ఆ ఇద్దరి ప్రేమ కథ !!

Sharing is Caring...

A woman of adventure…………………..

సునీతా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్య భారత్ మూలాలు ఉన్నవ్యక్తి. గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఝులాసన్లో పుట్టి పెరిగారు. దీపక్ పాండ్య అహ్మదాబాద్లో వైద్య విద్య చదివిన తర్వాత, తన సోదరుడు అమెరికాలో ఉండటంతో 1957లో ఆయన కూడా అక్కడికి వెళ్లారు. 

అక్కడ దీపక్ ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మెడిసిన్‌లో ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీని పూర్తి చేశారు.1964లో దీపక్ కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో అనాటమీ విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్ ఫెలోగా చేరారు. తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలలో పనిచేశారు.

సునీతా తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. దీపక్ పాండ్య అమెరికా కు వచ్చిన తర్వాత ఆమె పరిచయమయ్యారు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం.. సునీత ఆఖరమ్మాయి. సునీత అమెరికాలోని నేవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.

నేవల్ అకాడమీ లో ఉన్నప్పుడే మైఖేల్ విలియమ్స్ తో  సునీతకు పరిచయం అయింది. అకాడమీలో ఉన్నపుడు ఇద్దరు నేవీ హెలికాఫ్టర్లు నడిపేవారు. అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వారు మళ్లీ కలుసుకోలేదు. ఆ తర్వాత కొద్దీ రోజులకు ఒక ఫ్రెండ్ పెళ్లిలో కలిశారు.

స్నేహం మళ్లీ చిగురించి అది ప్రేమగా మారింది.కొన్నేళ్ల పాటు సహజీవనం చేశారు.. ఆ తర్వాత  మైఖేల్, సునీతాలు పెళ్లి చేసుకున్నారు.విలియమ్స్ టెక్సాస్‌లో ఫెడరల్ మార్షల్‌గా పనిచేస్తున్నారు.సునీతా  ప్రముఖ వ్యోమగామి అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కువగా బయటికి చెప్పలేదు.మీడియా ఇంటర్వ్యూ లు కూడా తక్కువే..అందుకే కుటుంబ సమాచారం అందుబాటులో లేదు. 

ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇండియా వచ్చినపుడు దత్తత తీసుకునే యోచన ఉన్నట్టు విలియమ్స్ మీడియాకు చెప్పారు.ఆగస్టు 2024లో ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ విలియమ్స్  మాట్లాడుతూ  ‘సునీతకు అంతరిక్షం సంతోషకరమైన ప్రదేశం’ అని తెలియజేసారు. సునీత తండ్రి హిందువు కాగా,తల్లి క్యాథలిక్. తన ఇంట్లో అన్ని మతాల వారిని గౌరవించడం ఆమె నేర్చుకున్నారు.

ఇక సునీతా కెరీర్ గురించి చెప్పుకోవాలంటే తండ్రి దీపక్ పాండ్య సూచనతో 1987లోUS నావికాదళంలో ఒక ఎన్సైన్ గా చేరారు.ఆరు నెలల తర్వాత, ఆమెను బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా నియమించారు.జూలై 1989లో నావల్ ఏవియేటర్‌ పొజిషన్ కు చేరుకున్నారు.

నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు.30 సంవత్సరాలు అదే వృత్తిలో కొనసాగారు. వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 గంటలు పని చేసిన అనుభవం గడించారు.

నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానం లో శిక్షణ తీసుకున్నారు.కల్పనా చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ సునీత. ఆమె తొలి పర్యటన డిసెంబరు 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది.

రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో గడిపింది. అంతరిక్షం లో గడిపిన 322 రోజులలో ఒక రోజు కూడా వ్యాయామం మానలేదు.అంతరిక్ష మొదటి ప్రయాణం లో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రానికి  మరమ్మత్తులు చేయడం వంటివి చేశారు.రెండోసారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు నిర్వహించారు.

సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగిన  అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే “నాసా ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్” బృందం తో కలిసి పని చేశారు. ఇక ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్లి తొమ్మిది నెలల పాటు ఇరుక్కు పోయిన కథ తెలిసిందే.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!