Who is this Madalasa ?
కుమారుడు ‘అలర్కుడు’ ఏడుస్తుంటే మహాజ్ఞాని అయిన అతని తల్లి మదాలస జోల పాట పాడుతుంది. మదాలస ప్రస్తావన మార్కండేయ పురాణంలో వస్తుంది. ఆ జోల పాట సంస్కృత భాషలో ఉంది.
ఆ తరువాత అతడు పెరిగే క్రమంలో ఆమె చేసిన బోధ “మదాలసోపాఖ్యానం” గా ప్రసిద్ధి చెందింది. పిల్లల పెంపకంలో పాటించాల్సిన విలువలను చాటిచెప్పింది. ఈ పాటని గాబ్రియెల్లా బర్నెల్ (తన ఐదో ఏట నుండే సంస్కృతం నేర్చుకుంది) అద్భుతంగా పాడింది.
ఈ క్రింది వీడియో లోనిది నిజమైన వివరణ కాదు. సమాచార లోపం జరిగినట్లుంది. అసలు కథ కొంచెం సంక్లిష్టమైనదే. అదేమిటో తెలుసుకుందాం ….
మహారాజు కువలయాశ్వునికి ( మరో పేరు ఋతధ్వజుడు) తన మహారాణి, గొప్ప జ్ఞాని అయిన మదాలస ద్వారా మొదట ముగ్గురు కుమారులు కలిగారు. వారి పేర్లను స్వయంగా మహారాజే ముందుగా నిర్ణయించి తానే నామకరణం చేశాడు.
వారు వరుసగా 1) విక్రాంతుడు ( అర్థం – గొప్ప శక్తి, తెగువ కలవాడు) 2) సుబాహుడు ( అర్థం – మంచి, అందమైన చేతులు, భుజములు కలవాడు) 3) శత్రుమర్దనుడు ( అర్థం – శత్రువులను జయించేవాడు). ఒకరి తరువాత ఒకరు ఇలా పుత్ర సంతానానికి నామకరణం జరిగిన ప్రతిసారీ రాణి మదాలస నవ్వేది.
రాజుకి విషయం అర్థమయ్యేది కాదు. ముగ్గురు కొడుకులకూ ఆమె తన జోలపాట ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని బోధించింది. ( ఈ జోలపాటే క్రింది వీడియోలో ఉన్నది. ) కాలక్రమేణా వారు రాజ్యం, సంసారం పట్ల విరక్తులై సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తపస్సుకి వెళ్ళిపోయారు.
తరువాత పుట్టిన నాలుగో పుత్రుడికి ఆమెనే పేరుపెట్టమని అడిగాడు మహారాజు. ఆమె అతనికి అలర్కుడు ( అర్థం – పిచ్చి కుక్క) అని పేరు పెట్టింది. ముగ్గురు కుమారులకు అందమైన, అర్థవంతమైన పేర్లు పెట్టిన మహారాజు ఆ పేరు విని బాధపడ్డాడు.
అప్పుడు మదాలస… పేరులో ఏముంది మహారాజా! సృష్టి అంతా ఐదు ధాతువుల సమాహారం. ఈ శరీరం కూడా ఆ ఐదు ధాతువులతోనే ఏర్పడింది. కాబట్టి వృద్ధి, క్షయం అనేవి దీనికీ తప్పదు. నిర్వికారమైన, శాశ్వతమైన ఆత్మ ప్రామాణికం. కాబట్టి నువ్వు పెట్టిన అందమైన పేర్లు అర్థవంతమైనవని భావించకు… అని చెప్తుంది.
ఈ నాలుగో సంతానాన్ని కూడా విరక్తుడిని చేయకు అన్న మహారాజు కోరిక మేరకు అలర్కుడిని సకల విద్యాపారంగుతుడ్ని చేసి మహారాజుగా పట్టాభిషేకం జరిపించి భర్తతో సహా వానప్రస్థం చేరుకుంది మదాలస. ఆ తరువాత ఎన్నో ఏళ్ళు జనరంజకంగా పాలించిన అలర్కుడు, మహాగురువైన దత్తాత్రేయస్వామి కృపతో బ్రహ్మ జ్ఞానం పొందాడు.
ఈ వీడియోలో ఉపోద్ఘాతం తప్పు అవొచ్చేమో గానీ, గాబ్రియెల్లా బర్నెల్ ని మెచ్చుకోకుండా ఉండటం సాధ్యం కాని పని. ( ఆ జోలపాట లోని అన్ని శ్లోకాలు ఈ వీడియోలో లేవు, అలా ఆమె ప్రయత్నించలేదని గమనించ మనవి.
వినండి గాబ్రియెల్లా బర్నెల్ గానం
………….. పులి. ఓబుల్ రెడ్డి