Ramana Kontikarla………………………………. BJP is raising strategists
మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీలో కొత్త ఉత్సాహానికి బాటలు వేస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 38 స్థానాలకుగాను బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెల్చుకుంది. ఇది హిందుత్వ సెంటిమెంట్ అధికంగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను గెల్చుకుని అతి పెద్ద పార్టీగా నిల్చింది.
ఈ పరిణామం అప్పటికే అధికారంలో ఉన్న మహాయుతి సర్కార్ ని కలవరపెట్టింది. దీంతో ప్రస్తుత ఎన్నికలపై బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టింది. గత ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీని విజయపథంలో నడిపించడంలో భూపేంద్ర యాదవ్, అశ్వనీ వైష్ణవ్ లదే కీలకపాత్ర. మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాత ఈ ఇంఛార్జులపై పూర్తి విశ్వాసముంచిన బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్రలోనూ వీరికే వ్యూహరచన బాధ్యతలప్పగించింది.
ఆ ఇద్దరూ కేంద్ర మంత్రులు. భూపేంద్ర యాదవ్ అమిత్ షాకు సన్నిహితుడు. రాజస్థానీ బీజేపీ నాయకుడైన భూపేంద్ర కు .. సొంత రాష్ట్రం రాజస్థాన్ తో పాటు, ఉత్తరప్రదేశ్, బీహార్ తో సహా, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మంచి పట్టుంది. భూపేంద్ర రాజస్థాన్ లో 2013 ఎన్నికలకు, జార్ఖండ్ లో 2014 ఎన్నికలకు కో ఇంఛార్జ్ గా వ్యవహరించడంతో పాటు… గుజరాత్ కు అప్పటికే ఇంఛార్జ్ గా ఉన్నారు.
అలాగే గత 2019 లోక్ సభ ఎన్నికలతో పాటు, 2020 బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ఇంఛార్జ్ గా వ్యవహరించారు. అయితే, మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో ఇంఛార్జ్ గా వ్యవహరించి పార్టీని విజయం వైపు నడిపించడం మాత్రం ఇదే తొలిసారి. భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం పర్యావరణ, అటవీశాఖ కేంద్ర మంతిగా ఉన్నారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నభూపేంద్ర.. ప్రస్తుతం అల్వార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక అశ్వనీ వైష్ణవ్ ది ప్రత్యేక శైలి. ప్రస్తుతం రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిష్టర్ గా ఉన్నారు. కాన్పూర్ ఐఐటీయన్ గా టెక్నాలజీలో మాస్టర్స్ చేసిన అశ్వినీ వైష్ణవ్.. అమెరికాలోని ఫిలడేల్ఫియాలో వార్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏలో పట్టా పొందారు.
సమాచార సాంకేతికత అనేది బలహీన వర్గాల జీవనశైలిని మార్చి వారిని స్థితిమంతులుగా నిలబెట్టాలన్నలక్ష్యంతో అశ్విన్ వైష్ణవ్ పనిచేస్తుంటారు.భారత ప్రభుత్వ వెబ్ సైట్ లో చదివినప్పుడు అట్టడుగు వర్గాల జీవన స్థితిగతులను మార్చే విధంగా ప్రభుత్వ విధానాలుండాలని బలంగా విశ్వసించే వ్యక్తిగా అశ్వనీ వైష్ణవ్ కనిపిస్తారు.
అయితే, అశ్వనీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్ ఈ ఇద్దరూ మహారాష్ట్రలో బీజేపీ విజయ ప్రస్థానంలో కీలక పాత్రధారులైనప్పటికీ.. ఎక్కువ హడావిడి లేకుండా మీడియాకు దూరంగానే తమ వ్యూహాలను అమలు చేసారు. బ్యాక్ బెంచ్ బాయ్స్ గా ఉంటూ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీజేపీ అలయెన్స్ మహాయుతి విజయానికి… లాడ్లీ బెహన్ యోజన పథకం ఓ గేమ్ ఛేంజర్ గా మారింది.
పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు ఇప్పటికే ప్రతీ నెలా 15 వందల రూపాయలిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రెండు వేల 1 వంద రూపాయలిస్తామని ప్రకటించారు. ఇది మహాయుతికి బాగా కలిసివచ్చిందనే టాక్ ఉంది. ఎన్నికల ప్రచార సమయం నుంచే ఈ విషయం ప్రజల్లో బలంగా చర్చ జరగడం కూడా బీజేపీ విజయానికి కలిసి రాగా… ఈ యోజన పథకం రూపశిల్పుల్లో కూడా వీరిద్దరి పాత్ర ఉండటంతో… ఈ బ్యాక్ బెంచ్ బాయిస్ ఇద్దరూ ఇప్పుడు వార్తల్లో వ్యక్తులయ్యారు.
ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడెలాగైతే పతాకశీర్షికలకెక్కుతున్నాయో… జార్ఖండ్ లో బొక్కాబోర్లా పడి ఎదురుదెబ్బ తగిలిన బీజేపి అపజయంలో మధ్యప్రదేశ్ ఇంఛార్జులుగా వ్యవహరించిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అలాగే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మల పేర్లు కూడా ఇప్పుడు వార్తల్లో హైలెట్ గా నిలుస్తున్నయి. జార్ఖండ్ ఫలితాలు బీజేపీకే కాకుండా… ఇంఛార్జులుగా వ్యవహరించిన వీరిద్దరికీ షాక్ ఇవ్వడంతో… మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంఛార్జుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.