ఆ మినప రొట్టెల రుచి అద్భుతం !

Sharing is Caring...

కోనసీమలో మూకుడు రొట్టె చాలా పాపులర్. అందులో ముక్కామలలో  మినప రొట్టెలు  మరీ ప్రసిద్ధి. సాయంకాలం వేళలో ఈ మినప రొట్టెల కోసం జనం ఎదురుచూస్తుంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ  ఇడ్లీ, పూరీ, దోశె , గారె వంటి పదార్ధాలను  అల్పాహారం  తీసుకోవడం సర్వసాధారణం.

సాయంత్రం సమయంలో మాత్రం వేడే వేడి మూకుడు రొట్టె కోసం వేచి చూస్తుంటారు. మట్టిమూకుడులో సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన మినపరొట్టెను అరటి ఆకులో వేసుకుని తింటూ ఉంటూ ఉంటే  ఆ రుచి అద్భుతం అంటారు  టిఫిన్‌ ప్రియులు.

ఇంతగా నోరూరించే మినప రొట్టెలు ఎక్కడ తయారవుతున్నాయంటే … అంబాజీపేట మండలం ముక్కామలలో ఒక చిన్న పూరి పాకలో కాల్వగట్టుపై చిన్న హోటల్‌ ఉంది. అబ్బిరెడ్డి సత్యనారాయణ అనే పెద్దాయన  గత 50 ఏళ్ల నుండి ఈ పూరి పాకలో మినపరొట్టెను సాయంత్రం సమయంలో అమ్ముతూ  జీవనం సాగిస్తున్నాడు.

మట్టి మూకుడులో నిప్పులపై కాల్చిన మినపరొట్టె ఎంత రుచో మాటల్లో చెప్పలేమని రొట్టె ప్రియులు చెబుతున్నారు. పావలా తో  మొదలెట్టి ప్రస్తుతం నుండి రూ.15 లకు మినప రొట్టెను అబ్బిరెడ్డి అమ్ముతున్నారు..

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హొటల్‌ నిర్వహిస్తాడు.  ప్రతీ రోజు సుమారు 100 నుండి 150 మినప రొట్టెలను తయారుచేసి అమ్ముతాడు. మూకుడులో మినపరొట్టె తయారీకి సత్యనారాయణ ఇటుకల పొయ్యిపై ఎక్కువగా బొగ్గులు, కొబ్బరి చిప్పలు  వినియోగిస్తాడు.  

మట్టి మూకుడులో మినపపిండి వేసి దానిపై మూత ఉంచి కింద పైన  నిప్పుల సెగతో రొట్టెను కాలుస్తాడు. రొట్టెలను ‌ ప్లేట్‌లలో..  ప్లాస్టిక్‌ పేపర్ లో కాకుండా  అరటి ఆకులో వేసి ఇస్తాడు.  50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మట్టి మూకుడు, నిప్పుల పొయ్యి తప్ప దేనిపైనా వండలేదని అబ్బిరెడ్డి చెబుతున్నాడు.

ఆదాయం అంతంత మాత్రమే అయినా  వేరే వృత్తి తెలియకపోవడంతో ఈ హోటల్ పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినపుడు తప్పక రుచి చూసి రండి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!