పేటెంట్ హక్కుల వికృత రూపం !

Sharing is Caring...

Goverdhan Gande ……………….

Service has become business……………..గాయం తగిలిన చోట పసుపు రాసుకుంటే నయమవుతుంది. అని మా అమ్మకు తెలుసు. ఆ సంగతి మాకు చెప్పడం, గాయమైన చోట మా అమ్మ పసుపు రాయడం, కొంత కాలంలో ఆ గాయం మాని పోవడం మాకు తెలుసు. అది మా అమ్మమ్మ ద్వారా మా అమ్మకు తెలిసిన సంగతి. మా అమ్మమ్మకు ఆవిడ అమ్మ ద్వారా, ఆవిడకు వారి అమ్మ ద్వారా తెలిసిన జ్ఞానం/ విషయం.ఇలా మన పూర్వుల ద్వారా అనేక మందులు,మాకులు, విషయాలు వందలు/వేల సంవత్సరాల నుంచి వారసత్వంగా పొందిన జ్ఞానం అది.ఇలా అనేక విషయాలు మనం మన పూర్వీకుల నుంచి తెలుసుకున్నాం.ఆ జ్ఞానాన్ని ఇన్నాళ్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మానవ కల్యాణానికే వినియోగించాం. కానీ ఈ జ్ఞానం మీ సొంతం కాదని అంటుంది ఆధునిక వైద్య శాస్త్రం లోని ఓ వర్గం.

మనిషి ప్రకృతికి దూరమైన తరువాత ఈ వాదాన్ని పెంచారు.ఈ జ్ఞానాన్ని వ్యాపారంగా మలచడం దీని లక్ష్యం . ప్రకృతి కంటే తాను అధికుడని అని భావించాడు.ఈ ఆవిష్కరణలతో వ్యాపారం చేద్దాం అని వికృత ఆలోచనలతో వేల ఏళ్లుగా అనేకులు కనుగొన్న జ్ఞానాన్ని తామే కనుగొన్న విజ్ఞాన ఆవిష్కరణలు గా నమ్మించేందుకు యత్నించాడు. అవన్నీ తమ తెలివితేటలు,మేధస్సు నుంచి వెలువడ్డాయని కొందరు ‘శాస్త్ర వ్యాపారుల’ వాదన చేస్తూ, పసుపుకు రోగ నిరోధక శక్తి ఉందని తామే కనుగొన్నామని చెబుతారు. వేపలో ఎన్నో ఔషధ గుణాలున్న సంగతిని కూడా కనుగొన్నామంటారు వారు.కశ్మీర్ ప్రాంతంలో పండే బసుమతి వరి వంగడాన్ని కూడా తానే సృష్టించానని ఇంకో శాస్త్రవేత్త ప్రకటిస్తాడు! కానీ ఇవన్నీ వందల ఏళ్లుగా భారతీయులకు తెలుసు.

ఇది పరిణామ క్రమం.అనుభవంలో మన పెద్దలు/పూర్వులు తెలుసుకున్న జ్ఞానం. ఇంతే కాదు..ఇలాంటివే అనేక విషయాలను ప్రపంచం నలుమూలల మానవ సమాజం తెలుసుకున్నది. ఇదంతా ప్రకృతితో మనిషి మమేకం కావడం వల్ల లభించిన జ్ఞానం. వీటి ద్వారా మనిషి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించగలుగుతున్నాడు.అనేక అనారోగ్యాలను నుంచి బయట పడగలుగుతున్నాడు. జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగాడు.కానీ ఆధునిక “శాస్త్ర వ్యాపార మాఫియా” దీనిని అంగీకరించడం లేదు. అవి తమ ఆవిష్కరణలు మాత్రమేనని వాదిస్తున్నది. తాము వీటిని కనుగొన్నందుకు గాను వారికి వాటిపై అన్ని హక్కులూ కావాలంటుంది. వీటిని వాడుకునే ప్రతి వ్యక్తి తమకు రాయల్టీ చెల్లించాలంటుంది తయారుచేయడం, వాడుకోవడం, అమ్ముకోవడం లాంటి అన్ని ప్రక్రియలపై తమకు మాత్రమే హక్కులుంటాయని వాదిస్తుంది.

దాని నుంచి పుట్టుకొచ్చిన వికృత రూపమే ఈ పేటెంట్’ బాగోతం.అదే ఓ వికృత అల్లోపతి మాఫియా గా రూపుదాల్చింది . ఇపుడు అదే మాఫియా కోవిడ్ వాక్సిన్ వ్యాపారం మొదలెట్టింది. గాలిలోంచి ఏదీ ఊడిపడదు. ప్రకృతి సహకారం,ప్రయత్నం, గతం తాలూకు జ్ఞానం, ఎన్నో ఏళ్ల మానవ కృషి ఫలితంగానే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. అది మానవ సమాజ ఉమ్మడి సొత్తు అవుతుంది కదా.ఈ వాదనను ఈ మాఫియా ఒప్పుకోదు. అది తమ మేధో శ్రమ ఫలితం మాత్రమే అంటుంది ఈ మాఫియా. కనుగొన్న వినియోగ వస్తువు/ఆవిష్కరణ/మందు/టీకాపై అన్ని హక్కులు తమవేనని ప్రకటించి దానికి సంబంధించిన ఫలితం పూర్తిగా తమకు మాత్రమే సొంతమని చెప్పుకొని పేటెంట్ హక్కులు పొందడం దానిని వ్యాపారంగా మలుచుకోవడం ఆధునిక వికృత వైద్య వ్యాపార మాఫియా నీతి.

అలా పెటెంట్ పొందిన వస్తువును అంగట్లో పెట్టి జేబులు నింపుకోవడమే వీరి లక్ష్యం. అగ్ర దేశాల ప్రభుత్వాలు కూడా ఈ మాఫియా ను ఏమీ చేయలేవు.అవసరమైతే ఆ ప్రభుత్వాలను కూల్చివేయగల శక్తి సామర్థ్యాలు ఈ మాఫియా సొంతం. ఆరోగ్య,వైద్య విధానాలను ఈ మాఫియానే నిర్దేశిస్తున్నది. చాలా పేద దేశాలకు కోవిడ్ మందులు,టీకా లను ఉత్పత్తి చేసే పరిజ్ఞానం,సామర్థ్యం,స్తోమతలు లేవు.కరోనా మహమ్మారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు టీకాను ఉత్పత్తి చేసే దేశాల నుంచి భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేయక తప్పని దైన్యంలో ఉన్నాయి. ఈ అవసరాన్ని వ్యాపారంగా మలచుకు నే దురుద్ధేశంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న కరోనా /కోవిడ్ /మందులు/టీకాల వ్యాపారం .వీరికి మనిషి, కుటుంబం, దానిలోని సున్నితమైన బంధాలు, సమాజం, దాని లోని నాగరిక విలువలు అనవసరం. అవేవీ అసలు పట్టవు. ఇక మానవత్వం గురించి ఏం పట్టించుకుంటారు ??

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!