Mohammed Rafee ………..
నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు! భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఈసారి బస్సుకు ఎదురుగా వెళ్లి తన కుమార్తెతో పాటు చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ సమాచారం తిరుమలగిరి పోలీసులకు అందింది. ఎసీపీ రమేష్ ఆదరించారు.
అసలేం జరిగింది ……..
కొన్నాళ్ళుగా శ్యామల, తన కుమార్తెతో కలసి తిరుమలగిరిలో ఒక ఆశ్రయ హోమ్ లో ఉంటోంది! అయితే ఇద్దరి ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అన్నీ బెడ్ పైనే జరిగే దశకు చేరుకోవడంతో ఆ హోమ్ నిర్వాహకులు చేతులెత్తేశారు! తమకు భారంగా ఉందని, సర్వీస్ చేసే వాళ్ళు లేరని హోమ్ ఖాళీ చేసి వెళ్లాలని పలు మార్లు చెప్పినా శ్యామల వినలేదని సమాచారం.
దాంతో నిన్న హోమ్ నుంచి బలవంతంగా పంపించేశారు.ఆరోగ్యం బాగాలేకున్నా శ్యామలలో కోపం ఏమాత్రం తగ్గలేదు!హోమ్ నిర్వాహకులపై కోపంతో బలవన్మరణానికి పాల్పడతామని బెదిరించిందట. తిరుమలగిరి రోడ్ల పై నిలబడి చంపేయండి అన్నదట! ఆ హోమ్ నిర్వాహకులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.
ఎసిపి రమేష్ వెంటనే స్పందించి, వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకున్నారు. కార్ఖనాలో వున్న ఆర్కె ఫౌండేషన్ హెల్త్ కేర్ లో చేర్పించారు. తల్లికూతుర్లకు బెడ్ లు కేటాయించి చికిత్స అందిస్తున్నారు. మందులు వేసుకోకుండా ఆరోగ్యాలు దెబ్బ తీసుకున్నారని, త్వరగా కోలుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. కోలుకున్నాక కూడా తమ ఆశ్రమంలోనే వారిద్దరికీ ఆశ్రయం కల్పిస్తామని వారు ప్రకటించారు. 300 పైగా సినిమాల్లో నటించిన శ్యామల చివరి దశలో కష్టాలు ఇతర నటులకు గుణపాఠం కావాలి!
పావలా శ్యామల గురించి చెప్పుకోవాలంటే రంగస్థలంతో ఆమె కెరీర్ మొదలైంది, ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో కొనసాగింది. ఆమె అసలు పేరు నేతి శ్యామల. గణేష్ పాత్రో రచించిన ‘పావలా’ అనే నాటకంలో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో ఆమెకు “పావలా శ్యామల” అనే పేరు స్థిరపడింది.
ఆమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. పదమూడేళ్ల వయసులోనే వివాహం జరిగింది, ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె భర్త ఒక ప్రమాదంలో మరణించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.కుటుంబ పోషణ కోసం నాటక రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు.
1984లో ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్వర్ణకమలం, బాబాయ్ హోటల్, ఖడ్గం, వర్షం, ఆంధ్రావాలా,గోలిమార్ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. తన కెరీర్లో జాగ్రత్తలు పాటించక పోవడం వలన తరువాత కాలంలో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు.
ఆమె, అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమెకు నెలవారీ పెన్షన్, రెండు పడక గదుల ఇంటిని అందించే హామీ ఇచ్చింది.ప్రభుత్వం వాటిని ఇచ్చింది లేనిది వివరాలు తెలియడం లేదు.

