Baby making Factories ……………….
నైజీరియాలో చిన్నారులను ..యుక్తవయసు బాలికలను కిడ్నాప్ చేసి వారిని రహస్య స్థావరాల్లో బంధించి,బలవంతంగా తల్లులు గా మారుస్తున్నారు. ఆ బాలికలకు పుట్టిన పిల్లలను సంతానం లేని వారికి, అక్రమ రవాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో బాలికలను తల్లులుగా మార్చే స్థావరాలను బేబీ ఫ్యాక్టరీలని పిలుస్తారు.
నైజీరియాలో ఈ తరహా బేబీ ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. ప్రైవేట్ క్లినిక్‌లు, అనాథాశ్రమాలు,సాంఘిక సంక్షేమ కేంద్రాల ముసుగులో ఇవన్నీ పనిచేస్తున్నాయి. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాల నుంచి బాలికలను ఈ సంస్థలు నడిపే వారు కొనుగోలు చేస్తుంటారు.లేదా ఈ సంస్థలే మనుష్యులను పెట్టుకుని పిల్లలను కిడ్నాప్ చేయిస్తుంటాయి.
ఇలా తీసుకొచ్చిన అమ్మాయిల చేత బలవంతంగా వ్యభిచారం కూడా చేయిస్తుంటారు.అమ్మాయిలు గర్భం దాల్చి పిల్లలు పుట్టగానే తల్లులు నుంచి వారిని వేరు చేస్తారు. ఇండియాలో ఆడపిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచార కేంద్రాలకు అమ్మేస్తుంటే .. నైజీరియా లో పునరుత్పత్తి పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఈ రెండు కూడా మానవ అక్రమ రవాణా కిందకే వస్తాయి. బాలల హక్కులను కాలరాస్తున్న ఇలాంటి ముఠాలను అణిచి వేయడం పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు.ఈ క్రమంలో ఈ బేబీ ఫ్యాక్టరీలు మానవ అక్రమ రవాణా పెరుగుదలకు దోహద పడుతున్నాయి. ఆ ప్రక్రియలో భాగం గా మారుతున్నాయి.
దీంతో బాలల క్రయ విక్రయం లాభదాయకమైన వ్యాపారంగా మారింది. UNESCO నివేదిక ప్రకారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక మోసాల తర్వాత బాలల అక్రమ రవాణా కూడా తీవ్రమైన నేరం. అక్రమ రవాణా కార్యకలాపాలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు సాధించలేదు.
నైజీరియాలో బేబీ ఫ్యాక్టరీలు పుట్టుకు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవాంఛిత గర్భాలను వదిలించుకోవడానికి ప్రయత్నించే యుక్త వయసు బాలికలు, ఒక్కోసారి ఆర్థిక లాభం కోసం తమకు పుట్టిన శిశువులను అమ్మేసుకుంటున్నారు. వంధ్యత్వానికి గురైన సంతానం లేని జంటలు అలాంటి శిశువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
దీంతో చిన్నారులకు అధిక డిమాండ్ ఏర్పడింది. దత్తత లేదా సరోగసీ ద్వారా పిల్లలను పొందటం కంటే శిశువులను కొనుక్కోవడం సులభమని అక్కడ ప్రజలు భావిస్తుంటారు. ఇక పేదరికం కూడా మరో బలమైన కారణం.
నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం నైజీరియా మొత్తం జనాభాలో 40% మంది అంటే దాదాపు 83 మిలియన్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఈ పేదరికం తరతరాలుగా కొనసాగుతోంది. వారి బలహీనతలను ఆసరా చేసుకుని ట్రాఫికర్లు చెలరేగిపోతున్నారు.
నైజీరియా లో ఆడ పిల్లల కంటే మగ పిల్లలకు ఎక్కువ రేటు పలుకుతుంది. మగ పిల్లల రేటు సుమారు 2,000 నుండి 2,700 డాలర్ల మధ్య ఉంటుంది. ఆడపిల్లల రేటు సుమారు 1,350 –1,700 డాలర్ల వరకు ఉంటుంది. పిల్లలకు డిమాండ్ బాగా ఉండటంతో ఈ అక్రమరవాణా వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.
నైజీరియాలో ఆగ్నేయ రాష్ట్రాలైన అబియా, లాగోస్, అనంబ్రా, ఎబోనీ, ఎనుగు, ఇమోలలో ఈ తరహా కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి.థాయిలాండ్ నుండి గ్వాటెమాల వరకు ఉన్నదేశాలలో ఇలాంటి అక్రమ బేబీ ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మానవ అక్రమ రవాణా వ్యాపారం పరిశ్రమ గా మారి ఏటా సుమారు $150 బిలియన్లను ఆర్జిస్తుందని అంచనా.
నైజీరియాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి కొన్నిఎన్జీవోలు పనిచేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే విమర్శలున్నాయి..ఎన్జీవోల ఒత్తిడి వలన గత ఐదు సంవత్సరాలలో దాదాపు 200 భూగర్భ బేబీ ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి. అయితే మూసివేసిన వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తున్నాయి.
2024 లో పోలీసు అధికారులు అబియాలోని ఒక రహస్య స్థావరంపై దాడి చేసి 16 మంది గర్భిణీ బాలికలను, ఎనిమిది మంది చిన్న పిల్లలను రక్షించారు. అలాగే మరో ప్రదేశం నుంచి బందీలుగా ఉన్న 22 మంది గర్భిణీ యువతులు, ఇద్దరు శిశువులను రక్షించారు.
పోలీసుల దాడులు… నిందితులకు శిక్షలు పెరిగితే కానీ అక్రమరవాణా తగ్గుముఖం పట్టదు. నైజీరియా ప్రభుత్వం అక్రమ రవాణా నిర్మూలనకు సంబంధించి కనీస ప్రమాణాలను పాటించడం లేదని ఆ మధ్య US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. నైజీరియాను వాచ్ లిస్ట్‌లో పెట్టింది.
— KNMURTHY