ఉగ్రవాది కసబ్ ఫోటో తీసింది ఈయనే !

Sharing is Caring...

Adventure…………………………………….

ఈ ఫొటోలో కుడి వైపు కనిపిస్తున్న వ్యక్తి పేరు సెబాస్టియన్ డిసౌజా. వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్. పదమూడేళ్ల క్రితం నవంబర్ 26 న ముంబై పై దాడులు జరిపిన అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్‌ అనే ఇద్దరి ఉగ్రవాదుల ఛాయా చిత్రాలను తీసి ప్రపంచానికి పరిచయం చేసింది ఇతగాడే.

ఎంతో సాహసం చేసి ఆ ఉగ్రవాదులను చిత్రాలను తీసిన ఏకైక ఫోటోజర్నలిస్ట్ గా సెబాస్టియన్ డిసౌజా ప్రపంచ వ్యాప్త వార్తాపత్రికల మొదటి పేజీలలో స్థానం సంపాదించుకున్నాడు. లైఫ్ రిస్క్ చేసి తన వృత్తి ధర్మాన్ని నిర్వహించాడు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు అతగాడు తీసిన ఫొటోలే కోర్టుకు సాక్ష్యంగా నిలిచాయి. డిసౌజా ఉగ్రవాదుల దాడుల ఫోటోలు దాదాపు 90 తీసాడు.

ఆ తర్వాత నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. గిర్గావ్ చౌపటీ సమీపంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇస్మాయిల్ ఖాన్ హతమవ్వగా, సజీవంగా దొరికిన ఏకైక ఉగ్రవాది కసబ్‌ ఒక్కడే. తర్వాత కసబ్ కి కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ ఇద్దరూ ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST) వద్ద ప్రజలపై కాల్పులు జరుపుతున్నపుడు .. ఫోటోగ్రాఫర్ డిసౌజా ఆ చిత్రాలను చాకచక్యంగా కెమెరాలో బంధించాడు.

కాల్పుల శబ్దాలు .. ప్రజల హాహాకారాలు నడుమ డిసౌజా రైలు బోగీలో  దాక్కుని తన నికాన్ కెమెరాలో టెలిఫోటో లెన్స్ ఉపయోగించి కసబ్  చిత్రాలను తీశాడు. అతడు పనిచేస్తున్న ముంబై మిర్రర్ కార్యాలయం CSTకి ఎదురుగా ఉండేది. దాని పక్కనే టైమ్స్ అఫ్ ఇండియా ఉండేది. కాల్పుల శబ్దం వినబడగానే  డిసౌజా వెంటనే స్పందించి స్టేషన్ కి వెళ్ళాడు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న రైలు భోగీ లోకి దూరాడు. అక్కడనుంచి ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు.

మంచి యాంగిల్ లో  ఫోటో వచ్చే అవకాశం కనిపించలేదు. వెంటనే పక్క బోగీ లోకి వెళ్ళాడు. అదే సమయంలో ఉగ్ర వాదులు నడుచుకుంటూ వస్తున్నారు. రెండు ఫ్రేమ్‌లలో ఆ ఇద్దరిని కెమెరాలో బంధించారు. అదే AK47 పట్టుకుని ఉన్న కసబ్  క్లోజ్-అప్ ఛాయాచిత్రం. ఆ ఒక్క ఫొటోనే ఇప్పటికి సర్క్యులేషన్ లో ఉంది.

అతని సాహసాన్ని కొనియాడుతూ స్వదేశీ,విదేశీ మీడియా డిసౌజాను ప్రశంసల్లో ముంచెత్తాయి.డిసౌజా సాహసాన్ని మెచ్చుకుంటూ నాటి సుప్రీం న్యాయ మూర్తులు ఆయనను సన్మానించారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ డిసౌజాకు ఒక ఇల్లు మంజూరు చేశారు. కానీ అది వివాదంలో ఉండటంతో డిసౌజా అద్దె ఇంట్లోనే కొనసాగారు. అంతకు మించి డిసౌజా కు ప్రభుత్వపరంగా ఏమీ లభించలేదు. 

2009 లో ఆ చిత్రానికిగాను వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డును డిసౌజా పొందాడు. ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఫోటో జర్నలిస్ట్ డిసౌజా కావడం  విశేషం. ముంబై మిర్రర్‌ నుంచి 2011 లో రిటైర్ అయ్యారు. మూడేళ్ళ పొడిగింపు ఆఫర్ ఇచ్చినప్పటికీ డిసౌజా అంగీకరించలేదు. 

——KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!