వంగవీటి స్టయిలే వేరు కదా !!

Sharing is Caring...

Paresh Turlapati …….. 

“రావయ్యా ..రా.. పరేష్..మనకు మళ్లీ ప్రమోషన్ వచ్చింది..”నవ్వుతూ అన్నారు వంగవీటి మోహన రంగా గారు. (వందమందిలో ఉన్నా యెటువంటి ఈగోలు లేకుండా గుర్తుపట్టి పేరుతో పిలిచి నవ్వుతూ పలకరించడం వంగవీటి లో నాకు నచ్చిన గుణం..ఆ గుణమే వంగవీటిని జననేతను చేసింది)

కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి మోహన రంగాను సస్పెండ్ చేస్తూ జలగం వెంగళ రావు నిర్ణయం తీసుకున్నారని తెలిసి మిత్రులతో కలిసి విజయవాడ గవర్నర్ పేటలో ఉన్న వంగవీటి మోహన రంగా గారి ఇంటికెళ్లిన నాకు అక్కడి దృశ్యం చూస్తే ఆశ్చర్యం వేసింది !అప్పటికే అక్కడ జనం భారీగా చేరుకుంటున్నారు !

ఇంకొకళ్లయితే తమ సస్పెన్షన్ వ్యవహారంపై మీడియాలో ఆవేశపడిపోవటమో..బూతులు తిట్టటమో చేస్తారు ! కానీ వంగవీటి స్టయిల్ వేరు ..ప్రతికూల పరిస్థితుల్లో కూడా కూల్ గా ఉంటారు ! తన రాజకీయ ఎదుగుదలకు ఇది ఒక అవకాశంగా భావించుకున్నారు..అలాగే మలుచుకున్నారు కూడా ! తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పెద్ద విషయం కానట్టు కూల్ గా నవ్వుతూ పిల్లలను తీసుకుని బీసెంట్ రోడ్ బయలుదేరారు !

ఇంటికి వచ్చిన జనం కూడా ఆయన్ను అనుసరించటం మొదలుపెట్టారు..వారిలో నేను కూడా ఉన్నా!ఈ లోపు చుట్టుపక్కల జిల్లాలనుంచి వంగవీటి కి మద్దతుగా లారీల్లో జనాలు విజయవాడకు బయలుదేరారని తెలిసింది !(అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు..కానీ వంగవీటి సమాచారం నిమిషాల్లో జిల్లాలకు చేరిపోయేది )

బీసెంట్ రోడ్ లో రవి ఫ్యాన్సీ అనే షాప్ లో పిల్లలకు కావాల్సిన షాపింగ్ చేశారు ! ఓనర్ డబ్బులు వద్దన్నా బలవంతంగా డబ్బులు అతడి చేతిలో పెట్టి తిరిగి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు !అప్పటికే ఇంటిదగ్గర చుట్టుపక్కల నుంచి వచ్చిన జనాలతో కిటకిటలాడిపోతుంది !

తర్వాత సస్పెన్షన్ పై ప్రజా ఆగ్రహాన్నిచూసిన కాంగ్రెస్ నాయకత్వం రంగా పై సస్పెన్షన్ఉపసంహరించుకుంది ! దాంతో కాంగ్రెస్ పార్టీలో వంగవీటి మోహన రంగా మరింత బలమైన నాయకుడిగా ఎదిగారు !అసలు వంగవీటి మోహన రంగా ను కాంగ్రెస్ పార్టీ నుంచి జలగం వెంగళ రావు సస్పెండ్ చెయ్యటం వెనుక చిన్న నేపథ్యం ఉంది ! 

దేశమంతా కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తున్న టైములో విజయవాడలో మాత్రం కమ్యూనిస్టుల హవా నడిచేది ! కాంగ్రెస్ పార్టీ కూడా విజయవాడలో కమ్యూనిస్టులను ధీటుగా ఎదుర్కోగల నాయకుడి కోసం ఎదురుచూస్తున్న రోజులు ! సరిగ్గా ఆ టైంలో వారి దృష్టిని ఒక యువకుడు ఆకర్శించాడు !

అతడికి ఏ పార్టీ జెండా లేదు..ప్రచారానికి గడప గడప తొక్కింది లేదు … మొక్కింది లేదు.. అసలు ప్రచారానికి వెళ్లే అవకాశం కూడా లేదు ! ఆ యువకుడు విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా జైలునుంచి పోటీ చేసి గెలిచిన వంగవీటి మోహన రంగా !

కాంగ్రెస్ పార్టీ కన్ను వంగవీటిపై పడింది ! విజయవాడ రాజకీయాలను మలుపు తిప్పగల చరిష్మా ఈ యువకుడిలో ఉందని గుర్తించింది !అప్పటికే విజయవాడలో బడుగు బలహీన వర్గాల్లో బలమైన నాయకుడిగా వంగవీటి ఎదుగుతున్నారు ! అంతే కాంగ్రెస్ అధినాయకత్వం వంగవీటిని అక్కున చేర్చుకుంది !

కేంద్రమంత్రి పి శివశంకర్ చొరవతో శాసనసభ ఎన్నికల్లో వంగవీటి మోహన రంగాకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరోపక్క అప్పుడే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వేవ్ ఆంద్రప్రదేశ్ మొత్తం విపరీతంగా వీస్తున్న రోజులు. అలాంటి పరిస్థితుల్లో విజయవాడలో తమ స్థానం ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ వంగవీటి మోహన రంగా ను బరిలో నిలిపింది !

కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని వంగవీటి వమ్ము చేయలేదు ! ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా 1985 లో విజయవాడ తూర్పు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.మెల్లిగా కాంగ్రెస్ పార్టీలో వంగవీటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎదిగారు !ఇది సహజంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులకు నచ్చలేదు !

పార్టీలో ఎప్పటినుంచో కొనసాగుతున్న తమ సీనియారిటీని కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒక యువకుడు శాసించే పరిస్థితిని తట్టుకోలేకపోయారు.విషయం జలగం వెంగళ రావు కి చాడీలు చెప్పటం దాకా పోయింది ! కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ NSUI ఉండగా దాన్ని పక్కనబెట్టి రంగా సొంతంగా UI అనే విద్యార్థి సంస్థను నడుపుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ !

UI ని రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పెద్దలు హుకుం జారీ చేశారు ! UI అనేది తన శరీరంలో ఒక భాగం కాబట్టి ..కుదరదన్నారు రంగా ! ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగాను సస్పెండ్ చేస్తూ జలగం వెంగళ రావు నిర్ణయం తీసుకున్నారు !

తర్వాత సస్పెన్షన్ ఉపసంహరించుకోవటం వంగవీటి మోహన రంగా అదే కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదగడం చక చకా జరిగిపోయాయ్ !విజయవాడలో వంగవీటి మోహన రంగా వల్లనే కాంగ్రెస్ పార్టీ బలపడిందని అప్పట్లోనే చెప్పుకునేవాళ్ళు ! ఇదీ నేపథ్యం !!

వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్థంతి సందర్భంగా అన్ని పార్టీల నాయకులు ఆయన్ని ఓన్ చేసుకోవటానికి ప్రయత్నించాయన్న వార్తలు టీవీల్లో చూసిన తర్వాత గుర్తుకొచ్చిన పాత జ్ఞాపకం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!