దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిచి ఓ గొప్ప చారిత్రిక విజయాన్ని లిఖించుకుంది. అంతే కాదు తెరాస తోపు పార్టీ అనే భావనకు గట్టి దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కానీ, అధికారంలో ఉన్నాం కదా అని మేం ఏదంటే అది చెయ్యొచ్చు అనే భావనలో ఎవరు ఉన్నా ప్రజలు చెంప ఛెల్లు మనిపిస్తారనే రిజల్ట్ ఇచ్చారు.
ముఖ్యంగా గొప్ప గొప్ప విశ్లేషకులుగా చెలామణీ అవుతూ పార్టీలకు, పార్టీ నేతలకు బాకాలు ఊదే పనిలో ఉన్న అనేకమందికి మామూలుగా తగిలిన దెబ్బ కాదు ఇది. నేల విడిచి సాము చేసే చందంగా మారింది వారి పరిస్థితి.ఓసోస్ ఒక్క గెలుపుకే ఈ స్టేట్ మెంటా అనుకోకండి. జర ఆలోచించండి. దుబ్బాక విజయం ఆషామాషీ అనుకోలేం. అంతలా తీసిపారేసే అంశమూ కాదు. గతంలో అసలు బరిలో ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేలా ఉండే బీజేపీ అధికారంలో ఉన్న పార్టీనీ, అందులోనూ ఫుల్ సెంటి మెంట్ ఉన్న పార్టీనీ, ఫుల్ సెంటిమెంట్ కే జై కొట్టే ప్రాంతంలో కాషాయ జెండా ఎగుర వేయడం అంటే మామూలు విషయం కాదు.
గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి రామలింగారెడ్డి కి 62,500 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలో కేవలం తెరాస కు 62273 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే గతంలో వచ్చిన మెజారిటీ మొత్తం పోయింది. అలాగే గత ఎన్నికలో రఘునందనరావు కి 22,595 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలో దాదాపు వాటితో పాటు అదనంగా 40 వేల ఓట్లను సాధించారు. ఆయనకు మొత్తం 63352 ఓట్లు వచ్చాయి. అంత పెద్ద ఎత్తున ఓట్లను చీల్చడం అంటే మాటలు కాదు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనమెంతో కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇక తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జబ్బలు చరచుకునే స్థాయి లేదని తేలిపోయింది ఈ ఎన్నికతో. ఓ రకంగా చెప్పాలంటే ఈ విజయం కేవలం బీజేపీ గొప్ప వల్ల మాత్రమే వచ్చింది కాదు. తెరాస పాలనకు, తెరాస పార్టీకి ప్రజలు ఇచ్చిన గట్టి హెచ్చరిక. ఉద్యమ పునాదులపై పుట్టిన పార్టీలో ఏర్పడ్డ డొల్ల తనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ పార్టీలో నీరు గారుతోన్న ఉద్యమ స్ఫూర్తిని గమనించని గులాబీ బాసులకు చెప్పిన ఓ గుణపాఠం. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.
క్రమేపీ చాపకింద నీరులా బీజేపీ తెలంగాణలో చొచ్చుకుపోతోందనేందుకు బలమైన సంకేతం వచ్చినట్లే అయ్యింది దుబ్బాక ఫలితం. బీజేపీ గొప్పగా సంబరాలు జరుపుకునే విషయమే.గ్రౌండ్ రియాలటీలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడంతో పాటు సరైన ఫీడ్ బ్యాక్ ను తీసుకోవడం కూడా పాలక పక్షానికి అవసరం. అదేం విచిత్రమో ప్రతిపక్షంలో ఉన్నంత వరకూ ప్రతి పార్టీ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అధికార పక్ష పాత్రలోకి వచ్చేసరికి విపరీత ధోరణులతో బొక్కబోర్లా పడుతుంది.ఇక బీజేపీ నేతలకు , శ్రేణులకు ఈ విజయం బూస్టర్ డోస్ లాంటిది. ఈ ఉత్సాహంతో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో దూసుకుపోవచ్చు.
————— Mnr M