కుర్రకారు గుండె మీద తబలా !

Sharing is Caring...

Marudhuri Raja ……………………………………………..

ఈడు దొర్లుకుంటూ వచ్చే రోజుల్లో..వయసుకు కోరికల ఈకలు పెరిగే కాలంలో..మనసులో పడ్డ చెరగని నాట్య ముద్ర “జ్యోతీలక్ష్మి.” ఒక వయసు లో ఆమెని తెరమీద చూస్తే..మనసు ఉరకలతో వేడెక్కేది. వయసు పెరిగి,అనుభవాలు ముదిరాక..ఎంత గొప్ప నర్తకి అనే గౌరవం పెరిగింది. అల్లరి చేసే వయసుకి..అనుభవం నేర్పిన జ్ఞానానికి.,ఎంత దూరం..!??

మీతో ఓ ఫోటో…. అని మహా అయితే ముగ్గురిని,నలుగురినో అడిగి ఉంటాను లైఫ్ లో..వాళ్లలో జ్యోతిలక్ష్మి..ఒకరు. అదీ నిజమయిన అభిమానం,గౌరవం..తో.ఆమెని అడిగి..తీసుకున్న ఫోటో ఇది..కుర్రతనం స్టెప్పులేసే రోజుల్లో..ఆమె వెండితెర మీద అడుగేస్తే.. గుండె తబలా లాగా మోగేది..ఎవరెన్ని నోళ్ళు పారేసుకున్నా.. ఆమె తెరమీద కనిపించగానే… కాళ్ళు ఆరేసుకుని డాన్స్ చూసేవాళ్ళు.

అగ్ర హీరోల సినిమా పోస్టర్ లో.. జ్యోతిలక్ష్మి కనిపిస్తే..అదో..కవ్వింపు..!పానీపూరీ హీరోయిన్ల లో..పానీ కూడా ఉండదు. గుటుక్కున మింగితే చటుక్కున గొంతులోకెళ్తారు. అదే జొన్నరొట్టెలో, పండు మిరపకాయలకారం, పేరిన నెయ్యి కలిపి నమిలితే.. పళ్ళకి పదును,దవడల్లో దమ్ము..పెరిగిపోవూ.. అదే చేవ,తెగువ..జ్యోతిలక్ష్మి..అంటే..!

శృంగారానికి..సింగారాలు దిద్ది..తననే ఒక నాట్య శిల్పంగా మార్చుకున్న మేలికయిన..మెలికల మేలిమి..జ్యోతిలచ్చిమి..! అలాంటి సీనియర్ నటి షూటింగ్ లో కనిపించగానే..నాలో ప్రేక్షకుడు..పొంగిపోయి.. ఫోటో కావాలని అడిగాడు. ఆమె సంతోషంతో..ఒప్పుకున్నారు.. ఇది శృంగార తారగా భావించి తీసుకున్న ఫోటో కాదు..! పరిపక్వత పెంచుకున్న,ఆమె పట్ల గౌరవం కోరిన జ్ఞాపక చిత్రం.

దాసరి నారాయణరావు గారు  జగపతి బాబు హీరోగా.. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం లో( దుర్మార్గుడు..ఆవిడచేత ఓల్డ్ క్యారెక్టర్ వేయించాడు..శీనూ..!ఆమెకు ఈ చేతులతో డైలాగులు రాసిన దుర్మార్గుణ్ణి నేనే..) తీసిన “బంగారుబాబు” షూటింగ్ లో తీసిన పిక్..ఇది)

జ్యోతిలక్ష్మి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. హీరోయిన్ గా చేసిన సినిమాలు ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.  80, 90 దశకాలలో  తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టిన జ్యోతిలక్ష్మి. క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎంత పెద్ద హీరో అయినా ఆ మూవీలో జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూకట్టేవారు. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు.

జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టి.కె. రామరాజన్, తల్లి పేరు శాంతవి. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దదైతే, నర్తకి జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు. ఈమె కెమెరామెన్ సాయిప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. జ్యోతి లక్ష్మి కి  జ్యోతిమీనా అనే ఒక కూతురు ఉంది. జ్యోతి మీనా కూడా సినిమాలలో నటించింది కాని నిలదొక్కుకోలేకపోయింది. 2016 లో ఆగస్టు 9 న  జ్యోతిలక్ష్మి కన్నుమూసారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!