ఆ మంచు పర్వతం ఢీ కొంటే ??

Sharing is Caring...

అట్లాంటిక్  సముద్రంలోనే  మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న మంచుకొండ దగ్గరలోని ఒక దీవిని ఢీకొట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మంచుకొండ ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేసిన పరిశోధకులు అది ఖచ్చితంగా జార్జియా ద్వీపం వైపు దూసుకెళ్తున్నదని అంటున్నారు. ఆ మంచుకొండను  A 68 A  పేరుతో పిలుస్తున్నారు. ఈ మంచు పర్వతం చాలాకాలం క్రితం దక్షిణ ధృవంలోని  అంటార్కిటికా మంచుఖండం నుంచి వేరయింది. ఒకప్పుడు అది ఇపుడున్న సైజు కంటే పెద్దగా ఉండేది. కాలక్రమంలో ఈ మంచుకొండ మూడు ముక్కలయింది. ఆ మూడు ముక్కల్లో   A 68 A  అతి పెద్దదని పరిశోధకులు చెబుతున్నారు. దీని పొడవు 150 కిలోమీటర్లు. వెడల్పు 48 కిలోమీటర్లు ఈ కొలతలను బట్టి దాని సైజు ఎంతదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాగా మిగిలిన రెండింటిని  సైజులు వారీగా A 68 B, A 68 C  గా విభజించి పిలుస్తున్నారు. 

2017 లో అంటార్కిటికా లోని లార్సెన్ సి ప్రాంతంలో ఈ మంచు పర్వతం ముక్కలుగా విడిపోయింది . వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా మంచు కరిగి పర్వతం మూడు భాగాలుగా మారిందని భావిస్తున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మంచు ఎక్కువ కాలం గడ్డగా ఉండదని… నెమ్మదిగా కరిగిపోక తప్పదని శాస్త్రజ్ఞుల వాదన. మొత్తం మీద ఏదో ఒకనాటికి అంటార్కిటికా లో మంచు కరిగిపోతుందని వారు చెబుతున్నారు. అక్కడ మంచు కరిగిపోయే పక్షంలో భూమిపై సముద్ర మట్టం పెరిగిపోవచ్చు. ఫలితంగా కొన్ని ద్వీపాలు , కొన్ని దేశాల్లోని ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం కూడా లేకపోలేదు. 
ప్రస్తుతం ఈ  A 68 A  ఐస్ బర్గ్ అల్లే ప్రాంతంలో ఉంది. ఇది మెల్లగా కదులుతూ దక్షిణ జార్జియా ద్వీపం వైపు వెళుతున్నదని   బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ చెబుతున్నారు.

ఈయన చాలా కాలంగా ఈ మంచు పర్వతం కదలికలను గమనిస్తున్నారు. మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ తరపున డేవిడ్ లాంగ్  మహాసముద్రాలు, ధృవ ప్రాంతాలు, వృక్షసంపద ప్రాంతాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.  ఇక జార్జియా దీవి  అట్లాంటిక్ మహాసముద్రంలోనే ఉన్నది. ఈ ప్రాంతంలో మనుష్యులు పెద్దగా ఉండరు.  పెంగ్విన్, సీల్ వంటి జీవులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మంచులో బతికే జీవులు మరికొన్ని కూడా ఉండొచ్చు. సముద్రజలాలలో అపారమైన మత్స్య సంపద ఉంది. 
ఆ మంచుకొండ వచ్చి దీవిని ఢీకొనే క్రమంలో ఈ జంతుజాలం మొత్తం దెబ్బతిన వచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మరి కొన్నిజీవులు ఢీ కొనే సమయంలో చనిపోవచ్చని కూడా చెబుతున్నారు.

మరికొన్నింటికి ఆహరం సంపాదించుకునే అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు. ఫలితంగా ఇక్కడి జీవులకు ఇక్కట్లు తప్పవు. మంచు కొండ అన్నింటికీ అడ్డం పడవచ్చని అంచనావేస్తున్నారు. ఢీ కొన్న తదుపరి అది అక్కడే ఉంటుందా ? ప్రయాణం కొనసాగిస్తుందా ? మధ్యలో కొండ విచ్చిన్నమయ్యే అవకాశాలున్నాయా అనే అంశాలపై కూడా పరిశోధకులు చర్చిస్తున్నారు.ఇక దక్షిణ జార్జియా అట్లాంటిక్ సముద్రంలో, దక్షిణ అమెరికా కు దగ్గర్లోని ఒక ద్వీపం. ఇది బ్రిటన్ కు చెందిన దీవి. ఇక్కడ విశేషరీతిలో చేపలను పడుతుంటారు. మత్స్య రంగంలో బ్రిటన్ కు ఈ ప్రాంతం మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నది.  A 68 A  వచ్చి ఈ దీవిని ఢీకొంటే బ్రిటన్ ఆర్ధికవ్యవస్థ కష్టాల్లో పడుతుంది.  దీంతో పరిశోధకులు ,శాస్త్రవేత్తలు అప్రమత్తమైనారు. ఎప్పటికప్పుడు A 68 A  ప్రయాణించే మార్గాన్ని గమనిస్తూ ఉపగ్రహ చిత్రాలను తీస్తున్నారు. ఆ మంచు కొండను దారిమళ్లించాలని లేదా ఏదో ఒకటి చేసి  ఉపద్రవం బారినుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.  ఏమి జరుగుతుందో చూడాలి. 

——— K.N.Murthy

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!