Kamakhya temple ……………………………
అస్సాం లోని కామాఖ్య దేవాలయం పురాతనమైనది.ఈ ఆలయం గౌహతి పశ్చిమ భాగంలో ఉన్న నీలాచల్ కొండపై ఉంది.ఇది తాంత్రిక ఆరాధకులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రా స్థలం.
8వ శతాబ్దికి చెందిన కామాఖ్య దేవాలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు దానికి బదులు స్త్రీ జననే౦ద్రియమైన యోని ఆకారంలో రాయి ఉంటుంది.
దానిపై నుండి అనుక్షణం ప్రవహించే సహజ సిద్ధ జలధార ఉంటుంది. ఈ రాయినే అమ్మవారుగా భావించి పూజిస్తారు. అమ్మవారికి మేకలు బలి ఇస్తారు. జూన్ నెల మధ్యలో ఇక్కడ ‘’అంబు బాచి మేలా’’ఉత్సవాన్ని అమ్మవారి బహిష్టు రోజులలో జరుపుతారు.
ఈ ఉత్సవాన్ని తాంత్రిక ఉత్సవం లేక అమేతి అంటారు. ఈ ఉత్సవం లో పాల్గొనటానికి దేశం నలుమూలాల నుంచి తాంత్రిక ఉపాసకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.అప్పుడు ఆలయాన్ని మూడు రోజులు మూసి ఉంచుతారు అమ్మవారికి రుతుస్నానం అయిన నాలుగవ రోజు మళ్ళీ దేవాలయ తలుపులు తెరిచి దర్శనానికి అనుమతిస్తారు.ఎర్ర బట్టలు ప్రసాదంగా అంద జేస్తారు .
ఈ ఆలయ ప్రాంగణంలో పది ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఈ పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి, కమల .. వీరంతా పది మహావిద్యలకు ప్రతి రూప దేవతలని అంటారు.
వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమల దేవాలయాలు ప్రక్కప్రక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి. మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి.సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన ఆలయం. ఇక్కడకు తాంత్రిక ఉపాసకులు ఎక్కువగా వస్తుంటారు.
కామాఖ్య ఆలయం దశాబ్దాలుగా చేతబడికి ప్రసిద్ధి చెందింది. చేతబడిని తొలగించడానికి .. అరికట్టడానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ పూజలను ఆలయ ప్రాంగణంలో నివసించే సాధువులు, అఘోరాలు చేస్తారు.
ఈ పూజలో చేతబడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడే ఆచారాలు ఉంటాయి. ఈ సాధువులు కాంప్లెక్స్ లోపల ఎక్కడైనా కనిపిస్తారు. ఇక్కడ పది మహావిద్యలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు.దెయ్యాలను తరిమికొట్టడానికి పూజలు కూడా జరుగుతాయి. ఈ తాంత్రికులు చేసే పూజలు వారి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి సహాయపడతాయి.
ముఖ్యంగా అంబుబాచి మేళా సమయంలో వేలాది మంది తాంత్రికులు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ కనపడని ఏదో శక్తి ప్రాణం పోసుకుంటుందని చెబుతారు. ఈ తాంత్రికులు అవసరమైన వారికి సహాయం చేస్తుంటారు.ఇక్కడ వశీకరణ తెలిసిన తాంత్రికులు కూడా ఉంటారు.మంచి పనుల కోసం వశీకరణ మంత్రాలూ ప్రయోగిస్తుంటారు.