యూత్ కి నచ్చే సినిమా !!

Sharing is Caring...

Another love story………………

కన్యా కుమారి …. ఫీల్ గుడ్ మూవీ ఇది. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకునే తిరుపతి  పట్నంలో ఉద్యోగం చేసుకునే కన్యాకుమారి వెంట పడతాడు. ఆ కన్యాకుమారి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటుంది.

ఒక దశలో ఇతన్ని కాదని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. తిరుపతి వచ్చి హడావుడి చేయడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆతర్వాత ఏమైంది ? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందా ? హీరో తో పెళ్లి అయిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వేర్వేరు మార్గాలు లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరి ప్రేమ కథ ఇది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో  కొంచెం ఆ యాసతో నడిచే లవ్ స్టోరీ ని దర్శకుడు సృజన్ బాగానే హ్యాండిల్ చేసాడు.అక్కడక్కడా కామెడీ కాస్త వర్కౌట్ అయింది. కామెడీ మరికొంత పెంచితే బాగుండేది.అలాగే కథలో ఆడపిల్ల చదవాలి,ఎదగాలి, రైతు, వ్యవసాయం కీలకమైంది అనే భావాలను కథలో అంతర్గతంగా చూపించారు. 

లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది.హీరో హీరోయిన్ ల మధ్యనే కథ అంతా నడుస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.అయినా సినిమాను చూడవచ్చు.కొత్త హీరో హీరోయిన్ల నుంచి సృజన్ మంచి నటననే రాబట్టుకున్నారు.

తిరుపతి పాత్రలో శ్రీచరణ్ రాచకొండ ఒదిగిపోయాడు. ఒక పల్లెటూరి కుర్రాడిగా బాగా నటించాడు .. కొన్ని యాంగిల్స్ లో మహేష్ బాబు లా కనిపించాడు. కన్యాకుమారి పాత్రలో గీత్ సైని పరకాయ ప్రవేశం చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు బాగున్నాయి . ఆపాత్రకు తగిన  డైలాగ్స్,, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. కన్యాకుమారి తండ్రి ని ఎపుడూ రేడియో వినే పాత్ర గా వెరైటీ గా డిజైన్ చేశారు. మొత్తం మీద ఆయనకు నాలుగైదు డైలాగులు కూడా లేవు. అలాగే వెంకాయమ్మ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. 

సాంకేతికంగా సినిమా పర్వాలేదు.శివ గాజుల, హరిచరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను బాగా చూపించారు. నిడమర్తి రవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. “డాక్టర్, లాయర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వీళ్లంతా ఎప్పుడో ఒక్కసారే అవసరమవుతారు .. కానీ వాళ్ళక్కూడా మూడు పూటలా అవసరమయ్యేది ఒక్క రైతు మాత్రమే”అనే డైలాగ్ బాగుంది.

కన్యాకుమారి పక్కింటి వెంకాయమ్మని “బామ్మ మీ టైం  లో డేటింగులు లేవా” అనడిగితే.. “మాకు ఈ డేటింగులు తెలీవమ్మా అన్నీ బ్యాటింగులే ” అని వెంకాయమ్మ చెప్పే డైలాగు బాగా పేలింది. అలాగే వెంకాయమ్మ తన మొగుడికి ఉత్తరం రాయమంటూ తిట్టే తిట్లు జనాల్ని నవ్వించాయి. 

సినిమా క్లైమాక్స్ ని రైతు ఔన్నత్యాన్ని చాటుతూ హీరో పరంగా కూడా ముగించవచ్చు.. కానీ హీరోయిన్ పరంగానే ఆమె కలనెరవేరినట్టు చూపారు.రక్తపాతాలు, ముష్టియుద్ధాలు, హింస,ఇతర మసాలాలు లేని సినిమా ఇది.కుటుంబ సమేతంగా చూడవచ్చు. ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో, ఆహలో చూడవచ్చు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!