Bharadwaja Rangavajhala……………………..
మాదాల రంగారావు మనోడు … వాడి సినిమా చూడ్డానికే తీరిక దొరకడం లేదు… ఈ రోజు వెళ్దాం వుండు అన్నారు బెజవాడ పడవలరేవు దగ్గర ప్రజావైద్యశాల డాక్టరుగారు. ఆ ఆసుపత్రి వరండాలో అప్పుడప్పుడూ మేం విప్లవరాజకీయాలు మాట్లాడుకునేవాళ్లం.
అప్పట్లో పడవలరేవులోనే ఉండే మా క్లాస్మేంట్ భాస్కరరావు కోసం వెళ్లినప్పుడల్లా ప్రజావైద్యశాల దగ్గరే కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. డాక్టరుగారు సిపిఎం అనుకుంటాను. భాస్కర్ వాళ్ల ఫాదర్ కూడా సిపిఎమ్మే. వీడు ఆర్ఎస్యూ. అలా ఆ రోజు అందరం కలసి సైకిళ్లేసుకుని రామాటాకీసులో యువతరం కదిలింది అనే సినిమా బాధ్యతగా చూసొచ్చాం.
నిజానికి మాదాల రంగారావు అంతకు ముందే కలియుగ మహాభారతం లోనూ బంగారు చెల్లెలు సినిమాలోనూ పరిచయం. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణలో అర్జునుడి పాత్ర ఆఫర్ చేసి ఒక రోజు షూట్ తర్వాత వద్దనుకుని హరికృష్ణను తీసుకున్నారు. గెటప్ కు ఒదగడం లేదనేది అన్నగారి ఫీలింగని అప్పట్లో విన్నాను.
మాదాల రంగారావు, విజయచందర్, నారాయణ మూర్తి వీళ్లంతా ప్రత్యేక తరహా నటులు. ఇండస్ట్రీలో బ్రేక్ కోసం నానా కష్టాలూ పడి తామే ఓ పాత్ వేసుకుని అలా ముందుకు సాగిపోయారు. మాదాల రంగారావు తీసిన యువతరం కదిలింది సినిమాకు ప్రేరణ కంచికచర్ల కోటేశు హత్యే. కోటేశుకే ఓ తమ్ముడుండి వాడు చదువుకుని లెక్చరర్ అయితే … విద్యార్ధులకు కోటేశు కథ తెలిస్తే … వాళ్లు ఆ ఊరి భూస్వామ్యం మీద తిరగబడితే … ఇలా నడుస్తుంది ఎర్ర ఫిక్షన్.
ఆ సినిమాకు ముందనుకున్న దర్శకుడు వి.మధుసూదనరావు. ఎందుకంటే కమ్యునిస్టు సినిమా తీయాలంటే విఎమ్మార్ లేకుండా ఎలా కదా … మాదాల కూడా అలాగే ఆలోచించాడు. బొల్లిముంత శివరామకృష్ణ రచయిత. అయితే అప్పుడు సూపర్ మేన్ ను ఆంజనేయుడి అంశగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తో సూపర్మ్యాన్ సినిమా తీసే పన్లో బిజీగా ఉన్నారు మధుసూదనరావు. మాదాల రంగారావును ఆయన బచ్చాగాడిలానే చూశారు.
రంగారావుకు మండింది. నువ్వూ ఒద్దు నీ రైటరూ వద్దు రామారావుతో సినిమాలు తీసుకునేవాడివి నీకెందుకు విప్లవం అని బహిరంగంగానే తిట్టి ధవళ సత్యం తో ముందుకు కదిలారు. రంగారావుకు తొలి రోజుల్లో విశ్వశాంతి విశ్వేశ్వరరావుగారి సపోర్టు ఉండేది. విప్లవశంఖం చిత్రానికి ఫైనాన్స్ కూడా వారే అందించారని అప్పట్లో చెప్పుకునేవారు.
యువతరం కదిలింది, ఎర్రమల్లెలు సినిమాలు విజయవంతం అయ్యాక … మరో నాలుగు సినిమాలతో విప్లవం తీసుకువస్తా లాంటి బారీ స్టేట్మెంట్లు ఇచ్చారు మాదాల రంగారావు. ఎర్రమల్లెలు అనగానే నాకో చిన్ననాటి ముచ్చట గుర్తొస్తుంది. ఇంటర్లో ఉన్నామప్పుడు. విజయవాడ మారుతీనగర్ లో మా ఫ్రెండ్ పద్మనాభరావు ఇంట్లో కంబైండ్ స్టడీస్ జరిగేవి. సాయంత్రం ఆరింటి నుంచీ ఉదయం ఆరింటిదాకా నడిచేవి.
నేను వాటిలో ఎన్నడూ పాల్గొనలేదుగానీ అప్పుడప్పుడూ సెకండ్షో చూసొచ్చేప్పుడు అక్కడ నడుం వాల్చేవాడిని. ఆ గ్యాంగులో ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తోందనుకుంటా కుసుమ … మా క్లాస్మేట్ ఉమాదేవి తదితరులు కూడా ఉండేవారు.ఆ సంవత్సరం పరీక్షలు అయిపోగానే కుసుమే అనుకుంటా … మరి ఈ రోజు మనందరం సినిమాకు వెళ్దాం … టిక్కెట్లు నువ్వు పట్టుకురా అని బాధ్యత నాకు అప్పగించారు.
నిజానికి అప్పుడే ఏదో ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. దానికి తీసుకోవాలనేది వారి ఆలోచన. కానీ నేను ఎర్రమల్లెలు సినిమాకు తెచ్చాను. ఈ ఆడనేడీసందరూ నన్ను మామూలుగా తిట్టలేదు. సినిమా బాగానే ఉంది కదా అన్నా వినిపించుకోలేదు.
ఆ తర్వాతెప్పుడో మా మావయ్యగారి అబ్బాయి విజయవాడ వచ్చి దుర్గగుడికి వెళ్లాలంటే తీసుకెళ్లి నువ్వు లోపలికి వెళ్లు అని వాళ్లని పంపేసి నేను ప్రసాదం కౌంటర్ల దగ్గర నిలబడి ప్రసాదం కొనుక్కుని బయట అరుగు మీద కూర్చుని తింటుండగా కుసుమ దేవాదాయశాఖ వారి కార్యాలయంలోంచీ బయటకు వస్తూ నన్ను చూసి … వచ్చింది.
దేవుడితో పన్లేనప్పుడు ప్రసాదం ఎందుకు తింటున్నావ్ అని ప్రశ్నించింది. ఏదో నా తిప్పలు నేను పడుతున్నాను కదా … నీకేల నా గోల అని కేసేపు తన మెదడు తినేసి … వచ్చేశాను. అప్పుడు కూడా అక్కడ వాళ్లెవరికో నన్ను పరిచయం చేస్తూ … ఈ ఎర్రమల్లెలు ఘటనను ప్రస్తావించి నాకు బోల్డు కోపం తెప్పించింది.
ఏది ఏమైనా .. మాదాల రంగారావు సినిమాలు వరసగా హిట్టవుతున్న సందర్భంలో మా గిరిబాబు కూడా మాదాలతో పొలికేక అనే సినిమా అనౌన్స్ చేశాడు. సరిగ్గా అప్పుడే మహాప్రస్థానం , ప్రజాశక్తి సినిమాలు ఢమాల్ అనడంతో పొలికేకను గొంతులోనే నొక్కేసుకుని గిరిబాబు పక్కకెళ్లిపోయాడు.
అలా తెరవెనక్కి వెళ్లిన మాదాల రంగారావు నట జీవితంలో ఓ విచిత్రం జయకృష్ణ తీసిన వీరభద్రుడు. రవిరాజా పినిసెట్టి తొలి చిత్రం. ఇళయరాజా సంగీతం.. అందులో కాస్త మొరటుగా ఉండే మిలట్రీవాడి పాత్రలో బాగా నటించాడు. అయితే రంగారావు ఎర్ర ఇమేజ్ వల్ల సినిమా ఆడలేదు. ఆ తర్వాత తను సినిమాలు మానేశాడు. మధ్యలో నారాయణమూర్తి హవా నడుస్తున్న కాలంలో కళ్యాణరావుగారి నాటకం తొలిపొద్దు తీశారు…అదీ ఆడకపోవడంతో వద్దులే అనుకున్నారు.
సిపిఐ తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేవారు. తొలి రోజుల్లో ఎన్టీఆర్ మీద గట్టి విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. మూసధోరణి … కథలతో జనాన్ని విసుగెత్తించిన వాళ్ల జాబితాలో మాదాల రంగారావు పేరును చేర్చకతప్పదు.
ఎన్టీఆర్ ఎర్రజండా పట్టుకోకుండా అనేక సినిమాల్లో… మాదాల రంగారావు, ఆర్ .నారాయణమూర్తి విప్లవ సినిమాల్లో చేసిన పనే చేసేవాడు. అదే పనిని వీళ్లు ఎర్రజండా పట్టుకుని చేస్తారు.జనం వాడే గొప్పనుకున్నారు. సినిమా ఆత్మను అర్దం చేసుకుని వాస్తవిక సినిమా ఉద్యమానికి ప్రజా సినిమా ఉద్యమానికి ఊతం కావాల్సిన వీళ్లు ఇలా భ్రష్టుపట్టిపోయారు అనే బాధేస్తుంది మాదాలను తల్చుకుంటే.