Taadi Prakash………………………………………….
Artist Mohan’s Agony and Ecstacy…………………………………ఆ శిల్పి నిర్మించిన సిస్టైన్ చాపెల్ గురించి చెప్పాడు. “ఫ్లోరెన్స్ మన ఏలూరికి ఎంతదూరం. శెలవుల్లో మనం వెల్డామా? మైకేలెంజేలో లేకపోయినా పరవాలేదు. మీరు చెప్పిన సిస్టీన్ ఛాపెల్ చూద్దాం” అన్నా. ఇప్పుడు కాదు ఆనక నువు పెద్దయినాక వెల్దాం అని మా నాన్న చీఫ్ మినిస్టర్ లా హామీ ఇచ్చారు. నచ్చిన శిల్పాలు, బొమ్మలు ఉన్నచోటికి వెళ్లడం కూడా గగనమని, ఈ బతుకులో ఎన్నటికీ అందనంతటి అపురూరమైన అన్యాయమని తెలీదు.
కొంతకాలానికి ప్రతి పిల్లవాడూ ఎద్దులాగా ఎదిగినట్టే నేనూ ఓ దూడనయ్యా. కాలేజీ కుర్రవాడొకడు.. ద ఎగనీ అండ్ ద ఎక్స్టసీ నవల తెచ్చాడు. అది రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు చేసిన సంక్షిప్తీకరణ. లోపల వింత రంగుల్లో ఇలస్ట్రేషన్ లు. చదివితే పినోవా, మామామియా, మార్రేమియా, మడోనా, బాంబినో లాంటి అర్థం కాని ఇటలీ పదాలు. కథ తెలియడానికి అవేం అడ్డం కావనుకోండి.
మళ్ళీ చిన్ననాటి కల. ఫ్లోరెన్స్ కళ్ళ ముందు పరుచుకుంది. ఆ ఊరు సహజంగా కళాకారులూ, మేధావులూ అయిన వడ్రంగులూ, కంసాలీలూ, సాలీలూ, కవిత్వం కోసం, కళ కోసం ప్రాణం పెట్టే మెడిసీ మహారాజులు. అదంతా ఇటాలియన్ మల్లీశ్వరి.అది యూరప్ లో పునరుజ్జీవన కాలం. నవల చదూతూంటే నేరుగా గుర్రబ్బగ్గీ వేసుకుని పదిహేనో శతాబ్దపు మిలాన్ కీ, వెనిస్ కీ వెళ్ళిపోతారు. చాలాకాలం మెడిసీల భవంతిలో స్టాఫ్ ఆర్టిస్ట్ అయి పోతారు. మైకేలెంజేలో వెంటే మీరు కూడా రాకుమారితో ధామ్మని ప్రేమలో పడతారు.
డేవిడ్ శిల్పాన్ని పైకెత్తి పెట్టే కూలీల్లో ఒకడిగా మారిపోతారు. సిస్టిన్ చాపెల్ కప్పు కింద ఆయన వెల్లకిలా పడుకుని ప్రెస్కోలు పెయింట్ చేస్తుంటే పక్కన రంగుల చిప్పలు పట్టుకు నించుంటారు. శిల్పాలకు సన్నాహకంగా ఆయన గీసిన చార్ కోల్ స్కెచ్ ల కాయితాలన్నీ చుట్టి చంకన పెట్టుకుంటారు.
మీరు బొమ్మలు గీయడానికి కాయితాలూ, ఇంకులూ, కుంచెలూ ఎంత అవసరమో, ఇలాటి పుస్తకాలు కూడా అంతే అవసరం. ఒకసారి ఆ వాతావరణంలోకి వెళ్ళాక ముక్కూ మొహం తెలీని సవాలక్ష పేర్లు చదువుతారు. వాటి వెంటేపోతే ప్రతి పేరుకీ ఓ వెలుగూ, వాసనా మీకు మత్తెక్కిస్తాయి. మరిన్ని ఆర్ట్ ఆల్బమ్ లూ, పుస్తకాలూ మీరు వెతికేట్టు చేస్తాయి. మీకుండే బుల్లి వెర్రి కల సినిమా స్కోపూ, ఈస్ట్మన్ కలగా రూపొందడానికి మరో నవల లస్ట్ ఫర్ లైఫ్. పందొమ్మిదో శతాబ్దపు పారిస్ లోకి ప్రయాణం. ఎక్కడో నెదర్లాండ్స్ లో ఉండే మతగురువు వాంగో ఈ ప్రపంచ కళాకేంద్రానికి వస్తాడు. ఎలాంటి శిక్షణా లేదు.
బెల్జియంలో బోరినేజ్ బొగ్గుగని కార్మికులను చూసినపుడు గీసిన ‘పొటాటో ఈటర్స్’ లాంటి బొమ్మలు తప్ప సాంప్రదాయక చిత్రకళారీతి గురించి బొత్తిగా తెలీదు. పారిస్ నిండా గొప్ప మాస్టర్లు.చేయి తిరిగిన శిష్యులు. కోర్మన్ అనే నిర్దాక్షిణ్యమైన పంతులు గారు. మానవ శరీరాన్నీ, మనుషుల స్వభావాలనూ ఇట్టే చూపగల – ప్రతిభావంతుడైన హెన్రీ టులూన్ లో త్రెక్, డాన్స్ వేసే అమ్మాయిల ఒంటి వంపు మీద జలపాతంలా ఎగిరిపడి తిరిగి విచ్చుకునే ఎండని క్రేయాన్లు, పాస్టల్స్ తో వేసే ఎల్గర్ డెగా. ఇలా రాస్తూపోతే ఎందరో ఇంప్రెషనిస్టులు.
అందరూ లస్ట్ ఫర్ లైఫ్ లో మీకు కలుస్తారు.పారిస్ కి దూరంగా ఆర్లే స్ వాంగోతో కలిసి ఒకే గదిలో ఉండే – పాల్ గాగిన్, అక్కడి వెతల్లో బతకలేక తాహితీ దీవికి పోయి – అక్కడే బొమ్మలేసి, అక్కడే చనిపోతాడు.గాగిన్ జీవితంపై ఎన్నో పుస్తకాలు. మనకి బాగా తెలిసినవి సోమర్ సెట్ మామ్ రాసిన – మూన్ అండ్ సిక్స్ పెన్స్.
ఇందులో గాగిన్ జీవితం కంటే మామ్ సొంత కవిత్వం ఎక్కువ. కళ గురించీ, ఆడవాళ్ళ గురించి తనకున్న సుందరమైన సినికల్ భావాలన్నీ.. రాశాడు మామ్. ఈ నవల్లో కళాకారుణ్ణి దురూహ్యమైన మెలోడ్రమటిక్ వండర్ గా చూపిస్తాడు. కాని గాగిన్ జీవితం యథాతథంగా చిత్రించిన గొప్ప నవల ది గోల్డ్ ఆఫ్ దైర్ బాడీస్. ఇందులోని రియలిజం, గంభీరమైన పరిశీలన చిరకాలం వెంటాడతాయి. పాఠకుల్ని షాక్ చేయటం కోసమే రాసిన మామ్ ను మరికొంత చిన్నచూపూ చూస్తాం.
ఇర్వింగ్ స్టోన్ నవలలన్నీ కూడా పరిశోధించి రాసినవే. వాంగో జీవితం రాయాలని పారిస్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. యూరప్ అంతా తిరిగాడు. మైకేలేంజేలో కోసం కూడా ఏవేవో భాషల్లో ఉన్న ఎన్నో గ్రంథాలు అనువాదాలు చేయించి చదివాడు . ఈ తిరుగుడూ, పరిశోధనల కోసం ఆస్తినమ్ముకుని దివాలా తీశాడు. నవలలు పబ్లిష్ అయ్యాక సూపర్ హిట్ అయి మేడలు కట్టాడు. ఇలాంటి పనికిమాలిన పరిజ్ఞానం ఎంతైనా చెప్పొచ్చు. కానీ ఆర్టిస్టుల కత్యవసరం ఆ నవలలు చదవటం, ఆ ప్రపంచంలోకి పోవడం, నాటి ఆర్టిస్టుల గ్యాంగులతో కలిసి తిరగడం, బతకడం, బెంగపడడం.
కనుక పాతపుస్తకాల షాపుల్లోనో, కొత్త బుక్స్ ఉన్న షాపుల్లోనో వెతకండి.. డబ్బుల్లేవా? వెధవ సిగరెట్లు, టీలు తగ్గించి, అవసరమైతే కడుపుకి ఓ తుండు చుట్టుకుని పై ఖర్చు మిగిల్చి ఈ నవలలు కొనండి. తోటి మిత్రులూ, పుస్తకాల పురుగుల ఇంట్లోంచి ఇలాంటి పుస్తకాలు పాపభీతి లేకుండా దొంగతనం చేయండి. అర్జెంటుగా పీకల మీద ఉన్న పనులన్నీ పక్కనబెట్టి ముందు ఇవి చదవండి.
Chittoprasad – Life and work… M. Sholokhov – And Quiet Flows the Dawn…… Alberto Morevia – Bitter Honeymoon…… Mario Virgo Llosa – Way to Paradise… Irving Stone – Lust for Life, Agony and Ecstacy……. Tolstoy – Anna Karenina, Resurrection…….Nobokov – Lolita……Pearie Lamoor – Moulin Rouge… Amrita Shergill – Life………John Reed – 10 Days that Shook the World………Charles Gorham – Gold of their Bodies….. ఇంకా Marquez, Mayokovasky, Dostoevsky, Lermontov…
Read Also ..…………………………………… ఈ’ మైకేలేంజ్ లో’ కథేమిటో ?(1)