సుదర్శన్ టి ……………
1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని.
టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. మరుసటిరోజు క్లాసులోకి రాగానే క్రమశిక్షణ ప్రాముఖ్యత చెప్పి ఇకపై క్లాసులో అందరూ నిటారుగా కూర్చోవాలని, చాలా attentive గా ఉండాలని అన్నారు. పిల్లలందరూ అలాగే కూర్చోవడం మొదలెట్టారు.
మరుసటిరోజు మనం ఓ ఉద్యమం మొదలెడుతున్నాం.. దాని పేరు The Third Wave. ఈ ఉద్యమం ద్వారా దేశాన్ని మార్చబోతున్నాం. అందులో మీరు భాగస్వాములవడం చాలా గొప్పవిషయం.ఇకపై మన పలకరింపు ఓ సెల్యూట్ తో మొదలవ్వాలి అని ప్రత్యేక సెల్యూట్ నేర్పించారు. పిల్లలందరూ రోజూ ఎవ్వరు కనబడినా హలో చెప్పడం బదులు సెల్యూట్ కొట్టడం మొదలెట్టారు.
మూడవరోజు పిల్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చారు, కొందరిని సీక్రెట్ మానిటర్ గా నియమించారు..వాళ్ళ పని నియమాలు పాటించని పిల్లలను గుర్తించి సీక్రెట్ గా రిపోర్ట్ చెయ్యడం. 4వ రోజు వీరితో ఓ ర్యాలీ నిర్వహించారు.30 మందితో ప్రారంభమైన ఈ ఉద్యమంలో (ఎక్స్పరిమెంట్) ఇప్పుడు 200 మందికి పైగా భాగస్వాములు అయ్యారు. పైగా ఈ ఉద్యమం అదుపు తప్పుతోందని అర్థమయ్యింది.
5 వ రోజు దీనికి ముగింపు పలకాలని నిర్ణయించి, ఇవ్వాళ మన ఉద్యమనేత మనల్ని ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు అందరూ ఆడిటోరియంలో అసెంబుల్ అవ్వాలని హుకుం జారీ చేశారు. పిల్లలందరూ ఆడిటోరియంలో మిలిటరీ డిసిప్లిన్ తో అసెంబుల్ అయ్యారు. ఆడిటోరియం కిక్కిరిసింది. అప్పుడు తెరమీద ఆ జర్మనీ నియంతకు సంబంధించిన ర్యాలీల వీడియోలు ప్రదర్శించారు.
చివరిగా టీచర్ పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ…”మిమ్మల్ని పూర్తిగా మార్చేయడానికి నాకు కేవలం 5 రోజుల సమయం పట్టింది. ఈ 5 రోజుల్లో మీరు మీ స్నేహితుల మీద కూడా గూఢచర్యం చేశారు వారి మీద నాకు పిర్యాదు చేశారు. స్నేహితులతో నవ్వడం మానేశారు.
జర్మనీలో జరిగింది ఇదే, ప్రజల సైకాలజీ మీద దెబ్బకొట్టి వారి మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళను పావులుగా వాడుకుని ఆ నియంత అధికారం కొనసాగించాడ”ని ముగించారు. పిల్లలకు విషయం అర్ధమైంది.
ఇప్పుడు మన చుట్టూ ఎవరైనా ఓ మత ఉద్ధరణకు పాటుపడుతూ తద్వారా దేశాన్ని ఉద్దరిస్తున్నాను అనుకుని, ఓ వ్యక్తిని అభిమానిస్తూ ఆ పార్టీకి ఓటేస్తుంటే అతను ఆ మందలో భాగమయ్యాడని మనం గుర్తించాలి. అలాంటి వారికి వీలైనంత దూరం జరగాలి లేకుంటే ఆ మందలో భాగం అవడానికి మనకు అట్టే సమయం పట్టదు.
(The Third Wave experiment ను అమెరికాలోని కాలిఫోర్నియాలో 1967 లో హిస్టరీ టీచర్ Ron Jones నిర్వహించారు. తర్వాత దీనిమీద 1981 లో The Wave సినిమా వచ్చింది. జర్మనీలో 2008 లో Die Welle అనే సినిమా కూడా వచ్చింది).

