ఆకట్టుకునే కళాకారుడి కథ!

Sharing is Caring...

Sai Vamshi …………………

అరె మల్లిగా.. కోరికలు తీరక సచ్చిపోయినోళ్లందరు దెయ్యాలైతరారా?’ అంటాడు ముత్తయ్య. ఆ ప్రశ్నలో అమాయకత్వం ఉంది. ఆలోచన ఉంది. తన కోరిక తీరుతుందో, లేదోనన్న భయం ఉంది. అంతకుమించిన బాధ ఉంది. నిజమే మరి. 

ఎక్కడో మారుమూల పల్లెలో 60 ఏళ్ల వయసులో అస్తూబిస్తూ అంటూ తిరిగే ఆయనకు పుట్టిన కోరిక అట్లాంటిట్లాంటిది కాదు. గట్టి కోరిక. మరది తీరేదెలాగ? ఇంతకీ ఎవరీ ముత్తయ్య? ఏంటాయన కథ?

ముత్తయ్య కళాకారుడు. కళ మాత్రమే తెలిసిన కళాకారుడు. స్టేజీ మీద వేసే నాటకంలో తప్ప, నిజజీవితంలో నటించడం తెలియని అమాయక నటుడు. ఊరిలో ఆయనకున్న నిండైన సోపతి మల్లిగాడు. పాతికేళ్ల మల్లిగాడికి, అరవై ఏళ్ల ముత్తయ్యకీ దోస్తాన్.

మందుకాడ, మజాకుల కాడ, తిట్టుకునేకాడ, పొట్టుపొట్టు కొట్టుకునేకాడ.. ఇద్దరికిద్దరూ జతగాళ్లు. కొడుకు, కోడలు, మనవడితో ఒక తీరైన బతుకు ముత్తయ్యది, ఎవరూ లేక, ఊరిలో పంక్చర్లు వేస్తూ బతికే తీరు మల్లిది. మల్లిగాడికో ప్రేమకథ.

రోజులిట్లా ఊరికే సాగితే ఎట్లా? ఏదో ఒక మలుపు తిరగాలి కదా? అలాంటి మలుపే ముత్తయ్యకున్న కోరిక రూపంలో వచ్చింది. కోరిక అని అనేకన్నా, ఆశ, ఆకాంక్ష, ఆశయం అని పేర్లు పెట్టొచ్చు. ఎలాగైనా దాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. మల్లి ముందు తన మనసులో మాట బయటపెట్టాడు.

మాట సరే, దాని ఖర్చు మాటేమిటి? ముత్తయ్యకున్న ఏకైక ఆధారం అతని పొలం. అది అతని భార్య జ్ఞాపకం.దాన్ని తాకట్టు పెట్టయినా సరే పని జరిపించాల్సిందే. కానీ.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎలా? మధ్యలో ఏవో బాధలు..ఇంకేవో కష్టాలు..మరికొన్ని ఇబ్బందులు. చివరికి ముత్తయ్య కల నెరవేరిందా? అతని ఆశ తీరిందా?

ఇటీవల కాలంలో తెలుగు తెరకు దొరికిన చక్కని నటుడు ‘సుధాకర్‌రెడ్డి’(‘బలగం’ సినిమాలో తాత) తన నటవిశ్వరూపం చూపించిన సినిమా ఇది. నిజంగా ఇంత చక్కగా, ఈజ్‌తో చేసే నటుడికి భలే భలే పాత్రలు దొరుకుతున్నాయే అనిపిస్తోంది. ‘కొత్తపోరడు’ వెబ్ సిరీస్ నుంచి మొన్న వచ్చిన ‘బాపు’ దాకా ఆయన పాత్రలు గమనిస్తే దాదాపు అన్నీ పల్లె నేపథ్యంలోని పాత్రలే.

ఆ పాత్రలన్నీ కథలో కీలకంగా ఉంటూ రక్తికట్టించడం విశేషం. ప్రతి పాత్రలో ఒక వైవిధ్యం ఉంది. సహజత్వం ఉట్టిపడే ఆహార్యం, వేరెవరూ అనుకరించలేని గొంతు.. అవి రెండూ ఆయనకు బలం. ఈ సినిమాలో కూడా చాలా సహజంగా నటించారు. ఎంత సహజంగా అంటే, టక్కున బయట చూస్తే ‘హేయ్.. ముత్తయ్యరా’ అని గుర్తుపట్టేంత.

కొన్ని సీన్లలో చాలా మెలోడ్రామా పండించే అవకాశం ఉన్నా, అటు దర్శకుడు, ఇటు ఆయన ఆ అవకాశం వాడుకోకుండా, వీలైనంత సహజంగా ఆ సీన్లను ముందుకు తీసుకెళ్లారు.మల్లి పాత్రలో అరుణ్‌రాజ్ నటన సింప్లీ సూపర్. ఊళ్లో తిరుగుతూ, ఏదో పని చేసుకుంటూ, ఓ అమ్మాయిని ప్రేమిస్తూ తిరిగే పోరగాళ్లు పల్లెల్లో కనిపిస్తూ ఉంటారు.

ఇలాంటి పాత్రలు సినిమాల్లో చూసినప్పుడు కొంత హీరోయిజం, కొంత ఓవర్ ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి రాకుండా ఆ పాత్ర చేయడంలోనే ఉంది అసలు టాస్క్. సహజంగా కనిపించాలి, యథాలాపంగా మాట్లాడాలి, ఊరిలో మనుషుల్లా ఉండాలి.. అదే సమయంలో ప్రేక్షకులకు గుర్తుండేలా ఆ పాత్రను మలుచుకొని నటించాలి. ఏమాత్రం తేడా కొట్టినా ఇలాంటి పాత్రలు చెడిపోతాయి.

ఇక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడింది. మల్లి పాత్ర వేసుకునే బట్టల దగ్గర్నుంచి, అతను పెట్టుకున్న సైకిల్ పంక్చర్ షాపు దాకా అన్నీ సహజంగా కుదిరాయి. ఎక్కడా అతి లేదు, రానివ్వలేదు.దివాకర్ మణి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం. వనపర్తి చుట్టుపక్కల లొకేషన్లను చాలా బాగా పట్టి చూపించారు.

పల్లెలో ఓ కెమెరా పాతి, చుట్టూ మనుషుల్ని నటించమని చెప్పినట్టే ఉంది. అందుకే సినిమాలో అందరూ ఏ జంకూ లేకుండా నటించారనిపిస్తోంది. పల్లెటూరి కథతో సినిమా అనగానే పల్లెవాసులంతా అమాయకులు, అజ్ఞానులు, ఏమీ తెలియనివాళ్లు అనే పద్ధతిలో కొన్ని సీన్లు పెడుతూ ఉంటారు. అవి నాకు చిరాకు పుట్టిస్తాయి. ఈ సినిమాలో అలాంటివి లేకపోవడం చాలా చాలా హాయి.

2025 నాటికి పల్లెలు చాలా మారాయి. వాళ్లకీ టీవీలు, సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అక్కడా ఇంటర్‌నెట్ ఉంది. అక్కడా గొడవలు, కొట్లాటలు ఉంటాయి. ఒకరిని చూసి మరొకరు పడే అసూయలు ఉంటాయి. ఇవన్నీ దాచేసి, పల్లెల్లో అంతా అమాయక జనాలనీ, వారికేమీ తెలియదనీ, పగలు చద్దన్నాలు తింటూ, రాత్రిళ్లు కందిళ్లు పెట్టుకొని జీవిస్తుంటారని, పట్నం వాళ్లు వచ్చి వాళ్లకేదో కొత్తగా జ్ఞానోదయం అందించాలనే పాయింట్‌తో తీసే సినిమాలు నాకు నచ్చవు.

అలాంటి పాయింట్ కాకుండా, పల్లెని పల్లెలాగా, అక్కడి మనుషుల్ని సహజంగా చూపించినందుకు ఈ సినిమా నాకు నచ్చింది. కుడోస్ టు డైరెక్టర్ భాస్కర్ మౌర్య.. పల్లెను, పల్లె మనుషుల్ని సహజంగా తెరపై చూడాలనుకునేవారు ఈ సినిమా తప్పకుండా చూడండి. ముత్తయ్య కల నెరవేరడానికి పడ్డ ఆపసోపాలేంటో తెలియాలంటే చూడండి. ‘ETV WIN’ యాప్‌లో సినిమా అందుబాటులో ఉంది.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Arun raj June 7, 2025

Leave a Comment!

error: Content is protected !!