బ్యాంకులకు టోపీ పెట్టిన బిగ్ బుల్ !!

Sharing is Caring...

Stock Market Scam 1992…………………….

భారత ఆర్ధిక చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా బ్యాంకులను మోసగించడానికి హర్షద్ మెహతా ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకున్నాడు. మార్కెట్ లో ఎప్పుడైతే అతని టిప్స్ క్లిక్ అయ్యాయో … జనం పోలో మంటూ అతని వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా హర్షద్  బిగ్ బుల్ గా మారిపోయాడు.

హర్షద్ గుజరాతీ జైన కుటుంబంలో పుట్టాడు. బొంబాయి లో పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ చేసాడు. తర్వాత న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ కార్యాలయంలో సేల్స్ మ్యాన్ గా తన కెరీర్ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత  షేర్ మార్కెట్ పై ఆసక్తిని పెంచుకుని  బ్రోకరేజ్ సంస్థ ను పెట్టాడు.  స్వల్ప వ్యవధిలోనే మార్కెట్లో దూసుకుపోయాడు.

1984 లో హర్షద్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో బ్రోకర్ గా సభ్యత్వం సంపాదించాడు. గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మానెజ్మెంట్ అనే సంస్థను స్థాపించాడు. బొంబాయి లోని ప్రముఖులంతా అందులో పెట్టుబడి పెట్టారు. మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా హర్షద్ సేవలను పొందాడని అంటారు.  ఏసీసీ షేర్ల ధర పెరుగుదల తర్వాత హర్షద్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది.   ఆ రోజుల్లో మీడియా హర్షద్ ను  ‘స్టాక్ మార్కెట్  అమితాబ్” గా  అభివర్ణించింది.

కాగా 90 వ దశకం లో దేశీయ బ్యాంకులకు నేరుగా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి లేదు. అయితే ప్రభుత్వ స్థిర వడ్డీ బాండ్లలో మదుపు చేయవచ్చు.  అయితే నేరుగా కాకుండా ఇతర బ్యాంకుల నుండి సెక్యూరిటీలు, ఫార్వర్డ్ బాండ్లను కొనడానికి ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళవలసి వచ్చేది. ఈ అవకాశాన్ని హర్షద్ తెలివిగా ఉపయోగించుకున్నాడు.

బ్యాంకుల తరపున బాండ్ల కొనుగోలుకు తన బ్యాంకు అకౌంట్ ను వాడేవాడు. డబ్బును తన అకౌంట్ లోకి బదిలీ చేయమని కోరే వాడు. మొదట్లో కొంత నమ్మించి సెక్యూరిటీ అమ్మకాలకు, కొనుగోళ్ళకు నకిలీ రసీదులు బ్యాంకులకు ఇచ్చేవాడు. కొంత కాలం జరిగేక హర్షద్ మోసం చేస్తున్నాడని బ్యాంకులు గుర్తించాయి.

అసలు తమ తరపున సెక్యూరిటీలు కొనుగోలు చేయలేదని /అమ్మలేదని నకిలీ రసీదులతో మోసం చేసాడని తెలుసుకున్నాయి.  అప్పటికే వేల కోట్ల మోసం జరిగిపోయింది. మరోవైపు తన ఖాతాలోకి వచ్చిన సొమ్ముతో షేర్లను భారీగా కొనుగోలు చేసి ఆపరేట్ చేసేవాడు. మార్కెట్లో కూడా కొన్ని షేర్ల ధరల విషయంలో ఏదో జరుగుతోందని స్టాక్ మార్కెట్ వర్గాలు నిఘా పెట్టాయి.

అసాధారణంగా పెరుగుతున్న షేర్లను ట్రేడింగ్ నుంచి సస్పెండ్ చేయడం, నిబంధనలు విధించడం జరిగాయి.  ఈ క్రమంలోనే హర్షద్ మోసాలు ప్రపంచానికి తెలిసిపోయాయి. ఒక్కసారిగా దుమారం చెలరేగింది. మార్కెట్లు క్రాష్ అయ్యాయి.పార్లమెంట్ లో ఈ కుంభకోణం గురించి చర్చలు కూడా జరిగేయి. చివరికి హర్షద్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఈ కుంభకోణం మూలంగా అప్పటి విజయ బ్యాంక్ చైర్మన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరెందరో బాధితులు అయ్యారు.  ఈ నేపథ్యంలో హర్షద్ పై 72 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో కొన్ని విచారించిన సుప్రీం కోర్టు దోషిగా తెలుస్తూ 5 ఏళ్ళ జైలుశిక్ష తో పాటు 25 వేలు జరిమానా విధించింది.

హర్షద్ ను థానే జైలుకి తరలించారు. 2001 డిసెంబర్ 31న ఛాతీలో నొప్పి అని చెప్పడంతో హర్షద్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ హర్షద్ కనుమూశాడు.ఇప్పటికీ హర్షద్ పై 25 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అది క్లుప్తంగా హర్షద్ జీవితం. 

దాన్ని ఆధారంగా చేసుకునే  స్కామ్ 1992 పేరిట వెబ్ సిరీస్ తీశారు. జర్నలిస్టులు దెబా షిష్ ,సుచేత దలాల్ ఈ సిరీస్ కి కథ అందించారు. దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత హన్సల్ మెహతా ఈ సిరీస్ ను రూపొందించారు. సోనీ లైవ్ లో ఉంది. కుంభకోణం జరిగిన దరిమిలా స్టాక్ మార్కెట్  గైడ్ లైన్స్  అన్నీ మారిపోయాయి. కొత్త నిబంధనలు వచ్చాయి. 

———  KNMURTHY 

PL.READ IT ALSO ………………………....మహా రాజశ్రీ మాయగాడు (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!