Red star movie …………………………..
కమర్షియల్ సినిమాలు కాసులవర్షం కురిపిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ టైం లో విడుదలై సంచలనం సష్టించింది ఈ ‘ఎర్రమల్లెలు’ సినిమా. తెలుగునాట విప్లవ చిత్రాలకి బీజాలు వేసిన సినిమా ఇది. ‘యువతరం కదిలింది’ విజయంతో నటుడు మాదాల రంగారావు నిర్మించిన రెండో సినిమా ఇది. 1981 లోవిడుదలైన ఈ ఎర్రమల్లెలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
వ్యవస్ధలలో లోపాలపై సూటిగా ధ్వజమెత్తిన సినిమా ఇది. పెత్తందార్లు… అణగారిన వర్గాలను ఎంత దారుణంగా దోచుకుంటారో సినిమా చూపిస్తుంది. ఊళ్ళోని చదువురాని జనాన్ని ముగ్గురు పెద్దమనుష్యులు పావులు చేసి ఆడుకుంటున్న నేపథ్యంలో ఆ ఊళ్ళో చదువు చెప్పడానికి ఓ మాస్టారు వస్తారు.
ఆయన వల్ల జనంలో చైతన్యం వచ్చి ,ఆ ముగ్గురు దుష్టులకు అండగా ఉండే పక్క ఊరి ఫ్యాక్టరీ ఓనర్ కూడా ప్రజా విప్లవ జ్వాలల్లో భగ్గుమనడం ఈ చిత్రకథ.ఏకకాలంలో అటు గ్రామీణ సమస్యల్ని, ఇటు కార్మిక సమస్యల్ని కథగా మలచుకుని తెరకెక్కించారు.. జనాలకు బాగా నచ్చింది.
హాస్యనటునిగా పేరుతెచ్చుకున్న సుత్తి వీరభద్రరావు నటించిన మొదటి సినిమా ఇది. ఇదే జర్మనీలో అయితే… అమెరికాలో అయితే అంటూ వీరభద్రరావు చెప్పిన డైలాగ్స్‌జనాలను ఆకట్టుకున్నాయి. తనదైన నటనతో పాత్రకు వీరభద్రరావు న్యాయం చేశారు.
వర్ధమాన హీరో గోపీచంద్ తండ్రి విప్లవచిత్రాల డైరెక్టర్ టి.కృష్ణ ఈ సినిమాలో మొదటి సారి చిన్న పాత్రలో నటించారు. గిరిబాబు ప్రాధాన్యత కలిగిన విలన్ పాత్ర ను పోషించారు. గెటప్ బాగుంటుంది.
‘పేపర్ కామయ్య’గా పి.ఎల్.నారాయణ డైలాగులు బాగా ఆకట్టుకుంటాయి. దాదాపు గా సినిమా అంతా ఈ పాత్ర కనబడుతుంది. ఊళ్లోని ముగ్గురు పెత్తందారులుగా సాక్షి రంగారావు, చలపతి రావు, నర్రా వెంకటేశ్వరరావు లు నటించారు. సాక్షి రంగారావు పాత్ర బాగా ఎలివేట్ అయింది.
ఎంజి రామారావు పదునైన సంభాషణలు అందించారు.’కడుపు కాలితే కాని కార్మికులు మాట వినరు’. ‘మనమే ప్రభుత్వం .. మనదే ప్రభుత్వం’ .. ‘భయం భయం అనుకుంటే మనుష్యులమే కాదు’ ‘నేలతో పాటు తల్లిని కూడా చీల్చేయండి బాబు’ వంటి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇక సినిమాలో పాటలు కూడా బాగుంటాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి అన్ని పాటలకు జనరంజకమైన ట్యూన్స్ ఇచ్చారు. నేడే… మేడే… అంటూ సాగే పాట చిత్రీకరణ బాగుంటుంది. ఈ పాటలో మాదాల ఎంట్రన్స్ సీన్ బాగుంటుంది. మురళీ మోహన్ కథలో హీరో.
‘‘నాంపల్లి టేసను కాడి రాజాలింగో… రాజాలింగా’’ ప్రజానాట్యమండలి ద్వారా పాపులర్ అయిన ఈ పాటను సినిమాలో శైలజ పాడారు. రాచపల్లి ప్రభు అనే కళాకారుడు రాసిన పాట ఇది. శైలజ కెరీర్ కు ఈ పాట పెద్ద బ్రేక్ ఇచ్చింది.ఈ పాటలో మాదాల కుమారుడు మాదాల రవి నటించారు.
‘ఓ లగిజిగి లంబాడీ’ పాట ను అద్భుతంగా మాదాల పై చిత్రీకరించారు. బంగారు మా తల్లీ.. పాట కూడా బాగుంటుంది.ధవళ సత్యం సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా కథను వేగంగా నడిపించారు. సన్నివేశాల అల్లిక కూడా బాగుంటుంది.
అన్నదమ్ములుగా సాయిచంద్, రంగనాథ్ లు చక్కగా నటించారు. కొంతమంది ఒంగోలు కళాకారులు ముఖ్యంగా అన్న నల్లూరి టీచర్ పాత్రకు కరెక్టుగా సూట్ అయ్యారు.. ఒంగోలు పరిసర గ్రామాల్లో సినిమా షూటింగ్ జరిగింది.ఈ చిత్రాన్నితమిళంలోకి ‘సివప్పు మల్లి’ గా రీమేక్ చేశారు .. సంసారపక్ష సినిమాలు తీసే ఏ.వి.ఎం. సంస్థ దీన్ని నిర్మించడం విశేషం.. ఎర్రమల్లెలు’ సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు.. చూడవచ్చు.