భండారు శ్రీనివాసరావు……………………………………………
నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ విజయాలు.
అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ రెండూ విడివిడిగా రాశారు, పాండవోద్యోగం, పాండవ విజయం అని. ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్ని వేలసార్లో, వేలేమిటి లక్షసార్లు అని కూడా చెప్పొచ్చు .
కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది. పేరు తెచ్చి పెట్టింది. బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యనం’ కూడా ప్రసిద్ధి పొందినవే.తర్వాత వచ్చినవి కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’, తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’. మిగతావన్నీ చెదురుమదురగా ఆడేవి, ‘పాదుక పట్టాభిషేకం’ వంటివన్న మాట.
ఆరోజుల్లో నాటకం ఆడడానికి స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా మంచి మైకు సెట్టు. మైకు బాగా లేకపోతే జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు. వెనక వైపు ఓ తెరా, ముందు మరో తెర వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను కప్పీ మీద లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు.
ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెడో ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది. ఆ మధ్యన ఓ అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు. సమాధానం ఏమి వచ్చిందో గుర్తు లేదు.
ఎవరికయినా తెలిస్తే తెలిస్తే చెప్పండి. రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత, ‘శ్రీకృష్ణ పరమాత్మకీ జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు. ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని, మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి వెళ్లి జనంలో పడేది.
బెజవాడలో ఇప్పటి నవరంగ్ థియేటర్ని 1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు. యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు. దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే గాంధీ నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు. అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం పైన వున్నచిన్న హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక మర్నాడు ఆదివారం పడుకోవచ్చని కాబోలు.
నటిస్తూనే చనిపోయిన నటులు
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి ‘బాలనాగమ్మ’ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది. మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే స్టేజీ మీదే చనిపోయారు. అలాగే ‘రామాంజనేయ యుద్ధం’ లో ఆంజనేయుడి పాత్ర ధరించే బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు.
మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు. కుందేరు కృష్ణ శర్మ అని విజయవాడలో కనక దుర్గ కళాసమితి గుమస్తాగా వుండే వారు. చాలా నాటకాల్లో వేసేవారు. కృష్ణుడు దగ్గర్నుంచి సహదేవుడి దాకా.
ప్రతి నాటకంలోను ఆయన తప్పని సరిగా కనపడే వారు. ఎంతో సహృదయులు. చాలా మంది నటులు అవసాన దశలో కష్టాలు పడుతుంటే చూడలేక వాళ్ళకోసం వో నాటకం పెట్టి ఇంటింటికీ వెళ్లి టికెట్లు అమ్మి డబ్బు పోగు చేసి ఇచ్చేవారు. కర్రి అబ్బులు, ద్వారపూడి సూర్యారావు, కే. హరి ప్రసాద రావు, అయ్యదేవర పురుషోత్తమరావు కూడా కృష్ణుడి వేషం వేసి పేరు తెచ్చుకున్నవారే.
హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు వాస్తవ్యులు వుండే వారు. ‘వింధ్యారాణి ఫేం’ అని చెప్పుకొనేవారు. మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర వేసే వారు. తర్వాత వేటపాలెం నుంచి మరో డి. వి. సుబ్బారావు వచ్చారు. హరిశ్చంద్ర వొకటి ఆడేవారు. ఐదో తరగతి కూడా చదివి వుండరు కానీ ఆయన వేసిన టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా వచ్చేవి.
నెల్లూరుకు చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు. హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు విశ్వామిత్రుడుగా వేసేవారు.పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్ర కోసమే పుట్టాడా అనిపించేలా అద్భుతంగా నటించే వాడు.
‘హరిశ్చంద్ర’ లో నక్షత్రకుడు, ‘చింతామణి’లో భవాని శంకరుడు వేసే వారు. బీవీ రంగారావు బెజవాడ మునిసిపాలిటీలో పని చేస్తూ నాటకాలు వేసేవారు. అర్జున వేషంతో పాటు ‘రాయబారం సీను’లో అశ్వథామ వేసేవారు. ‘అదిగో ద్వారక’ పద్యం ఈయన పాడితేనే వినాలి సుమా అన్నట్టుగా పాడేవారు. ‘హరిశ్చంద్ర’ కూడా వేసేవారు.
బెజవాడ జింఖాన గ్రౌండ్స్ లో చేనేత సప్తాహాలు జరిగేవి. చేనేత వస్త్రాలు ప్రదర్శించేవారు. జనం రావడం కోసం రోజుకో నాటకం వేయించే వారు. ఓసారి రంగారావు ‘హరిశ్చంద్ర’ పెట్టారు. ప్రేక్షకులకు వెసులుబాటు ఏమిటంటే నాటకం ఆరుగంటలకే మొదలెట్టే వారు. దాదాపు నాలుగైదు వేలమంది అలా నిశ్శబ్దం గా కూర్చొని నాటకం చూసారు.
ఏలూరు దగ్గర కలపర్రు వెంకటేశ్వర్లు – పద్యాలు వినీ వినీ నటుడుగా మారిన కోవలోకి వస్తారు. అర్జునుడు వేసేవారు. ‘కురుక్షేత్రం’ ఆఖరి సీనులో అభిమన్యుడు చనిపోయినట్లు తెలిసిన తర్వాత అర్జునుడు పాడే పద్యాలు, కృష్ణుడి ఊరడింపుల మధ్య పగ తీర్చుకొంటానని చేసిన ప్రతిజ్ఞలు బాగా పాడేవారు.అలాగే కొచ్చెర్లకోట సత్యనారాయణ అని చాలా ముందు తరం నటుడు.
అర్జునుడు, కృష్ణుడు, రాముడు వేసేవారు. షణ్ముఖితో కలసి ద్వారక సీను రికార్డు ఇచ్చారు.సంగీత విద్వాన్ అద్దంకి శ్రీరామ మూర్తి గారు ధర్మరాజు వేషానికి ప్రసిద్ధులు. ‘కురుక్షేత్రం’తో పాటు ‘పాదుకా పట్టాభిషేకం’ కూడా ఈయనకి పేరు తెచ్చి పెట్టింది. తొలి తరం సినిమాల్లో కూడా వేశారు.
పి. సూరిబాబు, రాజేశ్వరి రంగస్థల నటులలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా. స్టేజి మీద ఆయన ధర్మరాజు వేసేవారు. పాచికలు ఆడే సీనులో తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా పెట్టి వోడిపోతున్న ఘట్టంలో పద్యాలు గొప్పగా ఉండేవి.
రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా రైలు పట్టాలకు ఆవతలి వయిపు ‘రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.షణ్ముఖి ఆంజనేయ రాజు అని తణుకులో వుండేవారు.
‘జీళ్ళపాకం సంగీతం’ అని కొందరు విమర్శించినా ఆయన పద్యం వినడం కోసం వేలాదిమంది తహతహలాడేవారు. గరికిపాటి నరసింహరావు గారు ఈ మధ్య ‘భక్తి ఛానల్’లో ‘భారతం’ ఫై ప్రసంగిస్తూ, షణ్ముఖికి గొప్పగా నివాళులర్పించారు.
‘ఆయన నాటకాలు చూడడానికి తాడేపల్లి గూడెం నుంచి సైకిళ్ళు వేసుకొని భీమవరం వెళ్లడం బాగా గుర్తు. రాయబారం సీనులో ఆంజనేయరాజు పాడే ఆ నాలుగు పద్యాల కోసం వెళ్లి ఒన్స్ మోర్ లు కొడుతూ మళ్ళీ మళ్ళీ పాడించుకొనేవాళ్లమ’ని ఆయన గుర్తు చేసుకున్నారు.
(మిత్రులు శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు ఇచ్చిన సమాచారం లేకపోతే ఈ వ్యాసరచన సాధ్యం అయ్యేది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు)