లలు, అందరూ యూనిఫాంలో బిలబిలమంటూ చెట్ల కిందికి చేరుతుండేవాళ్ళు. సిస్టర్స్, లెక్చరర్స్ తిరుగుతూ ఉండేవాళ్లు. కబుర్లు, కేరింతలూ, లంచ్ అవర్, గంటసేపు ఆటవిడుపు – ఒక 70 MM ఫిల్మ్ చూస్తున్నట్టే. ఎర్ర మట్టితో, గాలికి వూగే పెద్ద చెట్లతో, పూల మొక్కలతో కళకళలాడుతున్న ఆడపిల్లల పసిముఖాలతో కేంపస్ వెలిగిపోతుండేది. ఓ మూల చెట్టు కింద మోహన్, నేనూ… సుశీలక్కా, లతా వచ్చి కేరేజీ తీసుకునేవాళ్ళు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ – మేరీ మాత, క్రీస్తు – స్టన్నింగ్ శిల్పం. కాలం అలల మీంచి వెళిపోయిన ఆ అందమైన అనుభవం, ఒక కళాకారుడి మీద దాని ప్రభావం – fallout గురించి 30 సంవత్సరాల క్రితం మోహన్ రాసిన వ్యాసం యిది.
ఫ్రాన్సూ వెళ్లక్కరలేదు, వెనిస్, ఫ్లారెన్సూ చూడనవసరం లేదు… ఈ మాటలు చదవండి చాలు. వచనం ఇలా రాయగలగాలని నా ఆకాంక్ష.ఈ జన్మకి తీరదేమో..!
ఇవి కార్టూన్ కబుర్లు కావు … చల్లని చావు కబురర్లు …… వెర్రి చిత్రకారుడు వాంగో ఆత్మహత్య చేసుకుని గత నెలకి వందేళ్లు అయింది … 50 ఏళ్ళక్రితం వాంగో జీవితకథని “లస్ట్ ఫర్ లైఫ్” నవలగా రాసిన ఇర్వింగ్ స్టోన్ వారం రోజుల క్రితం చనిపోయాడని పేపర్లలో చిన్న వార్త వచ్చింది. శిల్పి మైకేలేంజెలో, రచయిత జాక్ లండన్, సైకోఎనలిస్టు ఫ్రాయిడ్ జీవితాలను కూడా ఆయన నవలలుగా రాశాడు. అవి ఎన్నోసార్లు మళ్ళీమళ్ళీ అచ్చయ్యాయి. “లస్ట్ ఫర్ లైఫ్” సినిమాగా వచ్చింది. కిర్క్ డగ్లస్ హీరో. “ద ఎగని అండ్ ద ఎక్స్టెసీ” నవల కూడా సినిమాగా వచ్చింది. అందులో మైకేలేంజెలో పాత్రని చార్లెన్ హెస్టన్ వేశాడు. ఇవన్నీ సూపర్ హిట్లే.

ఇర్వింగ్ స్టోన్ అమెరికన్ రచయిత. కనుక నాకు పరిచయం లేదు. మైకేలేంజెలో మాత్రం నా బాల్యమిత్రుడు. ఆ పేరు వింటేనే నాకు రింగులు రింగులుగా చిన్ననాటి ఫ్లాష్ బ్లాక్ లు సినిమా లాగా తిరిగేస్తాయి. అవి నేను ఏలూరులో ఒకటో తరగతి చదువుకుంటున్న రోజులు. (22 రీళ్ళ సొంత స్టోరీ మొదలెట్టాడ్రా బాబూ అని జడుసుకోకండి) హైక్లాస్ కాన్వెంట్ చదువు చదివే అక్కయ్యకి మధ్యాహ్నం క్యారియర్ పట్టుకెళ్ళాలి. జారిపోయే చెడ్డీ లాక్కుంటూ, మరో చేతిలో క్యారియర్ తో బిక్కుబిక్కుమంటూ కాన్వెంట్లోకి అడుగు పెట్టేవాడ్ని.

అక్కడ ఓ డోమ్ కింద చిన్న సరోవరం. ఎదురుగా పెద్ద పాలరాతి విగ్రహం. ఎంత తెలుపో. ముడతలు పడ్డ గుడ్డ ముఖం మీద పడుతున్న మేరీమాత. ఒళ్ళో గాయాలుపడ్డ ఏసుక్రీస్తు.కాలివేళ్ళూ, గోళ్ళ నుంచి సన్నటి జుత్తు వరకు వేళ్ళాడిపోతున్న క్రీస్తు రూపం అచ్చం మన శరీరం లాగే చెక్కి ఉంటుంది. కానీ శరీరం మీద బట్టలు వందలు వేల మడతలతో అతిచిన్న వివరంతో సహా అన్నీ ఉంటాయి. కొలనులో ఎండ క్రీస్తు మునివేళ్ళ మీద ప్రతిఫలిస్తే అవి పారదర్శకంగా జిగ్గున మెరిస్తే, ఆ అందం ముందూ, దేవుడు ముందూ భక్తితో మోకరిల్లే భావం గుండెనిండా చుట్టుకునేది.
అబ్బురమో, ఆనందమో, విషాదమో, ఏమో, ఏమీ తెలియదుకానీ అక్కడే అలా ఉండిపోడం. కొన్నేళ్లు రోజూ ఇలా కేరియర్ మోసే పని భోజనాల గంట కొట్టేవరకూ గంట ఆ శిల్పం ముందు నించోటం.

మా ఊళ్ళో ఆ శిల్పి ఎక్కడున్నాడో కనుక్కోవాలని వెతికాను. సిమెంట్ తో గాంధీ, నెహ్రూ బొమ్మలు, బావితూరలు, పూలకుండీలు తయారుచేసే శిల్పి. మా యింటి దగ్గర్లోనే వుంటే వెళ్ళి చూశాను. కానీ “మా అక్కయ్య కాన్వెంట్లో బొమ్మ మీరే చెక్కారండీ” అని అడగలేదు. గాంధీ గారి బొమ్మని కార్టూను శిల్పంలాగా చేసినాయన, మేరీమాత ముక్కు అలా చెక్కలేడని నాకు నేనే నిర్ణయం చేసుకున్నాను. మేరీ, క్రీస్తులతో రోజూ గంటసేపు నా ప్రేమా, భక్తీ మూడేళ్ళు సాగింది. హఠాత్తుగా ఇంట్లో ఓసారి ఆ శిల్పం ఫొటో కన్పించింది.

ఆ పుస్తకం నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళా. ఈ శిల్పం గన్ బజార్ చర్చి దగ్గర ఉండొచ్చా అని అడిగా. మా నాన్న చెప్పారు. అతని పేరు మైకేలెంజేలో బూవరోటి ఫ్లోరెన్స్ (ఇటలీ లో పుట్టాడు). చనిపోయి చాలాకాలం అయింది. ఈ శిల్పం పేరు “పయొలా”. ఇదొకటే కాదు. చాలా శిల్పాలు చెక్కాడు. ఇదిగో ఇది డేవిడ్ విగ్రహం. (దానికి బెల్లం ఉండటం చూసి నాకు సిగ్గేసింది బాబో) ఇది దేవుడు మానవుణ్ణి సృష్టించే పెయింటింగ్. ఇలాంటివి కొన్ని వందలూ, వేలూ వేశాడు మైకేలెంజేలో. అన్నీ బావుంటాయి”. ఇంకా చాలా చెప్పాడు నాన్న.

Read Also ………………………… ఈ’ మైకేలేంజ్ లో’ కథేమిటో? (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!