Subbu Rv…………………………………
Dedicated woman…………………….. చేసే పనిలో, పని చేసే వ్యక్తిలో బాధ్యత, అంకితభావం ఉంటే అది ఏ ఉద్యోగమేదైనా సరే కొత్త చరిత్రని లిఖించవచ్చని నిరూపించారు మటిల్డా కులు. మూఢత్వం, కుల హేళనల నడుమ అవమానాలను ఎదిరించి, తన విధిని నిర్వర్తించి ఊరినే మార్చిన ఓ ఆశా జ్యోతి ఆమె.
సూరీడు వెలుగు రేఖలు గుమ్మం తాకక మునుపే తన విధి నిర్వహణలో మునిగే ఆశా దీదీ. పొద్దెక్కే సూరీడుకి పోటీగా రెండు చక్రాల సైకిలుపై సవారీ చేస్తూ గ్రామ అజ్ఞానపు చీకట్లు పారద్రోలే ఆరోగ్య కార్యకర్త, ఆశావర్కర్ గా పనిచేస్తున్నారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన శక్తివంతమైన మహిళా జాబితాలో స్థానం సాధించి యావత్తు దేశాన్ని తన సేవా భావంతో అబ్బురపరిచిందామె.
కార్పొరేట్ సిఈఓ లు, రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడా కారిణులు స్థానం సంపాదించే శక్తివంతమైన మహిళల జాబితాలో ఒక సామాన్య మహిళా అందునా ఆశా వర్కర్ చోటు సాధించడం సామాన్య విషయం కాదు. ఫోర్బ్స్ ప్రకటించిన ఇరవై మంది మహిళల్లో మూడవ స్థానం మటిల్డా సాధించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానం పొందడం వెనుక మటిల్డా 15 ఏళ్ళ నిర్విరామ కృషి .. నిస్వార్థ సేవలు ఉన్నాయి.
ఒరిస్సా లో సుందర్ గడ్ జిల్లాలోని గర్గద్ బహల్ గ్రామానికి ఉన్న ఏకైక ఆశా వర్కర్ మటిల్డా కులు. ఆమె నెల జీతం 4500/- రూపాయలు. చేసే ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తే ఎటువంటి పురోగతి సాధించవచ్చో లోకానికి చాటిచెప్పిన ప్రతిభా వంతురాలు. సాంకేతికత, చదువు, జ్ఞానం పెరుగుతున్నా సరే మనిషి బుద్ధి చాలా చోట్ల కులం, మతం అనే మూఢత్వం దగ్గరే ఆగిపోతుంది.
దానికి తోడు మూఢనమ్మకాలను నమ్ముతూ చేతులారా అయినోళ్ళ ప్రాణాలు గాల్లో కలుపుతున్న సాంప్రదాయాల నిలయం ఆమె గ్రామం. జ్వరం వస్తే ఆసుపత్రి కన్నా బాణామతి వంటి మూఢ విధానాల దగ్గరకు చేరే జనం. ప్రాణాన్ని నిలబెట్టే ఔషధానికి కులం ఉందా అంటే దాన్ని వేసే చేతికి ఉందంటూ షెడ్యూలు తెగకి చెందిన మటిల్డా ని అనేక అవమానాలకు గురి చేసే మూర్ఖులు ఉన్న ఊరు అది.
ఎన్నో మూర్ఖత్వపు విధానాల, అవమానాల నడుమ ఆమె తన విధులను మాత్రం వీడలేదు. సుమారు వెయ్యి మంది ఉండే ఊరికి ఆమె ఆరోగ్య రక్షణ కంచెలాగా మారారు. గర్భిణులు, బాలింతలు, పసికందుల ఆరోగ్యం, టీకాలు, మందులు అందిస్తూ అలాగే బహిష్టు సమయంలో పాటించాల్సిన శుభ్రత, జాగ్రత్తలను తెలుపుతూ గిరిజన తెగల్లో ప్రబలే గర్భసంచి ఇన్ఫెక్షన్స్ , లైంగిక వ్యాధుల గురించి వివరిస్తూ వాటికి మందులు ఇచ్చేవారు. కోవిడ్ సమయంలో ప్రబలిన మహమ్మారిని తన ఊరు నుండి కాపాడుకుంది.
ఆశా వర్కర్లకు సరిగా పిపిఈ కిట్లు లేకున్నా వ్యాధి లక్షణాలు కనిపించిన వారి దగ్గరకు వెళ్ళి మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వచ్చేది. ఇంటింటికీ అదే సైకిలు మీద తిరిగి కోవిడ్ నివారణ చర్యలు తెలియ చేసేది. ఏ ప్రజలైతే జ్వరానికి, కాన్పులకు ఆసుపత్రి దగ్గరకు కాకుండా మంత్రగత్తెలను నమ్మే వారో అదే ఊరిలో గడప గడప తిరిగి మూఢ నమ్మకాలకు వ్యతిరేక ప్రచారం చేసి … ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది.
తనని కులం పేరుతో అవమానించినా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యతంటూ ఇల్లిల్లు తిరిగి అందరికీ వ్యాక్సిన్ వేయించారు. కోవిడ్ పై టీకాతో ఎదురు తిరిగి తన గ్రామాన్ని కాపాడుకొన్న కోవిడ్ వారియర్ ఆమె. కులం ఏదని కాదు,జీతం ఎంతని కాదు, ఉద్యోగం ఎంత గొప్పదని కాదు చేసే ఉద్యోగాన్ని సక్రమంగా, క్రమశిక్షణతో అంకితభావంతో నిర్వహించాలి. 4500 రూపాయల జీతం వచ్చే చిన్నపాటి ఆశా వర్కర్ సామాజిక బాధ్యతతో మూఢ విశ్వాసాలను పారద్రోలేందుకు 15 సంవత్సరాలుగా చేసిన కృషికి … అందించిన సేవలకు గాను పవర్ఫుల్ విమెన్ గా గుర్తింపు పొందారు.
సమాజం కోసం స్పందించి బాధ్యతగా పని చేసే శక్తి సామర్ధ్యాలు అందరికీ ఉండవు. అవి ఉన్న వారిని గుర్తించడంతో పాటు ప్రశంసించడం కూడా గొప్ప విషయమే. ఒక ఆశా వర్కర్ తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహిస్తే గ్రామానికి ఒనగూరే మహత్తర ప్రతిఫలం ఏమిటో చూశాం.ఇంత సేవకి గాను మన ఆశా దీదీకి ప్రభుత్వం నుండి లభించింది రెండువేల ఇన్సెంటివ్ మాత్రమే. కానీ ఆమెకు లభించిన ‘ఆత్మ సంతృప్తి’ కొన్నికోట్లు ఖర్చు చేసినా రాదు.
‘ఈ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి కళ్లు, చేతులు. కిందిస్థాయి నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా, అక్కడికి ఏ సమాచారాన్ని చేరవేయాలన్నా అధికారులు పూర్తిగా వీరిపైనే ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆశాలు గొప్ప కృషి చేశారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం వారికి మంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు. నామమాత్రపు వేతనాలు ఇస్తున్నది. తమను వలంటీర్లుగా కాకుండా కార్మికులుగా గుర్తించాలన్నది ఆశాల చిరకాల డిమాండ్. ఎందుకంటే అప్పుడే వారికి ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి ” అంటోది మటిల్డా కులు.