విశ్వనాథుని దృశ్య కావ్యం !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi …………….

దర్శకుడు కె.విశ్వనాధ్ బెస్ట్ మూవీస్ లో స్వర్ణ కమలం ఒకటి. ఈ స్వర్ణకమలం సినిమా గురించి వ్రాయడమంటే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుడిని దివిటీతో చూపే సాహసం చేయడమే. సినిమాలోని ఒక్కో పాత్ర పై ఒక్కో థీసిస్.. ఒక్కో పాట పై ఒక్కో థీసిస్..అలాగే తెరవెనుక ఈ సినిమాకు ప్రాణం పోసిన ఒక్కో సాంకేతిక నిపుణుడిపై ఒక్కో థీసిస్ వ్రాయవచ్చు. ఈ ఒక్క సినిమా మీద ఓ వంద Ph.D థీసిస్సులను తయారు చేయవచ్చు. అలాంటి దృశ్య కావ్యం ఈ స్వర్ణ కమలం. 

ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఒక్క సినిమాకు ఆరుగురు నృత్య దర్శకులు పని చేసిన ఏకైక సినిమా ఈ స్వర్ణకమలం.ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు , అందెల రవమిది పదములదా అనే ఈ రెండు పాటలకు నృత్య దర్శకుడు గోపీకృష్ణ. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ పాటకు శీను.

ఆంగికం,చేరి యశోదకు పాటలకు కె వి సత్యనారాయణ. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిళ్ళు , కొత్తగా రెక్కలొచ్చెనా పాటలకు శేషు . కొలువై ఉన్నాడే దేవదేవుడు పాటకు శ్రీమతి కె ఉమా రామారావు నృత్య రీతులు సమకూర్చారు. 

సినిమా ద్వారా విశ్వ విఖ్యాత నృత్యకారిణి షెరాన్ లౌవెన్  మరో గొప్ప శాస్త్రీయ నృత్యాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.షెరాన్ లౌవెన్  చేసిన ‘సఖి! హే కేశిమథన ముదారం’ పాటకు నృత్య దర్శకులు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కేలూ చరణ్ మహాపాత్రో నృత్య రీతులు సమకూర్చారు.

ఆయన ఓ లెజెండరీ క్లాసికల్ నాట్యాచార్యులు.. ఒడిస్సీ నృత్యానికి జగత్ప్రచారకులు..షెరాన్ లౌవెన్ కు గురువు .జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నఈ పాటను పాడింది మరో గొప్ప గాయకురాలు తృప్తీ దాస్ . ఈ ఒక్క నృత్య గీతానికి సంగీతాన్ని భువనేశ్వర మిశ్రా అందించారు. 

ఇక ఈ షెరాన్ లౌవెన్ గొప్ప ఒడిస్సీ కళాకారిణి.ప్రపంచమంతా వందల ప్రదర్శనలు ఇచ్చారు.ఇంతటి గొప్ప కళాకారులు ఈ సినిమాకు పనిచేయడం అసాధారణ విషయం. బహుశా కళాతపస్వి విశ్వనాధుడికే సాధ్యమేమో !

ఇంక నటీనటులు … మాయాబజార్ సినిమాలో ఏ పాత్ర గొప్ప అంటే ఓ పట్టాన తేల్చగలమా ! ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాలో కీలక పాత్ర ధారి భానుప్రియే. స్వతహాగా గొప్ప నృత్యకారిణి కావడం ,పెద్ద పెద్ద కళ్ళు, అద్భుతమైన నటనా కౌశల్యం సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా అంతా తానై నడిపిస్తుంది.

ఆమె తర్వాత నిస్సందేహంగా వెంకటేషే. ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పినట్లు one of the best movies acted by him. వెంకటేష్ చేత కూడా శాస్త్రీయ నృత్యపు అడుగులు వేయించారు విశ్వనాధ్ .మరో గొప్ప పాత్ర వేదాంతం శేషేంద్ర శర్మ పాత్ర . శంకర శాస్త్రి  లాగా గంభీరుడు కాదు.

శారీరిక,ఆర్ధిక అనారోగ్య బాధితుడు.  గొప్ప విద్వాంసుడు.తాను ఆరాధించే సంగీతాన్ని,నృత్యాన్ని రెండు కళ్ళు లాగా ఇద్దరు కూతుళ్ళలో చూసుకుందామని తపించే ఓ నిస్సహాయ తండ్రి .ఈ పాత్ర ద్వారా పేద , వృధ్ధ కళాకారులు పడుతున్న ఆర్ధిక కష్టాలను విశ్వనాధ్ కళ్ళకు కట్టినట్లు చూపారు .

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనన్నట్లు ఫించను అధికారి ఘనాపాటీలను  అవమానించే సీను చూసాక సీట్లోనుంచి లేచి తన్ని వద్దామని అనిపిస్తుంది. ఈ సినిమాలో నన్ను ఎప్పుడూ కదిలించే సీన్ ఇది .
ఈ పాత్రను వేసిన ఘంటా కనకారావు నిజ జీవితంలో కూడా కూచిపూడి కళాకారుడే . సినిమాలో నాట్యం చేస్తూ  చనిపోయినట్లే నిజ జీవితంలో కూడా వేదిక మీదే ప్రాణాలను కోల్పోయారట. 

మరో గొప్ప పాత్ర పెద్ద కూతురు సావిత్రి . దేవీ లలిత ఈ పాత్రను పోషించింది . దిగువ మధ్య తరగతి సాంప్రదాయ కుటుంబానికి ప్రతీకగా నటించింది .వెంకటేష్ శిష్యుడు షణ్ముఖ శ్రీనివాస్. హారతి భక్తురాలు శ్రీలక్ష్మి , ఆమె హారతుల బాధితుడు సాక్షి రంగారావు నటించిన సన్నివేశాలు బాగుంటాయి. 

కె యస్ టి సాయి , డబ్బింగ్ జానకి , వారి వయోలిన్ పుత్రుడు (పేరు తెలియదు . అతను నిజ జీవితంలో కూడా వయోలిన్ విద్వాంసుడే) , మిశ్రో , ముచ్చెర్ల అరుణ ,పావలా శ్యామల ,ఎంతో మంది ఔత్సాహికులు తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం  చేసారు .

ఈ సినిమా విజయానికి ముఖ్య కారణం నృత్యాలు , పాటలు . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం . సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని సాహిత్య సరస్వతి ఆవహించి ఇంతటి గొప్ప పాటల్ని వ్రాయించింది . ఆయనకు ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం కూడా వచ్చింది . ఇంక ఆ పాటలకు జీవాన్ని పోసారు ఇళయరాజా ,బాలసుబ్రమణ్యం, సుశీలమ్మ , జానకమ్మ , వాణీజయరాంలు. 

ఈ సినిమాకు నంది అవార్డుల , ఫిలింఫేర్ అవార్డుల , సినిమా ఎక్స్ప్రెస్ అవార్డుల వర్షం కురిసింది . భానుప్రియకు ఉత్తమ నటిగా , నిర్మాతలకు ఉత్తమ చిత్రంగా , విశ్వనాధుడికి ఉత్తమ దర్శకుడు ( Cinema Express) అవార్డులు వచ్చాయి . 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో , ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. 

ఈ సినిమా పాటల , నృత్యాల  చిత్రీకరణకు దేశంలోనే అద్భుతమైన లోకేషన్లను ఎంపిక చేసుకున్నారు . భువనేశ్వర్ నగరానికి దగ్గరలో ఉన్న ధౌలి/ధవళగిరిలో ఉన్న శాంతి స్థూపం , భృంగేశ్వర శివాలయం , కాశ్మీర్ లోని పెహల్గాం , సోనామార్గ్ , మరెన్నో పార్కుల్లో , సుందర విశాఖలో షూటింగ్ చేశారు.  

భానుప్రియ అందమైన కళ్ళను , నృత్యాలను కమనీయంగా చూపిన లోక్ సింగుని , ప్రతీ అక్షరం తూచి తూచి వాడిన , వ్రాసిన సాయినాధుని , భానుప్రియకు అందమైన కాస్ట్యూమ్సుని అందించిన సూర్యారావుని పేరు పేరునా అభినందించాల్సిందే .

వీరందరి సమిష్టి కృషే ఈ దృశ్య కావ్యం . It’s a musical , visual splendour presenting the great Indian cultural heritage . విశ్వనాధ్  చెప్పినట్లు రాళ్ళల్లో కూడా రాగాలను పలికించే గొప్ప వాగ్గేయకారులు , విద్వాంసులు పుట్టిన దేశం మనది. రాతి గుండెల్ని కూడా కదిలించగల కళాఖండాలను సృష్టించగల విశ్వనాధులు పుట్టిన గడ్డ మనది . ఎందరో మహానుభావులు అందరికీ వందనములు .
టివిలో ఎన్ని సార్లు వచ్చిందో ! యూట్యూబులో కూడా ఉంది . ఎన్ని సార్లయినా చూడొచ్చు .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!