ఆ కమీషనర్ కు 7 రోజుల జైలు శిక్ష కు సిఫారసు!!

Sharing is Caring...

ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా  వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని  … ఆయనపై  చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.  గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులిద్దరూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.  కాగా అంతకు ముందు మంత్రులు లక్షణరేఖ దాటుతున్నారని ..  ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన విషయంపై  అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ కోరారు. ఈ విషయంలో తనకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని…అయితే చివరి ప్రయత్నంగా తమ దృష్టికి తెస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ రాశారు. నిమ్మగడ్డ ఇలా లేఖ రాయడం పై మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హక్కుల నోటీసులు ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది.

ఇకపై ఏమి జరుగుతుందనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. సభ్యుల హక్కులకు భంగం కలిగిందని స్పీకర్ భావిస్తే  ఎన్నికల కమీషనర్ వివరణ కోరవచ్చు. స్పీకర్ వివరణ అడిగితే కమీషనర్ సమాధానం ఇవ్వాలి. అయితే నిమ్మగడ్డ ఇస్తారా లేదా అనేది సందేహమే. నిమ్మగడ్డ ఒక వేళ  సమాధానం ఇస్తే దాన్ని  ప్రివిలేజ్ కమిటీ కి పంపుతారు. ఆ కమిటీ ఆ సమాధానంతో పాటు పూర్వాపరాలను పరిశీలిస్తుంది. కమీషనర్ వ్యాఖ్యలు ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించాయో లేదో నిర్ణయిస్తుంది. కమిటీ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. ఏ చర్యలు తీసుకోవాలో కూడా మెజారిటీ సభ్యులు నిర్ణయిస్తారు. కమిటీ సిఫారసులను సభలో ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం పొందుతారు. ఏదైనా స్పీకర్ విచక్షణాధికారం మేరకు జరుగుతుంది. ప్రస్తుతం శాసనసభ జరగడం లేదు కాబట్టి స్పీకర్ నిర్ణయం మేరకు ఏదైనా జరగవచ్చు. అయితే విషయం అంతవరకు వెళుతుందా అనేది కూడా సందేహమే.  ఎందుకు రచ్చ రభస అనుకుంటే స్పీకర్ సింపుల్ గా వదిలేయవచ్చు. ఆయన నిర్ణయం మేరకే జరుగుతుంది ఏదైనా.

ఇదిలా ఉంటే …  గతంలో స్టేట్ ఎన్నికల కమీషనర్ కు ఇలాగే హక్కుల నోటీసులు ఇచ్చినపుడు వారు కోర్టును ఆశ్రయించారు.  మహారాష్ట్ర స్టేట్ ఎన్నికల కమీషనర్ నందాలాల్ పై కూడా ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు. కమిటీ విచారణ జరిపింది. వ్యక్తిగతంగా కమీషనర్ ను హాజరు కమ్మంటే నందాలాల్ వెళ్ళలేదు. దీంతో కమిటీ 7 రోజుల జైలు శిక్ష కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే నందాలాల్ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా నందలాల్ తనను సంప్రదించకుండా  ప్రివిలేజ్ కమిటీ శిక్ష వేసిందని వాదించారు. అయితే పలుమార్లు పిలిచినట్టు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు చూపింది.  దీంతో కోర్టు శిక్ష విషయం ప్రస్తావించకుండా కేసు కొట్టేసింది. దరిమిలా  నందలాల్  సుప్రీం కెళ్ళి  మహారాష్ట్ర  పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసారని  వాదించారు . అయితే పోలీస్ కమీషనర్ అదేమీ లేదని ఖండించాడు. దీంతో అక్కడ కూడా కేసు కొట్టేశారు.  తమిళనాడు,పంజాబ్ రాష్ట్రాల్లో కూడా కమీషనర్లు కోర్టులను ఆశ్రయించి బయటపడ్డారు. ఇక ఏపీ కమీషనర్ కూడా తన సహజ ధోరణిలో ప్రివిలేజ్ కమిటీ ని లెక్కచేయకపోవచ్చు. ప్రివిలేజ్ కమిటీ నోటీసు అంటే ఇస్తే మటుకు నిమ్మగడ్డ కోర్టుకెళ్లడం ఖాయం.

  ————- KNMURTHY  WITH  NIRMAL AKKARAJU 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!