ఒక మంత్రి 10 రోజుల తిండి ఖర్చు 4 లక్షలా ?

Sharing is Caring...

వారంతా వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుచేశారు. అలా చేసినవారు మామూలు వ్యక్తులు కాదు. ప్రజాప్రతినిధులు. పోనీ అదంతా వారి సొంత సొమ్మా ? అంటే కానే కాదు. ప్రజలసొమ్ము.  మాములుగా అయితే ఒక మనిషికి  ఒక పూట భోజనం ఖర్చు ఎంత అవుతుంది? పాతిక రూపాయలతో మొదలు పెడితే భోజనం చేసే హోటల్ ను బట్టి, తినే పరిమాణాన్ని బట్టి.. ఖర్చు ఉంటుందనే అనుకోవచ్చు.ఎంత ఖరీదైన స్టార్ హోటల్ లో తిన్నా, ఎలాంటి ఆహారాన్ని తిన్నా.. ఒక మనిషి ఒక పూట భోజనం ఖర్చు వందల రూపాయల్లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అందులో సందేహమే లేదు. 

అయితే కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొన్ని వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుపెట్టి రికార్డుల్లో కెక్కారు .  ఆర్టీఐ కింద ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే  సమాధానాలు వచ్చాయి. ఆర్టీఐ ద్వారా వెలుగు చూసిన ఈ వ్యవహారం విస్మయాన్ని కలిగించక మానదు. ఒక పూట భోజనానికి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు నాలుగైదు వేల రూపాయల బిల్లులు పెట్టారంటే.. ఎవడబ్బ సొమ్మని? అని  ఆవేశంలో ప్రశ్నిస్తాం. అది కామన్.  2018లో  అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బెళగావిలో నిర్వహించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరులో విధానసౌధ ఉన్నా.. బెళగావిలో శీతాకాల సమావేశాలు నిర్వహించారు. 

మరి సమావేశాల నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టారు, దేనికెంత? అనే అంశంపై ఓ కార్యకర్త ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరగా ఈ దిమ్మెరబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.  బెళగావిలో శాసనసభ సమావేశాల నిర్వహణకు మొత్తం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేవలం పది రోజుల వ్యవధికి 7 కోట్ల  మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఆ పది రోజుల వ్యవధిలో కూడా కేవలం 55 గంటల పాటే సభ నడిచింది.

శాసన సభ సమావేశాల  కోసం బెళగావి వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం ఫైవ్ స్టార్ హోటళ్లలోప్రభుత్వం  గదులు బుక్ చేసింది.ఈ హోటల్ ఖర్చుల  కోసమే అధికారులు అర కోటి రూపాయలు చెల్లించారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన  విషయం ఏమిటంటే.. పది రోజుల పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల భోజనం ఖర్చు ప్రభుత్వమే భరించగా, దాని కోసం అతి భారీ మొత్తాన్ని వెచ్చించారు. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో పూట భోజనానికి సగటున నాలుగు వేల రూపాయల వరకూ బిల్లులు పెట్టారని సమాచారం.  తమ వ్యక్తిగత భోజనానికే వారు ఈ స్థాయి మొత్తాన్ని బిల్లుగా చూపించారు.

అత్యధికంగా అప్పటి మంత్రి టీబీ జయచంద్ర పది రోజుల పాటు భోజనానికి నాలుగు లక్షల రూపాయల బిల్లును సబ్మిట్ చేసి వసూలు  చేసుకున్నాడట.అంటే  రోజుకు నలభై వేల రూపాయలు. నాలుగు పూటలా భోంచేశారనుకున్నా.. పూటకు పదివేల రూపాయలు. ఇది భోజనం బిల్లు మాత్రమే. కేవలం ఈ మంత్రే కాదు.. అంతా భారీ స్థాయిలోనే భోంచేశారు. జేడీఎస్ నేత కుమారసామి ఒక్కో పూట భోజనానికి మూడు వేల రూపాయల పై మొత్తాన్నే చూపించాడట. ఇలా అందరి భోజనాల బిల్లులు, హోటల్ బిల్లులు, వీరి భద్రతకు, వీరి సిబ్బందికి వెచ్చించిన మొత్తం ఏడు కోట్ల రూపాయల పైనే అని ఆర్టీఐ ద్వారా సమాచారం వెలుగులోకి వచ్చింది.

ప్రజాప్రతినిధులే మరీ ఇంత  ఘోరంగా వ్యవహరించారంటే  ఏమనుకోవాలి ? సమావేశాలకు వచ్చారు కాబట్టి  భోజనం చేయవచ్చు . అందులో తప్పులేదు.కానీ అంతేసి సొమ్ము ఖర్చు చేయడం భావ్యమా ? అదే సొంత సొమ్ము అయితే  ఆ స్థాయిలో ఖర్చు పెడతారా ? ఉహూ .. పొరపాటున కూడా సొంత సొమ్ము బయటకు తీయరు.

ఇది కేవలం కర్ణాటక కె పరిమితం కాలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.అడిగే వారు లేరు కదా అని ఎంతైనా సొమ్ము ఖర్చు పెట్టె నేతలు ఉన్నంతవరకు  పరిస్థితుల్లో మార్పులేమీ ఉండవు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఆర్టీఐ ద్వారా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. అపుడే నేతలు ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టడానికి వెనుకడుగేస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!