ఇది అనకొండ అమ్మమ్మ !!

Sharing is Caring...

Biggest Snake ……………………………….

ఫోటో భయంకరం గా ఉంది కదా. ఈ మహా సర్పం పేరు  టైటానోబోవా..  ఇప్పుడు భూమిపై నివసిస్తున్న బోవా కన్‌స్ట్రిక్టర్ పాములకు ముందు తరానికి చెందిన మహాసర్పం. ఇది అనకొండను మించిన సైజులో ఉంటుందట. చూస్తుంటేనే భయం కలిగేలా ఉంది.  ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్పం. దీని పొడవు 13 మీటర్ల పొడవు (42.7 అడుగులు) కాగా బరువు 1,135 కిలోల (1.25 టన్నులు) వరకు ఉంటుందని అంచనా. 

దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమిపైన సంచరించేది. ఇప్పుడు పూర్తిగా ఈ జాతి సర్పాలు అంతరించి పోయాయి.2009లో ఈ భయంకర సర్పం తాలూకూ శిలాజాలు బయటపడ్డాయి. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో లాగురిరా లోని బొగ్గు గనిలో ఈ శిలాజాలు దొరికాయి. ఎవరూ టైటానోబోవాను చూసినవారు లేరు. దాని చిత్రం కూడా లేదు. ప్రచారంలో ఉన్నవన్నీ ఊహ చిత్రాలే. దొరికిన శిలాజాలను బట్టి శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను అంచనా వేశారు.

టైటానోబోవా చాలా తక్కువ గా ఆహారాన్ని తీసుకుంటుందట. దానికి తినాలని అనిపించినపుడు మొసళ్లను తినేదట. ఆ తర్వాత టైటానోబోవా మిగిలిన సంవత్సరంలో అసలేమీ తినదట. ఇది నమ్మశక్యం కాని సంగతే. ఇది పూర్తిగా మాంసాహారి. మనుష్యులను సైతం అమాంతం మింగేస్తుంది.కొండ చిలువలు,ఇతర పాములను కూడా తింటుందని సమాచారం.

వాటి పరిమాణం కారణంగా ఈ సర్పాలను టైటానోబోవా అని పిలుస్తారు.వీటిలో ఆడ సర్పాల పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది. ఈ మహాసర్పాలకు విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి కోరలు ఉండవు.ఎగువ .. దిగువ దవడలలో పదునైన దంతాలు ఉంటాయి. వాటితోనే అది వేట ను బంధిస్తుంది. దొరికిన శిలాజాలలో  పుర్రె.. దవడ ఎముకలు మాత్రమే ఉన్నాయి. అయితే దాని నోటి లోపల వంపు తిరిగిన దంతాల వరుసను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

టైటానోబోవా అంతరించి పోవడంలో వాతావరణ మార్పు కూడా ఒక కారణం కావచ్చు అంటారు. గ్లోబల్ ఉష్ణోగ్రతలు క్షీణించడం వల్ల  పెద్ద సర్పాలు అంతరించి సరీసృపాలు .. చిన్న రకాల పాములు పుట్టుకొచ్చాయి. టైటానోబోవా శిలాజాలు ఇప్పటివరకు దక్షిణ అమెరికాలోని కొలంబియాలో సెరెజోన్ ఫార్మేషన్ నుండి మాత్రమే బయట పడ్డాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!