ఆ పాత కాలపు పురుషోత్తముడిని తలచుకుందామా ?

Sharing is Caring...

Taadi Prakash…………

THE MAN OF THE MASSES

ఏం మనిషో ఏంటో? బొత్తిగా ఇంగితం లేకపోతే ఎలా?, ఎవడో బావుండాలని నువ్వు.. తాపత్రయం పడడం ఏమిటి? చాదస్తం కాకపోతే! భార్య వుంది, బిడ్డలున్నారు. సంపాదించే తెలివుంది. ఒంట్లో వోపికుంది. కోట్లో లక్షలో కూడబెట్టి దర్జాగా బతకడం పోయి, పేదవాళ్ళంతా తిండి తినాలి, చదువుకోవాలి, పైకి రావాలని ఆ గావుకేకలేంటో?

మతిగాని భ్రమించలేదుకదా! షేర్లూ కొనవు, భూములూ కొనవు! బ్యాంకు బేలన్సూ సున్నా. సొంత ఇల్లు కట్టుకోవాలన్న ధ్యాసే వుండదా? మరీ విడ్డూరం కాకపొతే, ప్రజలందరికీ మేలు జరగాలంటాడేంటో? ఒక్క పూటకి ఠికానా లేని దిక్కుమాలిన జనం హక్కులు, ఉద్యమం అంటూ సొంత ఆస్తులు అమ్ముకుంటారా ఎవరైనా! మరీ చోద్యం కాకపోతే! దీన్నే వెర్రితనం ప్లస్ అజ్ఞానం అంటారు. ఒకవేళ చండ్ర రాజేశ్వరరావు గనక …ఇపుడు వుంటే అలాగే అంటారు!
*** *** ***
రాజేశ్వరరావు నాకు 1972 నుంచీ తెలుసు. ఆర్టిస్ట్ మోహన్ కోసం 72 నుంచి 77 జూన్ దాకా రోజూ విజయవాడ విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసుకి వెళ్ళేవాణ్ణి. నేను ఆయనకి తెలీకపోవచ్చు, నాకు మాత్రం చండ్ర చాలా బాగా తెలుసు. ఆయన ప్రసంగాలు విన్నాను.

1978 ఆగస్టు 14న విశాలాంధ్ర ఆఫీసులోనే మోహన్ పెళ్లయింది. రాజేశ్వరరావే చీఫ్ గెస్ట్. మానాన్న తాడి అప్పలస్వామి, మా వదిన కమల నాన్న గారు అన్నే వెంకట్రామయ్య ఆయనకి బాగా తెలిసినవాళ్లు. కమ్యూనిస్ట్ ఉద్యమ సహచరులు.

1974లో సోవియట్ యూనియన్ నాయకత్వం ప్రతిష్టాత్మకమైన ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ అవార్డుని సీఆర్ కి యిచ్చింది. మాస్కో, ఢిల్లీ మీదుగా ఆయన హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ వస్తున్నారు. అప్పటికి మాంచి వూపు మీదున్న విజయవాడ సిపిఐ, రెడ్ షర్ట్ వలంటీర్లతో పెద్ద వూరేగింపు తీసింది. అందులో నేనూ వున్నా. బస్టాండ్ కి వెళ్లాం. బస్సులో ముందు సీట్లో నే సీఆర్ వున్నారు.

వందలమంది రెడ్ సెల్యూట్, జిందాబాద్ అని నినాదాలు హోరెత్తించడంతో బస్సులో జనం కంగారుపడ్డారు. “ఆపండయ్యా” అంటూ బస్సులోంచి దిగిన సీఆర్, “నా వూళ్ళో నాకేంటయ్యా యిదంతా” అన్నారు. అప్పుడు ఆయన పక్కనే వున్నాను. పేరుకే పెద్ద పర్సనాలిటీ. చెయ్యెత్తు మనిషి. ఒకచేత్తో కొడితే పదిమంది పడిపోవాల్సిందే. 

అలాంటి వేషాలేమీ లేని నాయకుడు. సాదాసీదా… మాటలూ అంతే. భేషజం అనేది ఆయనకి తెలియనిది. ఆరోజు సాయంకాలం హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన పెద్ద అభినందన సభలో ఎంతో ఆవేశంతో మాట్లాడారాయన. చలసాని వెంకటరత్నం హత్య తర్వాత కృష్ణలంక కట్ట మీద జరిగిన సిపిఐ బలప్రదర్శన లాంటి మీటింగ్ లోను సీఆర్ వూగిపోతూ మాట్లాడారు. కర్రలతో వచ్చిన సిపిఐ కార్యకర్తలు వందలమంది ఏం అఘాయిత్యం చేస్తారోనని నేను భయపడ్డాను.
*** *** ***
ఢిల్లీలో అజయ్ భవన్ సిపిఐ కేంద్ర కార్యాలయం. అక్కడ మార్క్సిస్టు అధ్యయన తరగతులు జరిగేవి. వాటికి వెళ్లిన మోహన్ సీఆర్ గురించి అనేకసార్లు చెప్పాడు. మటనూ, చికెనూ ఏం కావాలన్నా అక్కడ కేంటీన్ లో వుంటుంది. ఆరు చపాతీలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ చెక్కతోనే ఆయన లంచ్ చేసేవాడు. మహా అయితే మరో రెండు అరటి పళ్ళు.

ఇండియాలో ఏచోటికి వెళ్ళినా ఆయన అలాగే బతికాడు. ఢిల్లీ ఎండలు మండిపోతున్నపుడు కూలర్ వాడడం కానీ, చలి గడగడలాడిస్తున్నపుడు హీటర్ వేసుకోడం గానీ సీఆర్ ఎప్పుడూ చేయలేదని నీలం రాజశేఖరరెడ్డి ఒక వ్యాసంలో రాశారు.

ఆయన పెద్ద నాయకునిగా ఒక వెలుగు వెలుగుతున్నపుడు కేరళలో అచ్యుతమీనన్ ముఖ్యమంత్రి. జగన్నాథ్ సర్కార్ నాయకత్వంలోని బీహార్ సిపిఐకి 24 మంది ఎమ్మెల్లే లు వుండేవారు. ఆంధ్రా పార్టీ ఎప్పట్లాగే ఎగిరెగిరిపడుతూ వుండేది. రష్యా, క్యూబా, మంగోలియా, రుమేనియా… ఏ దేశం వెళ్లొచ్చినా సీఆర్ నిరాడంబరంగానే వుండేవారు. పేద ప్రజలు, వాళ్ల సుఖం తప్ప తనకేమీ పట్టేదికాదు.
*** *** ***
సీఆర్ గొప్ప వుపన్యాసకుడూ కాదు. సిద్ధాంతవేత్తా కాదు. పుస్తకాలు మాత్రం తెగ చదివేవారు. 70వ దశకంలోనే, ‘ది సన్ ఫ్లవర్’ అనే రష్యా సినిమా మీద ఆయన రాసిన రెవ్యూ చదివి ఆశ్చర్యపోయాను. మరో గొప్ప రష్యన్ చిత్రం “క్రేన్స్ ఆర్ ఫ్లయింగ్” మీదకూడా ఆయన సమీక్ష రాసినట్టు గుర్తు. అలెగ్జాండర్ సోల్జినిత్సిన్ రాసిన రెండు పుస్తకాల మీద (Cancer Ward, Gulag Archipelago) చండ్ర విమర్శ రాశారు.
*** *** ***
గోల్వాల్కర్ కి క్లీన్ షేవ్!
చండ్ర రాజేశ్వరరావు బెనారస్ హిందూ యూనివర్సిటీ లో చదువుతున్నపుడు వామపక్ష విద్యార్థులూ, ఆర్ఎస్ఎస్ ఆలోచన గలవాళ్ళూ తరచూ వాదించుకుంటూ వుండేవాళ్ళు. అప్పుడు వాళ్ల కెమిస్ట్రీ లెక్చరర్ సాక్షాత్తూ గురు గోల్వాల్కర్! Bunch of thoughts రాసిన పెద్ద మనిషి.

రెండో ప్రపంచ యుద్ధం నడుస్తున్న ఆ ఉద్రిక్త సమయంలో హిట్లరా? స్టాలినా? గెలుపెవరిది? అనేది బిలియన్ డాలర్ ప్రశ్న.హిట్లరే గెలుస్తాడని ఒకరోజు గోల్వాల్కర్ అన్నారు. లేదు, స్టాలినే గెలుస్తాడని సీఆర్ ఛాలెంజ్ విసిరారు. మర్నాడు హిట్లర్ మీసాల్లాగా తన మీసాలు కట్ చేసుకుని గోల్వాల్కర్ క్లాసుకి వచ్చారు.
కళ్ళు ఎగరేసి, ఎలా వుంది? అంటూ ఆయన సీఆర్ వర్గాన్ని రెచ్చగొట్టారు.

సీఆర్ వేగంగా ముందుకి దూసుకెళ్లి, ఇద్దరు గోల్వాల్కర్ ని పట్టుకోగా, రేజర్ తో ఆయన మీసాలు గొరిగేశారు. బెనారస్ లో అదో సంచలనం అపుడు. 1981 – 82లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల సభలో ప్రసంగిస్తూ, కమ్యూనిస్ట్ మేధావి మొహిత్ సేన్ ఈ అరుదైన విషయం చెప్పారు. మొహిత్ సేన్ చెప్పగా విన్నానని రచయిత, విమర్శకుడు, మిత్రుడు మందలపర్తి కిషోర్ చాలకాలం క్రితం నాకీ సంగతి చెప్పారు. ఇది ఎక్కడన్నా రికార్డు అయిందో, లేదో తెలీదు.
*** *** ***
సీఆర్ గురించి ప్రముఖులు రాసిన పుస్తకం ఒకటి తిరగేస్తుంటే, 1994 ఏప్రిల్ 10న అచ్చయిన ఆంధ్రభూమి దినపత్రికలో నేను రాసిన సంపాదకీయం కంటబడింది … ఒక పాతకాలపు పురుషోత్తముణ్ణి తల్చుకుందాం…
ఇదీ సంపాదకీయం… చదవొచ్చేమో…

ప్రజల మనిషి చండ్ర….. మట్టిని ప్రేమించిన మనిషి, మట్టిని నమ్ముకున్న మనుషుల కోసం ఉద్యమం నిర్మించిన మనిషి. అన్నంలా అరమరికలు లేనివాడు, నీళ్ళలా నిరాడంబరుడు చండ్ర రాజేశ్వరరావు. స్టాలిన్ తో కరచాలనం చేసినవాడు. భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రభాగాన నిలిచి ముందుకు నడిపించినవాడు. అరవయ్యేళ్ళ అవిశ్రాంత పోరాట జీవితం యిచ్చిన అలసటతో శనివారం తెలతెలవారుతుండగా శాశ్వతంగా కన్నుమూశారు.

ఆయన నిష్క్రమణతో నిజాయితీని ఆయుధంగా, త్యాగనిరతిని కీర్తికిరీటంగా ధరించిన పాతతరం నాయకుణ్ణి దేశం కోల్పోయింది. చండ్ర రాజేశ్వరరావు గంభీరమైన మనిషి. క్రమశిక్షణాయుతమైన కమ్యూనిస్టు కార్యకర్త. అలుపెరగని ఆర్గనైజర్. జనశ్రేణుల్లో ఉద్రేకం ఉరకలెత్తించి, ఉద్యమబాటలోకి నడిపించిన నాయకుడు. నిష్కపటి, ముక్కుసూటి మనిషి.

కార్యకర్తలతో అయినా, కొమ్ములు తిరిగిన నాయకులతో అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం చండ్ర తరహా. “అవును, మేం తప్పులు చేశాం” అని బహిరంగ వేదికలపై ఒప్పుకోగల నిప్పులాంటి నిజాయితీ. ఆయన పార్టీకి రాసిన చివరి లేఖలో “నేను ఎవరి దగ్గరా ఏమీ తీసుకోలేదు.

నేను ఎవరికీ ఏమీ ఇవ్వనవసరం లేదు” అని రాశారు. అలా చెప్పగల ధైర్యం ఎంతమందికుంటుంది? బతుకు చివరికంటా అగ్ని సరస్సును వికసించిన వజ్రంలా భాసించగల వారెందరుంటారు? అది సుసాధ్యం చేసుకున్న అతి కొద్దిమందిలో అగ్రగణ్యుడు చండ్ర రాజేశ్వరరావు.

నిజాం నవాబు వెన్నులో వణుకు పుట్టించిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళలో రాజేశ్వరరావు ముఖ్యుడు. ఉద్యమం ఆయన ముద్దుబిడ్డ…. తిరుగుబాటు ఆయన శ్వాస. పట్టుదల, లక్ష్యశుద్ధి ఆయనకు మారుపేర్లు. సిద్దాంతకర్త పోజు పెట్టడానికి ఎన్నడూ ఆయన ప్రయత్నించలేదు. రాజేశ్వరరావు రణన్నినాదానికి పులకించి వందల, వేల జనం వెన్నంటి నడిచారు.

తెలంగాణా పేద పల్లెలు ఆయన్ని అక్కున చేర్చుకున్నాయి. తెలంగాణా జొన్నచేలు ఆయన్ని కడుపులో దాచి కాపాడుకున్నాయి. ఆ చరిత్రాత్మక పోరాటంలో సాధారణ సైనికునిగా, వీరసేనానిగా, శౌర్యానికి ప్రతీకగా భాసిల్లిన యోధుడు చండ్ర రాజేశ్వరరావు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న పరీక్షా సమయంలో సమైక్యతా సమరశంఖం పూరించి కమ్యూనిస్టుల్ని ఒక్క తాటిపై నడిపి, ఉద్యమాన్ని ఉక్కు పిడికిలిగా మలిచి ప్రత్యర్థిని బెంబేలెత్తించిన వీరుడు రాజేశ్వరరావే.

అనేకచోట్ల గ్రామీణ పేదల్ని ఉద్యుక్తుల్ని చేసి వేల ఎకరాల బంజరు భూముల ఆక్రమణకు సారథ్యం వహించినవాడూ ఆయనే. వ్యవసాయ కూలీల కోర్కెల సాధన కోసం, సాంఘిక న్యాయం కోసం, చిరుగుబట్టల జనం విముక్తి కోసం అనుక్షణం తపించినవాడు. ఆలోచనలను ఆచరణలోకి ఉజ్వలంగా అనువదించినవాడు. కులాన్నీ, డబ్బునీ, విలాసాల్నీ అసహ్యించుకున్నవాడు.

కీర్తిని కాలదన్నినవాడు చండ్ర. ఆయన సాధారణ పార్టీ కార్యకర్తల్లో కార్యకర్త. శక్తిమంతులైన నాయకుల్లో నాయకుడు. ఇప్పటి అనేకమంది నాయకుల్ని ఆనాడు ఉత్తేజితుల్ని చేసి, ప్రజోద్యమ అరుణవాహినిలోకి తెచ్చినవాడు. వాళ్ళలో కొండపల్లి సీతారామయ్య ఒకరు. రాజేశ్వరరావుకి రెండు మాటల అర్ధాలు తెలీనే తెలియవు. అవి: గర్వం, భయం.

అరవయ్యో జన్మదినాన సోవియట్ అత్యున్నత పురస్కారం, ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ అవార్డు అందుకున్నప్పుడూ ఆ చిరునవ్వులో గర్వరేఖ లేదు. నిజాం వేటకుక్కల మృత్యు పంజరంలో సంచరిస్తున్న భయోద్విగ్న వేళలోనూ ఆయనకు భయంలేదు. భూస్వాముల గుండెల్లో విశ్రాంతి తీసుకోవడం ఆయనకి సరదా. పెట్టుబడిదార్ల పక్కలో బల్లెంలా వుండటం ఆయనకి ముచ్చట.

చిట్టచివరి నిరుపేద ఆకలి తీర్చేంత వరకూ నిద్రపోకూడదని ఆయన పట్టుదల.అంత మహా నాయకుని జీవిత చరమాంకంలో మాత్రం నిరాశల నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాణాధికంగా ప్రేమించిన సోవియట్ సోషలిస్టు వ్యవస్థ పతనం ఆయన్ని కుంగదీసింది. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ వేదికపై గజ్జెకట్టి గంతులు వేయడం బాధించింది.

ఏ మహోన్నత ఆదర్శం కోసం సకల సుఖాల్నీ త్యజించి పోరుబాటలో నడిచారో, ఆ ఆదర్శం చూస్తూ చూస్తుండగానే ఆవిరైపోతున్న దృశ్యం… ఏ సామ్యవాద సమాజం కోసం పసిడికలలు కన్నారో, ఆ కలలన్నీ కళ్ళముందే వేగంగా పీడకలలుగా మారిపోతున్న వికృత దృశ్యం… ఏ వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతా పతాకం రెపరెపలాడాలని కాంక్షించారో ఆ భారతావనిలో రాముడి పేరిట మతశక్తుల విజృంభణ ఇవన్నీ చండ్రను కుదిపివేశాయి. చివరిరోజుల్లో ఆ వృద్ధమూర్తికి శాంతి లేకుండా చేశాయి.

కమ్యూనిజం అనేది ఫలించని సుదూర సుందర స్వప్నంగా, కమ్యూనిస్టుల ఐక్యత ఆచరణలోకి రాని ఒట్టి ఆలోచనగా, నినాదంగా మిగిలిపోవడం చండ్ర హృదయాన్ని కలిచివేశాయి. ఏమైనా దశాబ్దాల పాటు జ్వాజ్వల్యమానంగా వెలిగిన ఒక అరుణారుణ ఆదర్శానికి ఆయన ప్రతీక.

“ఒక వీరుడు మరణిస్తే…” లాంటి పాత మాటలు చండ్రకు వర్తించవు. రాజేశ్వరరావు లాంటి విశిష్టమైన వ్యక్తిత్వం గల అరుదైన నాయకులు దొరకడం ఆషామాషీ కాదు. ఆయన్నిగన్న భారతమాత ధన్యురాలు. పీడిత జనాళి విముక్తే తన విలాసంగా భావించి, నిండు జీవితాన్ని జాతిజనుల కోసం అంకితం చేసిన చండ్ర రాజేశ్వరరావు ధన్యజీవి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!