థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Sharing is Caring...

Suspense Thriller ………………………………….

దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. ఇపుడు దృశ్యం 3 లో ఎవరు చేస్తారో మరి ?   

‘దృశ్యం’ తెలుగు వెర్షన్ కు అప్పట్లో నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. మ్యాక్స్ ప్లేయర్ లో ‘దృశ్యం’ ఉంది. చూడని వాళ్ళు చూడొచ్చు. పార్ట్ 1 చూస్తే …దృశ్యం 2 కథ ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతుంది. ఒక సినిమా కు సీక్వెల్‌ తీయడం అంటే మాటలు కాదు. దర్శకుడు జోసెఫ్  ఆసక్తికరమైన కథ.. కథనాలను సిద్ధంచేసుకుని ప్రేక్షకులు మెచ్చుకునేలా తీశారు.

దృశ్యంలో ఎక్కడైతే కథ ఆగుతుందో అక్కడనుంచే దృశ్యం 2 మొదలవుతుంది. సినిమాలో కథే హీరో. అందుకే సినిమా అందరిని ఆకట్టుకుంటోంది. హీరో కమర్షియల్ వాల్యూస్ ను పక్కన బెట్టారు.ముఖ్యంగా ఫైట్స్.. పాటలు లేకుండా తీయడం గొప్ప విషయమే.

ఒకే ఒక విషాద గీతాన్ని మీనాపై చిత్రీకరించారు. హీరో వెంకటేష్ కూడా తన అభిమానులు ఫీల్ అవుతారు అనే భేషజాలకు పోకుండా పాత్రకు అనుగుణంగా ఈ సినిమా చేయడం మంచి పరిణామమే. ఇతర హీరోలు అంత సాహసం చేస్తారని ఊహించలేం.

మలయాళ మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్ లో పెద్ద మార్పులేమీ లేవు. ప్రథమార్ధం కొంచెం స్లో గా నడుస్తుంది. ద్వితీయార్ధం కథ,కథనాలు పరుగు దీస్తాయి. ఊహించని మలుపులు…  ఏమి జరగబోతుందా అని ప్రేక్షకుడు ఆలోచనలో పడతాడు. హీరో చట్టానికి దొరికిపోయాడు .. శిక్ష పడటమే తరువాయి అనుకునే లోగానే కథ మలుపు తిరుగుతుంది.

సినిమా లో చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. కుటుంబాన్ని కాపాడటం కోసం సాక్ష్యాలను తారు మారుచేసి హీరో శిక్ష నుంచి తప్పించుకోవడం నిజ జీవితంలో సాధ్యం కాదు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి …కాబట్టే నేరస్తులు తప్పించుకుంటున్నారని ..ఇలాంటివి సాధ్యమే అన్నట్టుగా  ఐజీ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అండర్ కవర్స్ ఎలా పనిచేస్తారో ? ఎలా సమాచారాన్ని సేకరిస్తారో దర్శకుడు బాగా చూపారు. హత్య కేసులో అండర్ కవర్స్ ను ఉపయోగించడం చాలా తక్కువ.

ఇక కొన్ని సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. పోలీస్ ఇంటరాగేషన్ లో వెంకటేష్ పై నదియా చేయి చేసుకోవడం వంటి సన్నివేశాలు బాగా పండాయి. నదియా నరేష్ ల పాత్రలు చిన్నవైనా కీలకమైన క్యారెక్టర్లు. ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే నాకైనా ఆ రహస్యం చెప్పండి అంటూ మీనా వెంకటేష్ ను అడిగే సీన్ కూడా ఆకట్టుకుంటుంది. మీనా వెంకటేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ఐజీ పాత్రలో సంపత్ రాజ్ మెప్పించారు. పోలీస్ కరకుదనాన్ని బాగా పలికించారు. తనికెళ్ళ భరణి కూడా అంతే. సినిమా చివరి అరగంట మిస్ కాకుండా చూడాలి. అలాగే మొదటి పార్ట్  చూస్తేనే ప్రేక్షకులు అసలు థ్రిల్ ఫీలవుతారు.

సినిమాలో టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ … సతీష్ కురుప్ కెమెరా పనితనం సినిమాకు  అస్సెట్ అయ్యాయి. సామల రాసిన డైలాగులు బాగున్నాయి. ప్రస్తుతం ‘దృశ్యం 2’ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సకుటుంబ సమేతంగా చూడవచ్చు. 

ఇక ‘దృశ్యం 3’.. సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం ‘ఇండియా టుడే’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో మోహన్‌లాల్  ‘దృశ్యం 3’ గురించి మాట్లాడుతూ  ‘మంచి సీక్వెల్‌ని తీయడం అంత ఈజీ కాదు. ఇది పెద్ద సవాలు. ఆ ప్రక్రియ నడుస్తోంది’ అని వివరించారు.

‘దృశ్యం 3′ పై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు జీతూ జోసెఫ్‌ మూడో పార్ట్ కథ పై కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.’దృశ్యం 3’ ని మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి చిత్రీకరించవచ్చని భావిస్తున్నారు.. ఈ సినిమా నిర్మాణం ఈ ఏడాదే (2025) లో ప్రారంభం కావచ్చు. నటి శ్రీప్రియ భర్త రాజ్ కుమార్ సేతుపతి, దగ్గుబాటి సురేష్ తెలుగు రెండు సినిమాలు తీశారు కాబట్టి తెలుగులో ‘దృశ్యం 3’ కూడా వారే తీయవచ్చు.  

మలయాళం ‘దృశ్యం 1’ ‘దృశ్యం 2’ చిత్రాల్లో నటించిన నటీ నటులే మళ్ళీ అవే పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి అరా పాత్రల్లో మార్పులు ఉండొచ్చు. మోహన్ లాల్ నటించడం ఖరారు అయింది. ఇక ‘దృశ్యం 1′ అండ్ 2 సినిమాలు’ ఊహించని విజయాన్ని సాధించాయి. 

హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్,ఇషితా దత్తా నటించారు. నూతన దర్శకుడు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. 300 కోట్ల వసూళ్లను సాధించింది.

‘దృశ్యం’ విజయం సాధించడంతో హిందీ,తమిళం, తెలుగుతో సహా పలు భాషల్లో రీమేక్ చేసారు. ఈ చిత్రం భారతీయ రీమేక్ హక్కులు ₹155 మిలియన్లకు అమ్ముడయ్యాయి. తమిళ్ లో కమల హాసన్, గౌతమి నటించారు. ‘పాపనాశం’ పేరుతో రిలీజ్ అయింది.

దృశ్యం ఫిల్మ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, సింహళ భాషలతో సహా అనేక భాషలలో మంచి వసూళ్లను రాబట్టింది.  
@ తెలుగు… దృశ్యం (2014) : ₹45.6 కోట్లు, 
@ తమిళం…  పాపనాశం (2015) : ₹105 కోట్లు 
@ హిందీ… దృశ్యం (2015) : ₹147.8 కోట్లు, 
@ సింహళ…    ధర్మయుద్ధయ (2017) : ₹5.07 కోట్లు వసూలు చేసింది..

ఈ సినిమాను చైనా లో కూడా రీమేక్ చేశారు.   
@  చైనా … ‘గొర్రెల కాపరి లేని గొర్రెలు’ పేరిట తీయగా  (2019)  అక్కడ పెద్ద హిట్ అయింది.  
 @ దృశ్యం (2015) : ప్రపంచవ్యాప్తంగా ₹1.1 బిలియన్ (US$13 మిలియన్లు) 
@ దృశ్యం 2 (2022) : ప్రపంచవ్యాప్తంగా ₹345.05 కోట్లు (US$40 మిలియన్లు) వసూలు చేసింది.    
@ దృశ్యం సినిమాను  కొరియన్ భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు.

——-–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!