SBI performance improved ……………………………………….స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పనితీరు బాగానే ఉంది. మార్చి 2021 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 81,326.96 కోట్ల స్థూల ఆదాయంపై రూ. 6,451 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 80 శాతం పెరిగింది. అనుబంధ సంస్థలతో కలిపి చూసినా ఎస్బీఐ నికర లాభం గత ఏడాది ఇదేకాలంతో పోల్చిచూస్తే 60 శాతం పెరిగి నికరలాభం రూ. 7270. 25 కోట్లకు పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కూడా పనితీరు మెరుగుపడింది. 2019 -20 ఆర్ధిక సంవత్సరం తో పోలిస్తే నికరలాభం 41 శాతం వృద్ధితో రూ. 14488.11 కోట్ల నుంచి రూ. 20110. 17 కోట్లకు పెరిగింది.
అలాగే స్థూల మొండి బకాయిలు రూ.149092 కోట్ల నుంచి 126389 కోట్లకు తగ్గాయి. రుణాల వసూలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ నికర వడ్డీ ఆదాయం పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 27067 కోట్ల వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 18.99 శాతం ఎక్కువ. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేర్ కి రూ 4 చొప్పున డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
వార్షిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో ఎస్బీఐ షేర్ల లో పెద్ద ర్యాలీ రావచ్చని అంచనా వేశారు. ఫలితాలు వెల్లడించిన రోజున షేర్ ధర 390 నుంచి 401 వరకు పెరిగింది. గత మూడు రోజుల్లో 418 వరకు పెరిగి అక్కడ నుంచి ఊగిసలాడుతోంది. ప్రస్తుతం రూ. 413–415 వద్ద కదలాడుతోంది.ఇదే షేర్ ఫిబ్రవరి 21 న 426 వద్ద ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్ట ధర 150 కాగా గరిష్ట ధర 427 మాత్రమే.ధర తగ్గితే దీర్ఘకాలిక వ్యూహంతో ఈ షేర్లలో మదుపు చేయవచ్చు. అమ్మకాల వత్తిడి ఎక్కువగా ఉండటంతో షేర్ ధర ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. స్వల్పకాలంలో షేర్ ధరలో అంత వృద్ధి ఉండకపోవచ్చు అంటున్నారు. షేర్ ధర తగ్గితే కొనుగోలు చేయవచ్చు. బాగా తక్కువ ధరలో కొన్నవారైతే ప్రస్తుతం లాభాలు స్వీకరించడం మంచి వ్యూహమే. లేదంటే డివిడెండ్ వచ్చేవరకు ఆగి తర్వాత అమ్ముకోవచ్చు. అధిక సంఖ్యలో షేర్లు ఉన్నవారు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు.
————–KNM

