ఫ్యామిలీ మాన్ 2 పై మళ్ళీ తమిళుల అభ్యంతరాలు !

Sharing is Caring...

ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ పై మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సిరీస్ ప్రసారానికి ముందు కూడా కొందరు అభ్యంతరం చెప్పారు. సిరీస్ ను నిషేధించాలని డిమాండ్ చేసారు..తమిళ జాతికి వ్యతిరేకంగా ఈ సిరీస్ ను రూపొందించారనే వాదనలు వినిపించారు. తర్వాత సైలెంట్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం ఆదరణ పొందుతోంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం  స్పందించి సిరీస్ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అమెజాన్ ప్రైమ్ పై పోరాటం చేస్తామని అంటున్నారాయన.

ఇప్పటికే ఈ సిరీస్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేశాయి. సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు విడుదల చేసిన ట్రైలర్ చూసి పలువురు ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీస్తుందనే వాదనలు,వ్యాఖ్యలు వినిపించారు. రాజ్యసభ సభ్యుడు, ఎండిఎంకె నాయకుడు వైగో మే నెలలోనే  కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ఒక లేఖ రాశారు. సిరీస్ లో తమిళులను ఉగ్రవాదులుగా, ఐ ఎస్ ఐ ఏజెంట్లుగా, పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నవారిగా చూపారని … ఇది తమిళులపై నెగటివ్ ముద్ర వేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సిరీస్ తమిళ సమాజానికి వ్యతిరేకం, తమిళ సంస్కృతిపై దాడి అని …  ఈ సిరీస్ ని ఆపివేయాలని కోరారు.

ఈ సిరీస్ లో నటి సమంత శ్రీలంక కు చెందిన ఉగ్రవాద తమిళ యువతిగా నటించింది. ఈ పాత్రపై కూడా తమిళులు మండి పడుతున్నారు.ఎల్‌టిటిఇని ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులుగా, తమిళులను దుర్మార్గులుగా చిత్రీకరించారని నామ్ తమిలార్ కచ్చి నాయకుడు సీమాన్ కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 ని నిషేధించాలని డిమాండ్ చేశారు. చెన్నైలోఈ సిరీస్ కథ  కథ సెట్ కావడం యాదృచ్చికం కాదని ఆరోపించారు. తమిళనాడు మంత్రి మనో తంగరాజ్ కూడా సిరీస్ ట్రైలర్  శ్రీలంకలో ఈలం తమిళుల చారిత్రక పోరాటాన్ని కించపరిచే విధంగా ఉందని తన అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంత మంది అభ్యంతరం చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.

అమెజాన్ ప్రైమ్ వారు కూడా పట్టించుకోలేదు. ఈ సిరీస్ దర్శకులు రాజ్, డీకే, రచయిత సుమన్, నటీమణులు  ప్రియమణి, సమంతా లకు ఇతర నటులకు  తమిళ సంస్కృతిపై గౌరవం ఉందని నటుడు మనోజ్ వాజపాయ్ అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ ప్రసారాలు మొదలైనాయి. ఇప్పటికే లక్షలాదిమంది చూసారు. చూస్తున్నారు. తాజాగా మరల తమిళ ప్రముఖులు అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారో అర్ధం కాని విషయం.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!