Subramanyam Dogiparthi …………….
జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా ఇది. 1986 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా రాజేంద్రప్రసాద్ , వంశీ కెరీర్లలో ఓ మైలురాయిగా మిగిలి పోయిన మసాలా క్లాసిక్ .
గోదావరి , గోదావరి గ్రామాల , కాలువల , కొబ్బరిచెట్ల అందాలను అద్భుతంగా చూపించిన సినిమా. సినిమాటోగ్రఫీ డైరెక్టర్ హరి అనుమోలుని ప్రత్యేకంగా అభినందించాలి . ప్రకృతినే కాదు ; నలుగురు సుందరీమణులను కూడా ప్రకృతి అంత అందంగా చూపారు హరి అనుమోలు .
జమజచ్చ కోసం ముందు ముగ్గురు సుందరీమణులకు గాలం వేస్తాడు టైలర్ సుందరం . ఆ ముగ్గురుగా నాగమణి , దయ,నీలవేణి పాత్రల్లో వై విజయ,దీప, సంధ్య నటించారు. పాపం ఈ ముగ్గురు అమ్మాయిలు సుందరాన్ని నిజంగానే ప్రేమించేస్తారు. ఎవరికి వారు సుందరంతో ఊహల్లో విహరిస్తూ ఉంటారు . పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ముగ్గురికీ జమజచ్చ లేదని తెలిసాక వాళ్ళను తప్పించుకుంటూ ఊరికి కొత్తగా వచ్చిన టీచరమ్మ సుజాతకు గాలం వేస్తాడు సుందరం.
సుందరం అమాయకత్వానికి సానుభూతి కలిగిన టీచరమ్మ తన చుట్టూ తిరిగే సుందరంని వద్దనదు . క్లైమాక్సులో సుందరం మోసం తెలిసి అసహ్యించుకున్నా అతని పశ్చాత్తాపానికి మనసు మార్చుకుని పెళ్ళి చేసుకుంటుంది. ఇదంతా మెయిన్ ట్రాక్ స్టోరీ.
సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చివర్లో బాగుంటుంది. విలన్ ప్రదీప్ శక్తి చెల్లెలు గర్భవతి కావటం , అందుకు కారణమైన సీతారాముడు పాత్రధారి , టైలర్ సుందరం అసిస్టెంట్ శుభలేఖ సుధాకర్ ని ఏసేయపోవటం , అతన్ని వారించి టీచరమ్మ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించటంతో సినిమాకు శుభం కార్డ్ పడుతుంది .
విశ్వనాధ్ , బాపు , జంధ్యాల , వంశీ సినిమాల్లో నటీనటులు కనపడరు మనకు పాత్రలే కనిపిస్తాయి. ఊరూపేరు లేని వారితో కూడా గొప్పగా నడిపించేస్తారు సినిమాలను . ఈ లేడీస్ టైలర్ సినిమాలో కూడా రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్ , దీప , వై విజయ , రాళ్లపల్లిలు మినహాయిస్తే మిగిలిన వారందరూ ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులే .
నటన పరంగా రాజేంద్రప్రసాద్ , శుభలేఖ సుధాకర్లకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . అర్చన నటనా ప్రతిభను ‘నిరీక్షణ’లో చూసాం. ఈ సినిమాలో కూడా నల్లందంతో , కళ్ళందంతో కట్టి పడేసింది . టీచరమ్మల్ని ప్రేమిస్తే ఊరకూరకే ప్రేమపూర్వక బడిత పూజ చేస్తారని భయపెడుతుంది .
వై విజయ నటన గురించి చెప్పేదేముంది . మెలికలు తిరుగుతూ హాల్లో కూర్చున్నోళ్ళని కూడా మెలికలు తిరిగేలా చేసేసింది . దీప , సంధ్య , విలన్ చెల్లెలు (పేరు వరలక్ష్మి అనుకుంటా) , మధ్య వయసులో కూడా మెలికలు తిరిగే సంధ్య తల్లి బాగా నటించారు .
ప్రదీప్ శక్తి నటించినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులు గుర్తుంచుకునే నటుడు . ముఖ్యంగా ఆయన కెరీర్లో ఈ సినిమా లోని వెంకటరత్నం పాత్ర పేరుతో సహా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే . అతని అసిస్టెంటుగా శీను పాత్రలో కర్ణన్ నటనని కూడా ఎవరూ మరచిపోరు.
మరో ప్రధాన పాత్ర బట్టల సత్యం మల్లికార్జునరావుది. వాస్తవానికి సెకండ్ ఇంపార్టెంట్ పాత్ర ఇదే . మల్లికార్జునరావు బ్రహ్మాండంగా నటించాడు . కనిపించేది కాసేపే అయినా సినిమాను ముందుకు నడిపించే కోయదొర పాత్ర రాళ్ళపల్లిది . ఇలాంటి పాత్రలు అతనికీ కొట్టిన పిండే . మరో పాత్ర చావు ఫొటోల స్పెషలిస్ట్ థం . పెళ్లిచూపుల పోలీస్ కానిస్టేబులుగా తనికెళ్ళ భరణి నటించారు .
స్క్రీన్ ప్లే లో వంశీతో పాటు భరణి , వేమూరి సత్యనారాయణలు కూడా పాలుపంచుకున్నారు . భరణి సంభాషణలను కూడా వ్రాసారు . ఈ సినిమాలో ప్రేక్షకులకు ఊతపదాలయిన మాటలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా “జ” భాష , జమజచ్చ , బల్లి శాస్త్రం , వంటివి చాలానే ఉన్నాయి .
ఇళయరాజా సంగీతం , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు ఈ సినిమాకు ఎస్సెట్. బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజల గొంతులు మంచి హిట్ సాంగ్సునే ఇచ్చాయి . హాయమ్మ హాయమ్మ హాయమ్మా , పొరపాటిది తడబాటిది , ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాటలు బాగా హిట్టయ్యాయి .
ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే పాట చిత్రీకరణ బాగుంటుంది . మరో పాట గోపికల వస్త్రాపరణం . గోపీలోలా నీ పాల పడ్డానురా అల్లరి అల్లరిగా బాగుంటుంది . పాటలన్నీ గోదావరి నేపధ్యంలో ఉండటం వలన చాలా అందంగా ఉంటాయి .
ప్రతీ ఫ్రేములో వంశీ కనిపిస్తాడు . హాస్యంతో ఆడుతూ పాడుతూ రొమాంటిగ్గా సాగే సినిమాలో ఊహించని ట్విస్ట్ లు పెట్టి రక్తి కట్టించాడు వంశీ . రాజేంద్రప్రసాద్ పాత్ర మీద సానుభూతి కలిగిస్తాడు . టీచరమ్మతో పెళ్లి చేస్తాడు .
తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళం లోకి డబ్ అయింది . 2006 లో ఇదే టైటిలుతో హిందీ లోకి రీమేక్ అయింది కూడా . హిందీలో కూడా హిట్టయింది . మొత్తం మీద సరదా సరదా మ్యూజికల్ హిలేరియస్ మూవీ . చాలామంది చాలా సార్లే చూసి ఉంటారు . టివిలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది . స్రవంతి కిషోర్ నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి.
Tharjani …………..
రచయిత తనికెళ్ళ భరణి విశ్వరూపం ప్రదర్శించిన సినిమా ఇది. ఇందులో చిన్న క్యారెక్టర్ కూడా ఆయన వేసాడు.కామెడీతో కూడిన సన్నివేశాల్నీ అద్భుతంగా పేర్చాడు. ఇందులో ఒక డైలాగ్ బాగా పాపులర్ అయింది.
టైలర్ సుందరం చెప్పే డైలాగు అది … “ఇది మామూలు గౌను కాదు. పడుకునేటప్పుడు ఏసుకుంటే ఇంగ్లీషు కలలొస్తాయి. ఎలిజిబెత్ అని ఓ గొప్ప ఇంగ్లీషు సినిమా హీరోయినుంది. ఇలాంటి గౌనే ఏసుకోగానే బోలెడు పేరొచ్చేసింది. దాంతో ఆ గౌను కుట్టిన టైలర్ని పెళ్లి చేసేసుకుని, ఎలిజిబెత్ టైలర్ అయిపోయింది.” … రాసుకుంటూ పోతే బోలెడు డైలాగులున్నాయి.
డైరెక్టర్ వంశీ వాళ్ళ ఊరు పసలపూడిలో త్యాగరాజు అనే టైలర్ ఉండేవాడు. కుర్రాళ్లంతా అతగాడి దగ్గరకి చేరే వాళ్ళు.ఆ త్యాగరాజుని చూసే వంశీ ‘సుందరం’ పాత్ర ను డిజైన్ చేశారు. ఆ త్యాగరాజుకి ఆడవాళ్ల గొడవ, మచ్చ…వీటితో సంబంధం లేదు. అదంతా కథా పరంగా కల్పితం. సినిమా అంతా ‘తొడ మీద పుట్టుమచ్చ’కు సంబంధించి ఉంటుంది. ఆ మాట పదేపదే వాడితే బాగోదు కాబట్టి, ‘జ’ భాష వాడదామని రచయిత తనికెళ్ల భరణి సలహా ఇచ్చాడు. అది వంశీకి బాగానచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ ‘అమ్మాయిలూ అబ్బాయిలూ’ అనే కథలో ‘క’ భాష వాడారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా ‘జమజచ్ఛ’ అనే పదాన్ని వాడారు. అది సినిమాలో.. బయట బాగా క్లిక్ అయింది.వంశీ సినిమాల్లో బాగా పేలిన పాత్ర కూడా సుందరమే. రాజేంద్ర ప్రసాద్ ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసాడు.
ఈ సినిమా గురించి రాజేంద్రుడు ఒక సందర్భంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే ..”వంశీ డైరక్షన్లో ‘మంచు పల్లకీ’ చేశా. సోలో హీరోగా ‘ప్రేమించు పెళ్లాడు’ చేశా. పెద్దగా ఆడలేదు. నేను బెంబేలు పడిపోతుంటే, ‘నెక్స్ట్ సినిమాలో తడాఖా చూపిద్దాం’ అంటూ ప్రోత్సహించాడు.
అలా కసితో చేసిన సినిమా ‘లేడీస్ టైలర్’. నటునిగా నాకిది 66వ సినిమా. డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకున్న అనుభవాన్ని వంశీ ఈ సినిమాలో పూర్తిగా వాడుకున్నాడు. నా చేత ఎంత యాక్టింగ్ చేయించాడో, అంత కన్నా ఎక్కువే మైమ్ చేయించాడు.. దానికి తగిన ఫలితం అందుకున్నాము.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్… సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే సినిమా కూడా తీశారు వంశీ. అది ఆశించిన స్థాయిలో ఆడ లేదు.