Kasar Devi Temple
కాసర్ దేవి ఆలయం.. ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఈ ఆలయం,ఆ పరిసరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం క్రీస్తుశకం 2వ శతాబ్దం నాటిది.ఇక్కడ అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో వెలిశారని, శుంభ-నిశుంభ అనే రాక్షసులను సంహరించిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లో కుమావున్ ప్రాంతంలోని ‘అల్మోరా’ సమీపంలో ఉంది.
కొన్నిచారిత్రక ఆధారాల ప్రకారం, క్రీస్తుశకం 2వ శతాబ్దంలో రుద్రక్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. మరికొన్నిస్థానిక కథనాల ప్రకారం, కుమావూన్ ప్రాంతాన్ని పాలించిన కట్యురి రాజులు (ముఖ్యంగా కటార్మాల్) ఈ ఆలయాన్ని నిర్మించారు. వారు దుర్గాదేవికి పరమ భక్తులు కావడంతో ఇక్కడ కాత్యాయని దేవిని ప్రతిష్టించారని చెబుతారు. కాలక్రమేణా ఈ ఆలయం అనేక మార్పులకు లోనైంది. వివిధ దశల్లో అభివృద్ధి చెందింది
ప్రత్యేకత ఏమిటంటే ?……..
ఇక్కడి భూమిలో అపారమైన భూ-అయస్కాంత శక్తి (Geomagnetic Field) ఉందని నాసా తేల్చి చెప్పింది. నాసా పరిశోధనల ప్రకారం అపారమైన భూ-అయస్కాంత శక్తి ఉన్న మూడు ప్రధాన ప్రాంతాలలో కాసర్ దేవి ఒకటి. మిగిలిన రెండు ప్రాంతాలు పెరూలోని మాచు పిచ్చు, ఇంగ్లాండ్‌లోని స్టోన్‌హెంజ్.ఈ మూడు ప్రాంతాల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనేది ఇప్పటికీ పరిశోధనాంశమే.
వాన్ అలెన్ బెల్ట్ ప్రభావం వల్ల ఇక్కడ ఒక విధమైన విశ్వ శక్తి (Cosmic Energy) కేంద్రీకృతమై ఉంటుందని నమ్ముతారు.ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ధ్యానం చేయడానికి అత్యంత అనువైన ప్రదేశం గా పరిగణిస్తారు.
సాధారణంగా భూమిపై అన్ని చోట్లా అయస్కాంత శక్తి సమానంగా ఉండదు. కానీ కాసర్ దేవి ఆలయం చుట్టూ ఉన్న రాళ్లలో, భూమిలో అసాధారణమైన అయస్కాంత శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆ శక్తి ఇక్కడే ఎందుకు కేంద్రీకృతమైంది అనేది విషయాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు. అది ఇప్పటికీ మిస్టరీ గా ఉండి పోయింది.
అయస్కాంత శక్తి వలన లాభమా? నష్టమా?
శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా చూస్తే, ఈ ప్రాంతంలోని అయస్కాంత శక్తి వల్ల లాభాలే ఎక్కువ. అది సాధారణ అయస్కాంతం లాగా వస్తువులను లాక్కోదు, కేవలం సూక్ష్మమైన తరంగాల రూపంలో పనిచేస్తుంది. ఇక్కడి అయస్కాంత తరంగాలు మెదడులోని ‘ఆల్ఫా తరంగాల’ను (Alpha waves) ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ధ్యానం చేసేటప్పుడు మనస్సు చాలా త్వరగా ఏకాగ్రతను పొందుతుంది.
ఇక్కడ గడిపే సమయం శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, నాడులను ఉత్తేజితం చేస్తుందని పర్యాటకుల అనుభవం.అధిక అయస్కాంత క్షేత్రాలు ఉన్నచోట నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి పెరుగుతాయని నమ్ముతారు.
అయస్కాంత తరంగాల వలన సాధారణ పర్యాటకులకు ఎలాంటి నష్టం కలగదు.కొన్నిసార్లు అత్యంత సెన్సిటివ్ గా ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా దిక్సూచిలు (Compasses) ఇక్కడ స్వల్పంగా తప్పుగా పనిచేసే అవకాశం ఉంది. కొందరికి ఇక్కడి అధిక శక్తి వల్ల మొదట్లో స్వల్పంగా తల తిరగడం లేదా భారంగా అనిపించడం వంటి అనుభూతి కలగవచ్చు, కానీ అది ప్రమాదకరం కాదు.
కాసర్ దేవి లోని అయస్కాంత శక్తి ఒక ‘నేచురల్ హీలర్’ (ప్రకృతి వైద్యం) లాంటిది. అందుకే దీనిని ‘కాస్మిక్ ఎనర్జీ హబ్’ అని పిలుస్తారు.ప్రశాంతమైన వాతావరణం కారణంగా ధ్యానం చేసేవారికి ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ధ్యానం కోసం వసతి సదుపాయాలున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక ధ్యాన గది ఉంది.ఆలయానికి సమీపంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన గుహ ఉంది. చాలామంది ఇక్కడ ధ్యానం చేస్తుంటారు.
ఈ ఆలయం ఒక కొండపైన, దేవదారు అడవుల మధ్య ఉంటుంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, హిమాలయాల దృశ్యాల మధ్య ఎక్కడ కూర్చుని అయినా ధ్యానం చేసుకోవచ్చు. పరిసర ప్రాంతాల్లో రామకృష్ణ కుటీర్, బోధ్ ఆశ్రమం, డాల్ ఆశ్రమం వంటి అనేక కేంద్రాలు ధ్యాన సెషన్లను నిర్వహిస్తాయి.
కాసర్ దేవి ఆలయానికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు, ఆధ్యాత్మిక అన్వేషకులు వస్తుంటారు.ముఖ్యంగా కార్తీక పూర్ణిమ సమయంలో నిర్వహించే ‘కాసర్ దేవి మేళా’కు స్థానికులతో పాటు దేశవిదేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.
దీని చారిత్రక ప్రాధాన్యత నాసా (NASA) ప్రస్తావించిన అయస్కాంత శక్తి కారణంగా ఇటీవల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1890లో స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. తదనంతరం రామకృష్ణ మిషన్ కూడా ఇక్కడ కొన్ని సేవలను అభివృద్ధి చేసింది.
రవీంద్రనాథ్ ఠాగూర్, బాబ్ డైలాన్ వంటి ప్రముఖులు ఇక్కడ ధ్యానం చేసారని చెబుతారు. కాసర్ దేవి చుట్టుపక్కల అనేక ఆధ్యాత్మిక, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి.బిన్సార్ వైల్డ్ లైఫ్ శాంచురీ,చిత్తై గోలు దేవత ఆలయం ,కటార్మాల్ సూర్య దేవాలయం, జగేశ్వర్ ధామ్ ,నందా దేవి ఆలయం చూడదగినవి.
మార్చి నుండి జూన్ వరకు,సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచు పడటం చూడాలనుకునే వారు డిసెంబర్, జనవరి మాసాల్లో వెళ్ళవచ్చు. అల్మోరా కి విమానంలో వెళ్లాలనుకుంటే .. సమీప విమానాశ్రయం పంత్నగర్ .ఇది ఆలయానికి సుమారు 124-125 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా అల్మోరా చేరుకోవచ్చు.
రైలు ద్వారా అయితే సమీప రైల్వే స్టేషన్ కత్గోడం ఇది 88-95 కి.మీ దూరంలో ఉంది. ఢిల్లీ నుండి ‘రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్’ లేదా ‘సంపర్క్ క్రాంతి’ రైళ్లలో ఇక్కడికి చేరుకుని, అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా వెళ్ళవచ్చు.. అల్మోరా పరిసరాల్లో అన్ని బడ్జెట్లకు తగ్గట్టుగా వసతి సౌకర్యాలు ఉన్నాయి.అల్మోరా నుండి ఎనిమిది కిలోమీటర్ల నడక ద్వారా లేదా రోడ్డు మార్గంలో 10 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా కాసర్ దేవి ఆలయాన్ని చేరుకోవచ్చు.

