Obscenity in recording dances……………………..
“రికార్డ్ డాన్సుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు మొదట్లో ఉండేవి కావు. మా డ్యాన్సర్ల ట్రూప్ మాస్టర్ల స్వార్ధం వల్లే మొదలయ్యాయి.జనాన్ని ఎంత రెచ్చ గొడితే ఆ ట్రూప్ కి అంత డిమాండ్ ఉంటుందన్న భావన తో అంగ ప్రదర్శన కు మమ్మల్ని బలవంతం గా ఒప్పించే వారు ” అని ఓ వృద్ధ రికార్డ్ డాన్సర్ చెప్పింది.
ఒకప్పుడు ఆమె చాల పాపులర్ డాన్సర్. అనర్గళంగా మాట్లాడుతుంది. తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది కూడా. కొంత మంది శిష్యురాళ్ళను తయారు చేసింది.స్వయం గా వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చింది.. అయితే సంపాదించింది… మిగిలింది అనుభవం మాత్రమే. అది కూడు పెట్టడం లేదు.
“మేము అలా అందరి ముందు పబ్లిక్లో అర్ధ నగ్న ప్రదర్శనలు ఇవ్వడానికి కారణం పేదరికమే. పిల్లలకు ఒక పూట అయినా కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆశ మాత్రమే. అంతే గానీ మా నగ్నత్వాన్ని చూపించి డబ్బులు కొల్ల గొట్టాలని కాదు.”
“మేము కూడా గౌరవ కుటుంబాలకు చెందిన మహిళల లాంటి వాళ్ళమే.మాకూ సిగ్గు,అభిమానం వున్నాయి. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టేజి ఎక్కి డాన్సు వేశాం.అయితే కొంతమంది స్వార్ధ వైఖరి వల్ల ఈ వృత్తి కూడా అభాసుపాలైంది.”
“డాన్సులు రాచరిక వ్యవస్థలో కూడా ఉండేవి ,కాలానుగుణం గా అవి మార్పు చెందాయి. రాచరిక వ్యవస్థ లో గూఢ చారులు గా పని చేసిన వ్యక్తులు కొంతమంది అమ్మాయిలను చేర దీసి వాళ్ళకు నాట్య విద్య నేర్పించి శత్రు రాజ్యాలకు పంపేవారు.అదే సమయం లో ప్రజల వినోదం కోసం కూడా నాట్య బృందాలు ఊరూరు తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవి.”
“క్రమంగా ఇవి రూపాంతరం చెంది కొత్త పుంతలు తొక్కాయి. మొదట సినిమా పాటలకు అది కూడా యుగళ గీతాలకు మాత్రమే డాన్సు వేసే వారు తర్వాత తర్వాత సినిమాల్లోని శృంగార గీతాలకు డాన్సు లు వేసే వారు . అక్కడి నుంచే అసభ్యత మొదలైంది.ఏదైనా కేవలం కూటి కోసమే అన్నది వాస్తవం. అది తప్పా?ఒప్పా? అన్నది నేను చెప్పలేను.”అందామె.
“కొంతమంది అమ్మాయిలు తమ అందచందాలతో జనాన్ని రెచ్చగొట్టే వారు,ఈ క్రమం లో కొంతమంది మగాళ్ళు డబ్బు ఎరవేసి వీళ్ళను లోబర్చుకునే వారు.అలా అలా రికార్డు డాన్సింగ్ వృత్తి కలుషితమైంది.ఆ తర్వాత అసలు దాని పోకడే మారి పోయింది.కేవలం వినోదం కోసం మొదలైన ఈ స్టేజి షో లు అశ్లీలతకు నమూనాగా మారిపోయాయి.”
‘పిల్లలను బతికించు కోవడం కోసం రికార్డింగ్ డాన్సులు మీరు చేశామంటున్నారు? మరి చిన్న పిల్లల తో కూడా ఇలాంటి అసభ్య నృత్యాలు చేయించే వాళ్ళు కదా ? దీన్ని మీరు సమర్ధిస్తారా ?”అన్ననా ప్రశ్నకు సమాధానం చెబుతూ.
“అది తప్పే.మా డాన్సు ట్రూప్ నిర్వాహకుల స్వార్ధం వల్లనే చిన్న పిల్లలు స్టేజి ఎక్కారు. మేమంటే చదువు లేని వాళ్ళం, నాగరికత తెలినీ వాళ్ళం. టీవీ లలో వచ్చే డాన్సు షో లలో చిన్న పిల్లలు చేసే నృత్యాలు ఏ కొవలోకొస్తాయి ? మీరే చెప్పండి” అంటూ ఎదురు ప్రశ్న వేసింది.
“అప్పుడు ఇప్పుడు కూడా ఆడది అంగట్లో వస్తువే.అందుకే ఆడదాని అంద చందాలు ఇవాళ లక్షలమందికి ఉపాధి గా మారాయి. రికార్డింగ్ డాన్సులు, క్లబ్ డాన్సులు నిషేధించారు కానీ ఆడదాని అందచందాలతో వ్యాపారాన్ని ఎందుకు నిషేదించ లేకపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ?”
ఆమె ప్రశ్నలకు నా దగ్గర జవాబు లేక పోవడం తో మౌనం గా ఉండి పోయాను.
(ఒక ఇంటర్వ్యూ లో భాగం)
————KNM