తిట్టు కవిత్వం లోనూ శ్రీశ్రీ యే పయనీర్! (part2)

Sharing is Caring...

Taadi Prakash ……………………………………………………………

సోమసుందర్ విస్తృతంగా రాసిన శృంగార కవితలు చూసి కె.వి. రమణారెడ్డి…”ఆశయాలను డైవోర్సు చేస్తున్నై వాస్తవాలు ….. ఆశలను సిఫార్సు చేస్తున్నై అక్రమాలు “అని కోపంతో అన్నారు.

“పత్రికలో కార్టూనులు పడడం చూళ్ళేదూ? పద్యంలో ఆమాదిరి పధ్ధతి వీల్లేదూ?” అంటూ శ్రీశ్రీ సిరిసిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కుల్లో (సిప్రాలి) లెక్కలేనన్ని వ్యంగ్య చిత్రాలు గీశారు. సినారె, దాశరథిఫై శ్రీశ్రీ దాడి చేశారు. “సినారె భళారే, అన్నిటికీ హుషారే .. సినిమా రెడీమేడ్ సరుక్కీ తయారే … కిరాణా కొట్టు సరుకురే! ”

“ఆచార్యుడనుకున్నవాడు అల్లాటప్పాగా రాస్తుండడం… హైస్కూలు తెలుగు మేష్టరుకున్నంతపాటి తెలివి వుందా యీ ప్రొఫెసరుకని అడుగుతాను అలిగి!” అని శ్రీశ్రీ వెక్కిరించినపుడు సి. నారాయణరేడ్డి తిరిగి తిట్టకుండా, “విప్లవకవి అనుకున్నవాడు విదూషకుడిగా మారాడు” అని హుందాగా వూరుకున్నారు.

కవి దాశరథి కృష్ణమాచార్య శ్రీశ్రీ పై దుమ్మెత్తిపోస్తూ ….” ఇద్దరు పెళ్ళాల తోటి, రెండు బంగాళాల తోటి, సామ్యవాది వెట్లారా? కారుకూతలెందుకురా? నువు రాసిందేమిట్రా ? మట్టీ మశానం… మహాప్రస్థానం .. నీ పాలిటి స్మశానం ….. ఆరోరుద్రుని గూర్చి అవాకులు కూయకు….  అతని కాలిధూళి తాకు అర్హత నీకేదిరా”.. అన్నారు దురుసుగా.

అంతే.  శ్రీశ్రీ కి తిక్కరేగింది. “ఏమిట్రోయ్ పొట్టికవీ, ఎందుకింత దూకుడు … ఎడాపెడా వాయిస్తా ఎండిన నీ మూకుడు…. నేల మునగ చెట్టుకే నిచ్చెన వేసి ఎక్కుతావు….  శ్రీశ్రీనే ఎదిరించే ఎత్తుకు పెరిగావురా?  ఎముక ముక్క .. కొరుకు కుక్క ఎంచు నరుని దేవునిగా…. ..  ఆరుద్ర కనిపించు … నీకు అతిమహానుభావునిగా? వద్దుసుమా చెడిపోతావు, వొద్దికగా నడుచుకో ఓనమాలు రానివాడ….  వొళ్ళు తెలిసిమసలుకో! 

పి.ఎ.పి. లో నాదొక సగం పాట కతికేవు…. ఇంకెందుకు నీతులు నా ఎంగిలి తిని బతికేవు!” (PAP- ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్)”సినిమా ఎంగిలి మెతుకులు … సిద్ధాన్నం చేసుకో దిగంబరుల వూసెత్తక … తెలివిగ నోర్మూసుకో… నారాయణరెడ్డి లాగ రాయాలని….  దురద కలం నుండి కారేదో…  చవక సెక్సు బురద”  అంటూ బిలో ది బెల్ట్ దెబ్బతీశాడు శ్రీశ్రీ. “దాశరథీ, నవ్యకళానిధీ, కావ్య పయోదధి… చీనా అంటే అధికాధిక భయం, అతని దుర్విధి!”  కసిగా అన్నారు శ్రీశ్రీ.

1964-65 లో విషాద భారతం, కారుచీకట్లో కాంతిరేఖ కావ్యాలు రాసిన సి. విజయలక్ష్మి (సి.వి. గా పాపులర్) ఆరుద్ర ప్రయోగాల మోజు చూసి చిరాకు పడ్డారు. కూనలమ్మ పదాలంటూ వంటింటి, ఇంటింటి పద్యాలు రాయడం  కోపం తెప్పించింది.”ప్రాస సర్కసు జంపు, కుక్క చచ్చిన కంపు … నీదు కవనపు సొంపు చాలు చాలమ్మా, ఓ పోసుకోలమ్మా” అంటూ ఆరుద్రని మందలించారు.

ఒకర్ని మెచ్చుకున్నా, ఇంకొకర్ని తిట్టిపోసినా శ్రీశ్రీయే సమర్థుడేమో!హరికథా పితామహుడు ఆదిభట్ల దాసు సంగీతం, సాహిత్యం సరితూచిన త్రాసు భాష, శాసనచనుడై పరగినట్టి గిడుగు తెలుగువారి వెలుగుదారి తెలివెన్నెల మడుగు కృష్ణశాస్త్రి విష్పరించు చారువేదనా రోగం (whispering ని శ్రీశ్రీ ఎంత బాగా వాడాడో చూడండి) అని ఎంతో అందంగా, అర్థవంతంగా అనగలిగిన శ్రీశ్రీయే –

“ఆరుద్ర గారి చరణాలు … అసందర్భ తోరణాలు …అసాహిత్యానికి నిదర్శనాలు … అజీర్తి, సుఖవిరేచనాలు…” అని అంటే “అవి అతని నోట్లోంచి రావటం ఎంత లక్షణంగా వుంది” అన్నారు ఆరుద్ర. ఆరుద్ర భార్య రామలక్ష్మి విమర్శకు జవాబిస్తూ…”నారేగుళ్ళి, బిగించి కారాకిళ్ళీ …. ఇలా వచ్చావేం మళ్ళీ ఇక్కడేం ఉందీ? హళ్ళికి హళ్లి, సున్నకు సున్నా” అని వెక్కిరించాడు శ్రీశ్రీ.

ఆంధ్రపత్రిక, నార్లపై విసురు “అరే యార్ ఇధరావ్ దేఖో … ఆంధ్రుల దినపత్రిక పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రిక …. అటోఇటో టిటో డిటో ఎడిటోరియల్ నార్ల నిన్న తిరగా, ఇవాళ బోర్లా “….  విశ్వనాథ సత్యనారాయణ చేతిలో పదం బానిసలా పడుంటుంది. శ్రీశ్రీ చేతిలో పదం ఆడపిల్లలా నృత్యం చేస్తుంది అని విశాఖలో ఒక పెద్దాయన అన్నారు.

చాలా గొప్ప కవిత్వం రాస్తున్నాడని గజ్జెల మల్లారెడ్డి ని ఒక సందర్భంలో మెచ్చుకున్న శ్రీశ్రీ, మరోసారి … “గజ్జెలమల్లా, నువ్వు కవివి కావు, కావుకావు … ఇది కాకిగోల అయినా సరే” అన్నారు. ఒక రోజు శ్రీశ్రీ మద్రాసు పాండీ బజారులో నడిచి వెళుతుండగా ఆరుద్ర ఎదురొచ్చారు. సన్నిహిత బంధువులూ, ప్రతిభామూర్తులు అయిన వాళ్ళిద్దరి మధ్య వైరం వుండేది.

“ఏం ఆరుద్రా బాగున్నావా? అదే ఇల్లా” అని పలకరించారు శ్రీశ్రీ. “ఆ… అదే ఇల్లూ, అదే ఇల్లాలు” అన్నారు ఆరుద్ర. అప్పుడు శ్రీశ్రీ రెండో ఆవిడ సరోజతో వుంటున్నారు. పొద్దున్నే ఈ దరిద్రుడితో మాటపడాల్సి వచ్చిందే అనుకుని వుంటారు శ్రీశ్రీ. much dirty water has flowed under the bridge ఇది గత జలసేతు బంధనమే అయినా గుర్తు చేసుకోదగిన తిట్టు కవితా ప్రవాహము.

అప్పుడెప్పుడో విశాఖలో ఒక సాహిత్య సభ… అభిప్రాయాల పుస్తకంలో ఒకాయన – గురజాడ, గిడుగులు శ్రీశ్రీ గురువులు – అని రాశారు. దాని కింద శ్రీశ్రీ – పురిపండా, ఆరుద్ర లఘువులు – అని రాశారు. నిజం చెప్పుకోవాలి, గురజాడే పితామహుడు, ఆ తరువాతే శ్రీశ్రీ – అని ఆచార్య రోణంకి అప్పలస్వామి నొక్కి చెప్పినపుడు, చిరాకు పడిన శ్రీశ్రీ  ” హైస్కూల్లో ఇంగ్లీషు గ్రామరు పాఠాలు చెప్పుకోక, రోణంకి కెందుకు సాహిత్యం గురించి?” అనేశారు.

ఒకసారి, మద్రాసులో శ్రీశ్రీ ని కలిసిన బంగోరె … పురిపండా, రోణంకి పెద్దవాళ్లు. మనవాళ్లు. అంతలేసి మాటలంటే ఎట్లా? make amends, if you can అన్నారు. ఆ.. ఆ… అలాగే అని వూరుకున్నారు శ్రీశ్రీ.ఉత్తమ కవిత్వంతో, అపురూపమైన వచనంతో మాలాంటి వేలూ, లక్షల మందిని ఉత్తేజంతో వూగించి, వుక్కిరిబిక్కిరి చేసి, ఒక గొప్ప ఆదర్శాన్ని గొంతెత్తి పిలిచి, వెలుతురు దారులుగా పరిచి, వూపిరి సలపని వుద్వేగంతో నడిపించి, మా యవ్వనాన్ని దొంగిలించిన ఈ సాహితీమూర్తులంతా మనలాగా కోపతాపాలు, ఈర్ష్యాసూయలు పుష్కలంగా వున్న మామూలు మనుషులేనని తెలుసుకోవడం భలే బాగుంటుంది కదా.

ఇంకా చాలా వున్నాయి. చాసో నుంచి సినారె దాకా, రోణంకి నుంచి నోముల సత్యనారాయణ దాకా… లక్కీగా ఈ మహానుభావులందరితో నేను మాట్లాడాను. వాళ్ల సభలు రిపోర్ట్ చేశాను. కొందరిని ఇంటర్వ్యూ చేశాను.
జోసెఫ్ టిటో : నాటి కమ్యూనిస్టు యుగొస్లావియా అధ్యక్షుడు. టిటో నోటికొచ్చినట్టు మాట్లాడినట్టుగా, నార్ల చేతికోచ్చినట్లు రాస్తాడని శ్రీశ్రీ వ్యంగం.

READ IT ALSO ………………….. తిట్టు కవిత్వం లోనూ శ్రీశ్రీ యే పయనీర్! (part1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!