Strange customs …………………
ఈ ప్రపంచంలో ఎన్నోవింతలు, విశేషాలున్నాయి.. మనల్ని ఆశ్చర్య గొలిపే విషయాలున్నాయి. ప్రపంచం లోని అన్ని ప్రాంతాల్లో ఎవరైనా చనిపోతే వారి బంధువులు దహన సంస్కారాలు చేస్తారు. కానీ ‘ఇండోనేషియా’లోని ఒక గ్రామం లో మాత్రం మృత దేహాలకు దహన సంస్కారాలు చేయరు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆ గ్రామస్తులు చనిపోయిన వారిని పాతిపెట్టరు లేదా కాల్చరు. ఆ గ్రామం పేరు ట్రున్యాన్ ..
అక్కడ ప్రజలకు ఒక ప్రత్యేకమైన అంత్యక్రియల ఆచారం ఉంది. దాని ప్రకారం మరణించిన వ్యక్తి దేహాన్ని తెల్లటి వస్త్రంలో చుట్టి, సువాసనగల ఆకులతో కూడిన తరు మెన్యాన్ చెట్టు కింద వెదురు బోనులో ఉంచుతారు. మృతదేహం కుళ్లిపోయి, అస్థిపంజరం గా మారే వరకు ఎదురు చూస్తారు.
ఆ తర్వాత మరణించిన వారి అస్థిపంజరం నుంచి పుర్రె ను తీసుకొచ్చి రాతి బలిపీఠంపై ఉంచుతారు. ఆ విధంగా చేయడం అక్కడి ప్రజల ఆచారం. ఎన్నో వందల ఏళ్ళ నుంచి అలాగే జరుగుతున్నదట.ఈ ట్రున్యాన్ గ్రామం బాలి కి దగ్గర్లోని బాతూర్ సరస్సు ఒడ్డున, మౌంట్ అబాంగ్ సమీపంలో ఉంది.
ఇదొక సాంప్రదాయ బాలినీస్ గ్రామం. సాంస్కృతికంగా ఒంటరిగా ఉన్న ఈ గ్రామంలో ప్రధానంగా బాలి అగా (బాలినీస్ పర్వతం) ప్రజలు నివసిస్తున్నారు. వీరికి ఇదివరలో బాహ్య ప్రపంచం గురించి తెలియదు.ఇపుడు తెలుసుకుంటున్నారు.ఇక్కడి ప్రజలు సంప్రదాయవాదులు..ఇప్పటికీ పాత నవీన శిలాయుగ ఆచారాలను అనుసరిస్తున్నారు.
ఈ గ్రామస్తులు అనుసరించేవి మనకు వింతగా ఉంటాయి కానీ వారికి అవి ఆచారాల కింద లెక్క. ఇక్కడ పెళ్లికాని వారు ఏకారణంగా అయినా మరణిస్తే వారిని ఖననం చేస్తారు. పెళ్లి కానీ వారి విషయంలో ఈ రకమైన ఆచారాన్ని అనుసరిస్తారు. ఇంకో ఆచారాన్ని కూడా వీరు అనుసరిస్తుంటారు.
పెంగిరిమాన్ వేడుకలు అని పిలుచుకునే అంత్యక్రియల వేడుకలలో మహిళలు పాల్గొనడానికి అనుమతి లేదు.ఈ వేడుకకు ఒక మహిళ హాజరైనట్లయితే, ఆ గ్రామం ప్రకృతి విపత్తి ద్వారా నాశనం అవుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఇది ఏదైనా అగ్నిపర్వత విస్ఫోటనం లేదా భూకంపం లేదా అలాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యం కావచ్చు… అది గ్రామం ఉనికిని అంతం చేస్తుందని భావిస్తారు.
ఇలాంటి నియమాలను ఎవరు రూపొందించారో, ఇవి ఎప్పటి నుండి అమలులో ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ వీటిని మతపరంగా పాటిస్తున్నారు.ఈ ట్రున్యాన్ గ్రామానికి పర్యాటకులు కూడా వచ్చి వెళుతుంటారు.
బాలి రాజధాని డెన్పసర్ నుండి దాదాపు 3 గంటల పాటు ప్రయాణం చేయాలి.ఈ ప్రదేశానికి చేరుకోవడానికి, పడవలు లేదా చెక్క జెట్టీలు అందుబాటులో ఉంటాయి. ఈ పడవలు బాతూర్ సరస్సు గుండా ట్రున్యాన్కు తీసుకెళతాయి. అక్కడి ప్రజల మత విశ్వాసాలను గౌరవించాలని పర్యాటకులకు టూర్ ఏజంట్లు లేదా గైడ్స్ ముందుగా చెబుతారు. ఈ ప్రాంతాన్ని పుర్రెల ద్వీపం అని కూడా పిలుస్తుంటారు.