ఇలాంటి అధికారులే దేశానికి కావాల్సింది !

Sharing is Caring...

MNR  …………………………  

వైజాగ్ సిటీకి ఎందరో ఐ.ఏ.ఎస్.లు వస్తుంటారు. పోతుంటారు. కానీ చరిత్రలో కొందరే నిలిచిపోతారు. అలాంటి కోవకే చెందిన సిన్సియర్ ఆఫీసర్ సృజనా గుమ్మల్ల ఐ.ఏ.ఎస్. పొత్తిళ్ళలో పసిబిడ్డను పెట్టుకుని కరోనా సమయంలోనూ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉన్నతాధికారిణిగా దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగం పట్ల అంకిత భావం.. ముక్కుసూటి తనం… లంచగొండుల పాలిట అపరకాళికగా వ్యవహరించే సృజన కొద్దీ రోజుల్లోనే సమర్ధురాలిగా ప్రజల మెప్పు పొందారు. విశాఖ నగర కమీషనర్ గా సమర్ధవంతగా విధులు నిర్వహించారు. ఇటీవలే ఆమె బదిలీ అయి వేరే చోటకు వెళ్లారు. ఈ సందర్భంగా సృజనా గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపించింది.నా కళ్లతో చూసిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకోవాలనిపిస్తోంది.

@  ఎవరో సివిల్ కాంట్రాక్టర్ అనుకుంటా… ఓ రోజు జి.వి.ఎం.సి. ఆఫీసు ఆవరణ పార్కింగ్ లో గట్టిగా అంటున్నాడు. ఈవిడెవరండీ బాబు. ఆవిడ తినదు. ఎవరినీ తిననివ్వదు. ఇలా అయితే ఎలా ? కొన్ని విషయాల్లో చూసీ చూడనట్లు వెళ్లకపోతే ఎలా ? మరీ ఇంత సిన్సియారిటీ పనికిరాదు అంటూ తన ఆవేదనని, ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు.
@ గాజువాక ప్రాంతంలో కాస్త దురుసైన నాయకుడిగా పేరొందిన ఓ నేత మరో నేతతో అన్న మాటలు…. ఒరేయ్ ఈవిడ దగ్గర రికమండేషన్లు వర్కౌట్ కావురా. నీకు పని కావాలంటే అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే అవ్వదు. లొసుగులు ఉంటే ఆవిడకి ఎవరు చెప్పినా వినదు. నీ ప్రయత్నాలు మానుకో. నువ్వు ఎంతటి హై రేంజ్ నాయకుడితో ఫోన్ చేయించినా ఆమె వినదు. ఎందుకు వృధా ప్రయత్నం.
@  జి.వి.ఎం.సి.లో చాలా కాలంగా పని చేస్తోన్న ఓ సీనియర్ ఉద్యోగి ఒకానొక సందర్భంలో పలికిన పలుకులు….. ఈవిడ రాకముందు ఎప్పుడొచ్చినా, ఎప్పుడు వెళ్లినా ఎవరూ అడిగేవారు కాదు బాసూ…. ఈవిడొచ్చాక మా పప్పులు ఉడకడం లేదు. ఎప్పుడు ఏ ఫైల్ తెమ్మంటుందో… ఏ టైంలో ఏ రివ్యూ అంటుందో తెలీదు. చూశారు కదా పసికందును పట్టుకుని ఆఫీసుకు వచ్చేస్తుంటే… ఇక మేం ఏం ముఖం పెట్టుకుని సెలవులు పెట్టగలం.

పైన ప్రస్థావించినవి వేరే వారి అభిప్రాయాలు. ఇక నా వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకోవాలి. గత ఏడాది మా ఇంటికి మునిసిపల్ కుళాయి నీరు సుమారు రెండు నెలలు రాలేదు. వారం రోజుల వరకు సమస్యేంటో అర్ధం కాలేదు. ఆ తర్వాత మా ఇంటి యజమానితో కంప్లైంట్ చేయించాం. వాలంటీర్లని, సెక్రటేరియట్ అని, ఆ ఇంజనీర్ అని ఈ ఇంజినీరని ఇలా రెండు నెలలు గడిచినా సమస్య తీర్లేదు. చివరకి సోషల్ మీడియాలో ప్రతి వారం నిర్వహించే డయల్ యువర్ కమీషనర్ యూట్యూబ్ కార్యక్రమంలో సామాన్య పౌరుడిగా ఓ మెసేజ్ పెట్టాను. అంతే రెండో రోజుకి మా ఇంటికి కుళాయి నీరు మునుపటికంటే మెరుగ్గా వచ్చాయి.
ఇక కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో  గ్రేటర్  విశాఖకు ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆఫీసర్ గా సృజన కష్టం ఒక ఎత్తయితే .. ఆమె వ్యక్తిగత జీవితం మరో ఎత్తు. అప్పట్లోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ తర్వాత శరీరం తిరిగి ఆధీనంలోకి రావడానికి సమయం పడుతుంది. బిడ్డ ఆలన పాలన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు ఉంటాయి. కానీ సృజన మాత్రం కష్ట సమయంలో ప్రజలకు తన సేవలు అవసరమని గట్టిగా నమ్మారు. సెలవులు కుదించుకోమని ప్రభుత్వం కోరకపోయినా ఆమె వెంటనే డ్యూటీలో చేరారు.

గత ఏడాది మార్చి ఐదున సృజనకు ప్రసవం కాగా సెలవులు ఉన్నప్పటికీ పదిరోజుల ముందుగానే విధులకు హాజరయ్యారు. కోవిడ్ నియంత్రణ పనుల్లో దూసుకుపోయారు. అత్యంత కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలను తీరుస్తూనే రెడ్ జోన్ ఏరియాల్లో  పరిస్థితులను ఎప్పటికప్పుడు  సమీక్షించుకుంటూ ..క్షేత్రస్థాయి సిబ్బందిని ముందుండి నడిపించారు. గత 11 నెలల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆమె పనిచేసారు. ఆలా ఆమె శ్రమించారు కాబట్టే ప్రజలు ఈనాడు నిర్భయంగా తిరుగుతున్నారు. హ్యాట్సాఫ్ సృజన మేడం !

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!