ఈ తిమ్మక్క సామాన్యురాలు కాదు !

Sharing is Caring...

Tree lover Thimmakka …………………………………..

పై ఫొటోలో కనిపించే తిమ్మక్క సామాన్యురాలు కాదు. 107 సంవత్సరాల వయసులో పద్మశ్రీ పురస్కారం పొందింది. అవార్డు స్వీకరించడానికి వెళ్లి రాష్ట్రపతి కోవింద్ ను ఆశీర్వదించి వచ్చింది. ఇక తిమ్మక్క గురించి చెప్పుకోవాలంటే చాలా కథే ఉంది. ఆమెకు సుమారుగా యాభై వరకు అవార్డులు వచ్చాయి.

ఎందుకంటారా ? తిమ్మక్క కు చెట్లు అంటే మహా ప్రేమ. మొక్కలంటే ప్రాణం. బయటి ప్రపంచానికి  ఈ తిమ్మక్క గురించి పెద్దగా తెలియదు. పర్యావరణ ప్రేమికులు మాత్రం ఈమెను టక్కున గుర్తిస్తారు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆమెకో గుర్తింపు ఉంది. 

తిమ్మక్కది కర్ణాటక రాష్ట్రం లోని హూలికల్ గ్రామం. గుబ్బి పరిధిలోని తుముకూరు లో పెరిగింది.పేదరికం కారణంగా చదువుకోలేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు. పదేళ్ల వయసు నుంచి తిమ్మక్క గొర్రెలను, మేకలను కాసేది. వాటిని తోలుకుని అడవుల్లోకి వెళ్ళేది. ఈ క్రమంలోనే చెట్లతో తిమ్మక్క కు అనుబంధం పెరిగింది.

రోజుకో రకం మొక్కను తీసుకొచ్చి ఇంటి ఆవరణలో నాటేది. మెల్ల మెల్లగా ప్రకృతి తో స్నేహం మొదలు పెట్టింది. చదువు లేకపోయినా చెట్ల గురించి అవగాహన పెంచుకుంది. నిరంతరం వాటి చుట్టూ తిరుగుతూ చెట్లపై ప్రేమ పెంచుకుంది. ఈ క్రమంలోనే తిమ్మక్క కు పెళ్లి అయింది. భర్త చిక్కయ్య కూడా రోజువారీ కూలీయే.

ఏళ్ళు గడిచినా ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఇద్దరూ బాధపడ్డారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. చెట్లనే పిల్లలుగా భావించుకున్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటేది. పెరిగి పెద్దయిన చెట్లను చూసి సంబరపడేది. వాటిని కంటికి రెప్పలా కాపాడుకునేది. హూలికుల్ నుంచి కుడూర్ వరకు నాలుగుకిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా 385 మర్రి చెట్లను పెంచింది.

కేవలం మర్రిచెట్లే కాకుండా దాదాపు 8000 ఇతర రకాల మొక్కలను నాటింది. రోజూ వాటికీ నీళ్లు పోయడం.. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఆమె దిన చర్య గా మారింది. భర్త కూడా ఆమె ను ప్రోత్సాహించేవారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం తిమ్మక్క సేవలను గుర్తించింది. ఆమెను పర్యావరణ వేత్తగా ప్రకటించింది.

అలా అలా ఆమె సేవలు ప్రపంచానికి తెలిసాయి. 1991 లో తిమ్మక్క భర్త మరణించారు. అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. ఎంతోమందికి స్ఫూర్తి గా నిలిచింది. అమెరికాలోని లాస్ఏంజిల్స్, ఆక్లాండ్ , కాలిపోర్నియా పర్యావరణ సంస్థలు తిమ్మక్కాస్ రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టుకున్నాయి.

సీబీఎస్ ఈ పాఠ్యపుస్తకాల్లో తిమ్మక్క గురించి ఒక పాఠ్యంశాన్ని పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తిమ్మక్క సేవలను గుర్తించి రెండేళ్ల క్రితం పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. అలా ఎన్నో అవార్డులు తిమ్మక్క కు లభించాయి. గొప్ప విషయం ఏమిటంటే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించిన పదిలక్షల నగదు బహుమతిని కూడా తిమ్మక్క తిరస్కరించింది. కేవలం ప్రభుత్వం ఇచ్చే 5 వందల ఫించను తో బతుకుతోంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!