ఉక్రెయిన్‌పై ఐదో రోజూ కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్ సేనలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు 352 మంది మరణించారని అంచనా.ప్రజలు భయంతో బంకర్లలోనే ఉంటున్నారు.
మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది తరువాత మరో చోట జరపాలని కోరింది. అయినప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులకు నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలను తమ గగనతలంపై ఎగరకుండా చర్యలు తీసుకున్నాయి.
కాగా నాలుగో రోజు కీవ్ సరిహద్దుల్లో మోహరించిన రష్యా సైనికులు హోస్టోమెల్ విమానాశ్రయంపై బాంబులు విసిరారు. దీంతో అక్కడే ఉన్నఅతిపెద్ద విమానం ఏఎన్-225 ‘మ్రియా’ ధ్వంసమైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానం. ఈతరహా విమానం వేరే దేశంలో ఎక్కడా లేదు. విమానం ధ్వంసం అయిన విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ధ్వంసం అయిన విమానం పేరు మ్రియా అంటే ఉక్రెయిన్ భాషలో ‘కల’ అని అర్థం. అయితే దీన్ని మళ్లీ పునర్‌నిర్మిస్తామని ఉక్రెయిన్ అంటోంది. స్వేచ్ఛాయుత, బలమైన ప్రజాస్వామ్య ఐరోపా దేశంగా ఉక్రెయిన్‌ను ఏర్పాటు చేసుకుంటామని, తమ కలను సైతం నిజం చేసుకుంటామని ఉక్రెయిన్ చెబుతోంది. విమానాన్ని ధ్వంసం చేశారు కానీ, మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు అని ఉక్రెయిన్ అధికారిక ట్విటర్ ఖాతాలో రాసుకుంది.
ఈ విమానాన్ని ఉక్రెయిన్‌కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ఆంటొనోవ్ రూపొందించింది. ప్రస్తుతం ఏఎన్-225 పరిస్థితి ఎలావుందో ?ఏ మేరకు నష్టపోయిందో తెలియడం లేదు. కాగా ధ్వంసమైన ఈ విమానాన్ని బాగు చేయడానికి 3 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని .. ఐదేళ్ల కాలం పడుతుందని అంచనా. ఉక్రెయిన్ విమానయానాన్నీ దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని … రష్యన్ ఫెడరేషన్ ద్వారా ఈ ఖర్చులను రాబడతామని ఉక్రెయిన్ అంటోంది.
ఇక అమెరికా సారధ్యంలోని కొన్ని దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించాయి.రొమేనియా నుంచి 249 మంది భారతీయులతో బయలుదేరిన విమానం ఢిల్లీకి చేరుకుంది. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. దీంతో భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే కీవ్ నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సైన్యాన్ని ఆపడానికి గూగుల్ తన మ్యాప్స్‌లో ఉండే కొన్ని టూల్స్ ను డీయాక్టివేట్ చేసింది. రోడ్లపై ఉండే ట్రాఫిక్ గుర్తులు, వివిధ మార్గాలను సూచించే బోర్డులను స్థానిక సంస్థలు తొలగించాయి. దీనివలన రష్యన్ సైనికులు ఎటువెళ్లాలో అర్ధం కాక గందరగోళంలో పడతారని భావిస్తున్నారు.