సుదర్శన్ టి…………………….. Advances in defense capabilities
ఆధునిక యుద్ధంలో డ్రోన్ల అవసరం బాగా పెరిగింది. భారతీయ సైన్యం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్ల ను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. వీటిని “ఆత్మహత్య డ్రోన్‌ల” ని కూడా అంటారు. శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించిన ఈ హైటెక్ డ్రోన్‌లు భారతదేశ రక్షణ సామర్థ్యాలలో సాధించిన పురోగతిని సూచిస్తాయి. ఈ డ్రోన్ల కు “నాగాస్త్ర-1” అని నామకరణం చేశారు.
దేశీయ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) ఈ డ్రోన్ల ను తయారు చేసింది. మన ఆయుధ బాండాగారంలోకి ప్రవేశించిన విన్నూత్నమైన “లోటరింగ్ మందుగుండు సామగ్రి” …. ఈ డ్రోన్లలో పైలట్ ఉండడు,
ఒక కిలో బరువున్న విస్పోటక పదార్థాన్ని దీన్లో పెట్టి ప్రయోగిస్తే నేరుగా టార్గెట్ మీదకు దూసుకెళ్లి పేలిపోతుంది. ఇది సరైన టార్గెట్ కనబడేవరకూ చక్కర్లు కొడుతుంటుంది, టార్గెట్ కనబడగానే నేరుగా టార్గెట్ మీదకు దూసుకెళ్లి పేలిపోతుంది అందుకే దీన్ని Loitering Munition అంటారు.
తీవ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్ మీద లేదా తీవ్రవాదులు దాక్కుని ఉన్నచోట సైనికులతో దాడిచేస్తే మన సైనికులు కూడా మరణించే ప్రమాదం ఉంది.. అదే ఈ డ్రోన్ ను ప్రయోగిస్తే ప్రాణనష్టం ఉండదు.
దీన్ని 75 శాతం మన దేశంలో తయారైన విడి భాగాలతో సోలార్ కంపెనీ తయారు చేసింది. దీని బరువు కేవలం 30 కిలోలు, రెండు సంచుల్లో పెట్టి ఇస్తారు.
ఇద్దరు సైనికులు దీన్ని కావలసినచోటుకు మోసుకెళ్లి అక్కడ దీన్ని ప్రయోగించొచ్చు. దీన్ని టార్గెట్ కు 30కిమిల దూరం నుండి ప్రయోగించవచ్చు. బ్యాటరీతో పనిచేయడం వల్ల దాదాపు 600 అడుగుల ఎత్తులో అస్సలు శబ్దం చేయకుండా దూసుకెళ్లి శత్రుస్థావరం మీద దాడిచేస్తుంది. ఒకవేళ mission abort చేయాలి అనుకుంటే ప్యారాచూట్ ద్వారా నేల మీదకు దింపి మళ్ళీ అవసరం అయినపుడు వాడుకోవచ్చు.
ఇప్పటికే మొదటి బ్యాచ్ 120 యూనిట్లు డెలివరీ అయ్యాయి. ఈ స్వదేశీ డ్రోన్ ను పగలు/రాత్రి పనిచేసే కెమెరా తో , 1 కిలో పేలుడు వార్‌హెడ్‌తో రూపొందించారు. 480 లొయిటర్ ఆయుధాలను సరఫరా చేయడానికి ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది.
నాగాస్త్ర-1ని భారత సైన్యం కొనుగోలు చేసింది అంటే డ్రోన్ ఆధారిత యుద్ధానికి సంసిద్ధమౌతోందని చెప్పుకోవాలి. ప్రపంచ ధోరణికి అనుగుణంగా మన సైన్యం అడుగులు వేస్తున్నది అనుకోవాలి. రష్యా లక్ష్యాలపై ఉక్రెయిన్ డ్రోన్‌లను ఉపయోగించడం.. సముద్ర నౌకలపై యెమెన్ హౌతీ గ్రూప్ డ్రోన్ దాడులు చేయడం ఇటీవలి ఉదాహరణలుగా మనకు కనబడుతున్నాయి. యుద్ధంలోకి సాంకేతికతను జొప్పిస్తూ .. దేశం ముందడుగు వేసినట్టే అని భావించాలి.