ఆదివాసీల సంతలు !

Sharing is Caring...

పూదోట శౌరీలు …………………………….

తాండవ నది ఒడ్డున వున్న రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ”అల్లూరి సీతారామరాజు”సమాధిని చూసి అంజలి ఘటించి  మేము వూళ్ళోకి వచ్చాము. రవి . సీతారామరాజు మొదటగా ముట్టడించిన పోలీస్ స్టేషను ఈ ఊరిదే కావడం విశేషం.ఆ రోజు సోమవారం కృష్ణదేవిపేటలో సంత జరుగుతోంది. నేను ఏ ప్రాంతాలకు వెళ్ళినా ముందుగా అక్కడ జరిగే సంతల సమాచారం సేకరిస్తాను.ఆ సంతలు జరిగే రోజు అక్కడ వుండేటట్లుగా ఏర్పాట్లు చేసుకుంటాను.

”సంతలు చూడటం,బేరసారాలు చేస్తూ వారితో ముచ్చటించటం,ఆయా ప్రాంతాల కట్టు,బొట్టు,మాట తీరు పరిశీలించటం నాకెంతో ఇష్టం. మా శైలూ కి అంతే.. ఆయా ప్రాంతాల జీవన శైలి మొత్తం సంతల్లోనే ప్రతిఫలిస్తూ వుంటుంది…అసలు సంతలు మానవ జీవితంలో ఒక గొప్ప పాత్రను పోషిస్తాయి..అక్కడే ఉద్యమాలు పుడతాయి,ప్రేమలు,పగలు కూడా పుడతాయి.

”సంతలు మానవసంబందాలకు దగ్గరి పుంతలు”మనుషుల మద్య దూరాలను చెరిపే ఒక ప్రదేశం..”ఎప్పటినుండో కలుసు కోలేకపోయిన వ్యక్తులు సంతల్లో ఒకరికొకరు తారసపడి కష్టసుఖాలను కలబోసుకుంటారు..కన్నీళ్లు పెట్టుకుంటారు. బంధాలను తిరగదోడుకుంటారు.

దారికి అటు ఇటు అందంగా పేర్చిన కూరగాయలు,పండ్లు పూలు…ఇంకోపక్క నిత్యావసర సరుకులు,వస్తువులు,ఉ ప్పుపప్పులు,…ఇంకోపక్క కొత్త బట్టల అంగళ్ళు,వాటి పక్కనే పాత బట్టల బేరసారాలు…అటు ఎండు చేపలు,  రొయ్యలు,రకరకాల పచ్చిచేపలు,మాంసం దుకాణాలు,ఇటు చూస్తే కుదురుగా  పేర్చిన గాజులు….,బొట్టుబిళ్ళ,సబ్బుబిళ్ళ సహ ఆడవాళ్ళు మనసు పడే అలంకరణ సామగ్రి.

అలాగే మరోవైపు మట్టికుండల దొంతర్లు,జర్మన్ సిల్వర్ గిన్నెలు,చేటలు,బుట్టలు.ఓహ్..ఒకటా…రెండా.. సంసారానికి కావలసినవన్నీఅక్కడే..ఈ సంతలకు ఏ మాల్స్ సాటిరావు…మాల్స్ వాడైతే వస్తువు మీద అతికించిన ధరకు ఒక పైసా తగ్గడు……ఇక్కడైతే బేరసారాలకు వీలుంటుంది.

మా ప్రాంతంలో [తెలంగాణ] లో సంత జరిగే చోటును” అంగడి” అంటారు..ఒక్కో రోజు ఒక్కో వూళ్ళో అంగడి జరుగుతూ ఉంటుంది..మా వూర్లో [బోధన్] ఆదివారం అంగడి..అంగడి జరిగే ఆ వీధులన్నిటిని కలిపి ”అంగడి బజార్”అంటారు…ఇక్కడ అంగడిలో మనసుకు హత్తుకుపోయే ఒక ..కమనీయదృశ్యం తరచుగా చోటు చేసుకుంటూ ఉంటుంది.

ఎన్నాళ్ళనుండో కలుసుకోలేక పోయిన తల్లీబిడ్డలు,వదిన మరదలు ,అక్కా చెల్లెళ్ళో  అంగడిలో కలుసుకుంటే ఒకరినొకరు వాటేసుకుని చనిపోయినవారిని తలుచుకుంటారు. వాళ్ళ ఇళ్లలోని కస్టాలు తెలుసుకొని పెద్దపెట్టున ఏడుస్తుంటారు.  జనమంతా మనవైపే చూస్తున్నారేమో అని బిడియపడరు…ఆ సమయంలో వాళ్ళ భావోద్వేగాలు అలాంటివి మరి..వాళ్ళను చూసేవాళ్ళకు గూడా మనసు తరుక్కుపోయి ఏడుపు వస్తుంది.

అంత హృదయవిదారకంగా వుంటుంది ఆ దృశ్యం……ఎవరో ఒకరు”ఇంక చాలు ఆపండి..అందరి ఇళ్ళలో వుండేవే లే ఈ భాధలు..పోయినవాళ్ళు ఏడిస్తే వస్తారా..? మనసు నిమ్మళం చేసుకోండీ”అని ఓదారిస్తే అప్పుడు ఏడుపు ఆపుతారు.  ఆడవాళ్ళకి మనసులో భారం దింపుకోవటానికి ఇదో మార్గం.

అంగడిలో కావలసినవి కొనుక్కున్నాక అందరూ కలిసి ”కల్లు దుకాణానికి”పోయి పరాచికాలాడుకుంటూ,ముచ్చట్లు కలబోసుకుంటూ సంతోశంగా… సీకులు నంజుకుంటూ, కల్లు తాగుతారు…ఇంటి దగ్గర ఎదురుచూసే పిల్లలకోసం ఇంత కారపు బూందీ, మిఠాయి కొనుక్కుని పోతారు.

ఇక్కడ కృష్ణదేవిపేట సంతలో ఆదివాసీలను చూడగానే నాకు ”అల్లూరి సీతారామరాజు,ఇంకా మన్యం విప్లవంలో పాల్గొన్న గంటం దొర,మల్లుదొర,ఎర్రేసు,సింగన్న,బాలయ్య,పడాలు,ఆదివాసీ స్రీలు ఉద్యమంలో పాల్గొన్న ఎందరో వీరులు గుర్తొచ్చారు…ఆ రోజుల్లో వీళ్ళంతా కొండకోనల్లో పడి నడుచుకుంటూ వచ్చి ఈ సంతలో పని చూసుకుని రామరాజుని కలిసేవాళ్లేమో.

అడవిలో కస్టపడి సేకరించిన చింతపండు,కుంకుళ్ళు,,కరక్కాయ,ఇప్పపువ్వు,.వాళ్ళు పండించిన ధాన్యం ఎలా మోసు కొచ్చేవారో ..సంతలో వీరి అమాయకత్వాన్ని చూసి వ్యాపారులు ఎలా మోసం చేశారో…? సంతల్లో చొంగ కార్చుకుంటూ తిరిగే వెధవలు రవికలు ఎరగని ఈ స్రీలను ఎంత వేధించారో…? అటు తెల్లవాళ్లు,ఇటు వీళ్ళు మాయమాటలు చెప్పి,కాసులిచ్చి ఈ ఆదివాసీ స్రీలను ఎలా లోబరచుకున్నారో..?ఇవన్నీచూసే రామరాజు వీరిలో విప్లవబీజాలు నాటి ఉంటాడు.అనుకున్నాము. ఇవన్నీ మననం చేసుకుంటూ నేను శైలజ సంతలో తిరుగుతూ,ఆదివాసిలతో ముచ్చటిస్తూ,వారి అనుమతితో ఫోటోలు తీసుకున్నాము.

వ్యవసాయం ఇష్టంగా చేసే మా వారు దాస్,న్యాయవాదం ఒక చేత్తో,వ్యవసాయం ఇంకో చేత్తో చేస్తున్న భాస్కర్ రావు గారు ఒక కొట్లో వున్న కొడవళ్ళు,గడ్డపారలు,మోకులు,చర్నాకోలలు చూసే పనిలో పడ్డారు. కోయ యువతి దగ్గరున్న వెదురు బుట్టలు,సిబ్బులు చూడగానే నాకు నా చిన్నపుడు అన్నం కుండ మీద సిబ్బి వేసి వార్చుతుంటే సిబ్బి… జారి నా చేతుల మీద గంజి పడ్డ సంఘటన గుర్తు వచ్చింది.ఇప్పుడు సిబ్బులే కనబడటం లేదు నేను,శైలజ సిబ్బులు కొనుక్కున్నాము..కోయ,కొండరెడ్ల స్రీలను పలకరిస్తూ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి కొన్నాము…
ఎంతో ఇష్టంగా సంత అంతా చుట్టేసి కార్ ఎక్కాము…కృష్ణదేవిపేటకు వీడ్కోలు పలికి నర్సిపట్నం,లమ్మసింగి వైపుగా కదిలిపోయాము.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!