ఆరాజు చేసిన తప్పేంటి ?

Sharing is Caring...

Shyam Mohan …………………..

‘‘ ఒకపుడు కర్మవరం ను వెంకటరాయుడు అనే యువరాజు పాలిస్తున్నాడు. అతను ఇతర రాజుల లాగా కాకుండా కాస్త చదువు, సంస్కారంతో పేదల కష్టాల పట్ల అవగాహన ఉన్న చురుకైన వాడు. తన రాజ్యంలో ఎవరూ ఆకలితో బాధలు పడకూడదని, ఎవరికి ఎలాంటి చిన్న సమస్య కూడా ఉండకూడదని తపించేవాడు. 

ప్రజలు తమ సమస్యలు రాజుకు చెప్పుకోవడానికి  మెహమాటం పడతారని భావించి తనే జనం మధ్యకు వెళ్లి వారి కష్టాలు తీర్చాలను కొని ‘నమస్తే కర్మవరం’ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతీరోజు గ్రామాలకు వెళ్లి ‘అవ్వా… అక్కా … అన్నా మీకేమైనా సమస్యలున్నాయా?’’ అని అడిగి మరీ తీర్చేవాడు. ఎవరైనా రోగాల పాలైతే మంచి వైద్యం చేపించుకోమని జేబులోంచి కాసులు  తీసి ఎంతైనా ఇచ్చేసేవాడు.

రోడ్లు, మురుగు కాల్వలు శుభ్రంగా లేక పోతే స్ధానిక అధికారులను పిలిచి దగ్గరుండి వాటిని బాగు చేయించే వాడు. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతీ రోజు ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు లేకుండా చేశాడు. ఆలా అతని కీర్తి దేశమంతా వ్యాపించింది.ఇతర దేశాల నుండి ఎందరో ప్రముఖులు కర్మవరం వెతుక్కుంటూ వచ్చి వెంకటరాయుడు ని అభినందించేవారు.

మీడియా స్పెషల్‌ ఇంటర్వ్యూలు చేసింది. కాలం ఇలా సాగుతుండగా ఎన్నికలు వచ్చాయి. వెంకటరాయుడు పై ప్రజల్లో ఉన్న పాపులారిటీ చూసి, అతని పై పోటీ చేయడానికి ఆ ప్రాంతపు నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి వేరే ప్రాంతపు నాయకుడు అతికష్టం మీద నిలబడ్డాడు.
పోలింగ్‌ జరిగి ఫలితాలు వచ్చాయి.ఎవరూ ఊహించని విధంగా వెంకటరాయుడు ఓడిపోయాడు! ’’

బేతాళుడు ఈ కథ చెప్పి..‘‘ విక్రమార్కా ….వెంకటరాయుడు ఓడిపోవడం నీక్కూడా షాక్‌ కలిగించింది కదూ! అతడి ఓటమిని చూసి రాజకీయ పండితులే తలలు పట్టుకున్నారు. నిత్యం ప్రజల మేలు కోరే ఆ రాజుకు ఎందుకిలా జరిగింది?అతను చేసిన తప్పు ఏమిటి? తెలిసి కూడా చెప్పక పోతే …’’ అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు.

‘‘ వెంకటరాయుడి కార్యక్రమం ‘నమస్తే కర్మవరం’ వీడియోలు నేను కూడా పరిశీలించాను. అతను రోజూ పొద్దున్నే వీధుల్లోకి వచ్చి మీకేమైనా సమస్యలున్నాయా అని అడుగుతుంటే విసుగ్గా చూస్తున్న జనాలను చూశాను. కొందరైతే కనీసం రాజుగారు మన దగ్గరకు వచ్చారనే మర్యాద కూడా లేకుండా, వంటి మీద చొక్కాలు కూడా వేసుకోకుండా ఇళ్ల నుండి బయటకు వచ్చి చికాగ్గా  ముఖాలు పెట్టిన దృశ్యాలున్నాయి.

రాజు అడిగే వరకు తమ సమస్యలు ఏమిటో కూడా తెలీని మనస్తత్వంతో జనం ఉండేవారు. 
సమాజంలో విలువలు, మంచి తనానికి అర్థాలు మారిపోతున్నాయి . ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మాత్రమే సాయం చేస్తే జీవితాంతం గుర్తుంటావు.  అడక్కుండా అస్సలు సాయం  చేయకూడదు దానికి విలువ ఉండదు. పైగా నీకేదో ప్రయోజనం ఉండి సాయం చేశావనే చులకన భావం ఏర్పడుతుంది. వెంకటరాయుడి విషయంలో అదే జరిగింది. 

సమస్యలతో ఉన్న వారిని పదిసార్లు తన చుట్టూ తిప్పించుకొని ఎప్పుడో పరిష్కారం చేస్తే అతడి విలువ వారికి తెలిసేది. అలా కాకుండా అతడే తమ తలుపు తట్టి కష్టాలు తీరుస్తుంటే వారికి లోకువ అయ్యాడు.చిత్తుగా ఓడించారు .  ’’ అన్నాడు. విక్రమార్కుడికి అలా మౌనభంగం కలగ గానే బేతాళుడు శవంతో సహా మాయమై ఏటో వెళ్లి పోయాడు . .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!