ఆ గురువాయూర్ ‘కేశవన్’ కథ ఏమిటి ?

Sharing is Caring...

 సుదర్శన్ టి…………………

గురువాయూర్ దర్శించినవారు అక్కడ 12 అడుగుల ఎత్తున్న ఏనుగు విగ్రహాన్ని చూసే ఉంటారు. దాని పేరు ‘కేశవన్’. దేశంలో “గజరాజ” బిరుదు పొందిన మొదటి ఏనుగు ఇదే. ఏనుగులకు కేరళ రాష్ట్రంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏనుగులను ఆలయాలకు కానుకగా ఇచ్చే ఆచారం ఇక్కడ వుంది.

1916 లో గురువాయూరప్పన్ మొక్కు చెల్లించుకోడానికి నిలంబూర్ మహారాజు 10 ఏళ్ల వయసున్నపుడు ఈ ఏనుగును గురువాయూర్ దేవస్థానానికి కానుకగా సమర్పించారు. దానికి కేశవన్ అని పేరు పెట్టారు. గురువాయూర్ ఆలయానికి ఓ ప్రత్యేక ఏనుగుల సంరక్షణాలయమే ఉంది. అందులో 50-60 ఏనుగులు ఉంటాయి. కేశవన్ చాలా అల్లరి చిల్లరగా ప్రవర్తించే, మావటివారిని లెక్కచేయని ఏనుగయ్యింది..

కానీ గురువాయూరప్పన్ ఆలయ ప్రసాదాలు తిన్న మహిమేమో…. కొన్నాళ్ళకే శాంత స్వభావం కల ఏనుగుగా మారిపోయింది. మరో ఆశ్చర్యం ఏమిటంటే ప్రతి ఏకాదశి రోజూ ఈ ఏనుగు ఏమీ తినదు, పచ్చి గంగకూడా ముట్టేది కాదు. కేశవన్ లో ఈ ప్రవర్తన అంతకు ముందు ఎప్పుడూ చూళ్ళేదు.

ఓసారి ఈ కేశవన్ వడివడిగా ఆలయంవైపు వెళుతుంటే అనుకోకుండా ఓ కుష్టురోగి దారికి అడ్డొచ్చాడు. కేశవన్ ఆగి, చాలా నెమ్మదిగా, శ్రద్ధగా అతన్నితన తొండంతో పక్కకు జరిపి ముందుకు వెళ్ళింది. ఇలా కేశవన్ ఓ సాధువులా మారిపోయింది.

మలయాళ మాసం కుంభం లో గురువాయూరప్పన్ కు 10 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజు స్వామివారి ఊరేగింపు ఏనుగు పైనే జరుగుతుంది. అంతకుముందు ఏనుగుల పరుగుపందెం నిర్వహిస్తారు. పందెంలో గెలిచిన ఏనుగుకు స్వామి వారిని మోసే భాగ్యం కలుగుతుంది. ఆ పందెంలో ప్రతిసారీ కేశవన్ గెలిచేది. క్రమేపీ కేశవన్ వయసు మళ్ళింది.ఒక సారి పందెంలో రెండవ స్థానం వచ్చింది. కానీ స్వామిని మరో ఏనుగును మోయనివ్వలేదు. గొడవ చేసింది. చేసేది లేక కేశవన్ మీదే ఊరేగించారు.

మరుసటి సంవత్సరం ఏకాదశినాడు కేశవన్ ను గురువాయూర్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఇనుప గొలుసులతో కట్టేశారు. కానీ అది గొలుసులు తెంపేసుకుని 35 కిలోమీటర్లు పరుగెత్తుకొచ్చి ఆలయం ముందు మొండికేసింది. అప్పటి నుండి కేశవన్ బ్రతికున్నంత వరకూ స్వామివారిని కేశవన్ మాత్రమే మోయాలి అని దేవస్థానం నిర్ణయించింది.

ఏనుగు పైకి ఎక్కాలంటే అది తన వెనుక కాళ్ళు కిందికి పెడుతుంది దాని మీద నుండి పైకి ఎక్కుతారు. కానీ కేశవన్ స్వామివారి కోసం తన ముందు కాళ్లను కిందకు వంచేది. స్వామివారు అలా తనమీదకు హుందాగా ఎక్కాలని దాని కోరిక. మళ్ళీ గొడుగులు పట్టేవారిని ముందు నుండి ఎక్కనివ్వదు, వెనుక నుండే ఎక్కాలి. అలా కేశవన్ స్వామికి సేవచేసుకునేది.

1976…కేశవన్ కు 70 ఏళ్లు నిండాయి. బాగా ముసలిదయ్యింది. సరిగ్గా నిలబడలేకపోతోంది. డిసెంబర్ 2, ఏకాదశి రోజున, యధావిధిగా ఉపవాసం ఉంది. స్వామి వారిని పైకి ఎక్కించుకుంది కానీ నిలబడలేకపోతోంది, వణుకుతోంది. తన సమయం ఆసన్నమయ్యిందని అర్థమయ్యింది.

స్వామివారిని మరో ఏనుగు మీదకు మార్చారు. కేశవన్ నెమ్మదిగా ఆలయ ప్రదక్షిణ చేసింది. ఆలయం పక్కనున్న గ్రౌండ్ లోకి వెళ్ళి మెల్లగా కూర్చొని తొండం ఆలయం వైపు సాచి గురువాయూరప్పన్ కు నమస్కరించింది. అక్కడే ప్రాణాలు విడిచింది. 60 ఏళ్ల.పాటు స్వామివారిని సేవించుకుని కాలం చాలించింది.

కేశవన్ ను కడసారిగా చూడడానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. కేశవన్ భక్తికి గుర్తుగా దాని దంతాలను ఆలయ ప్రవేశ ద్వారం మీద అలంకరించారు. ఇప్పటికీ మనం ఆ దంతాలను చూడొచ్చు. కేశవన్ గుర్తుగా 12 అడుగుల కాంక్రీట్ విగ్రహాన్ని నిర్మించారు. ఇప్పటికీ కేశవన్ వర్ధంతి రోజు ఓ పెద్ద ఏనుగుల ఊరేగింపు వస్తుంది. అందులో ఒక ఏనుగు కేశవన్ మెళ్ళో పెద్ద పూలదండ వేసి గౌరవించి వెళుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఒక్క నిమిషం కేశవన్ ముందు ఆగి కేశవన్ భక్తిని, సేవలను గుర్తుచేసుకుంటారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!