పిచ్చుకల ప్రియుడు!

Sharing is Caring...

Subbu Rv……………………………

సాయంత్రం తనిచ్చిన టీ కప్పుతో ఆకాశం కనిపించేలాగా గోడకి ఆనుకుని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్కని చుంబిస్తూ హాయి పొందుతున్న సాయం సంధ్యవేళ , మా గూటి పిచ్చుకమ్మ రయ్యని వచ్చి కలియ దిరిగి ఆకాశంలో కెగిరింది.

పిచ్చుకమ్మని వెంబడిస్తున్న నా చూపులు ఆ విహంగ వీక్షణాన్ని చూసి అలా క్షణకాలం ఆగిపోయాయి. పక్షుల వరస రయ్యి రయ్యిమంటూ గూటికి చేరుకుంటున్నాయి. నువ్వేం కోల్పోతున్నావో చూశావా అంటూ గోడకి దండెం కట్టేందుకు పెట్టిన కర్రపై వచ్చి ఠీవిగా కూర్చుని కిచ్ కిచ్ మని మాట్లాడుతుంది పిచ్చుకమ్మ.

పిచ్చుకలు మనుషుల నేస్తాలని ఊరికే అనలేదు కదూ. నాలుగు గింజలు పెట్టి, గుక్కెడు నీళ్ళు పోస్తే హృదయంలో పదిలంగా దాచుకుంటాయి మన బంధాన్నవి. మన ఇంటి చూరుల్లో కిచు కిచు మంటూ, అందమైన నైపుణ్యత కలిగిన గృహ నిర్మాణాలను మనుషులకు గురువుగా, చిన్న శరీరంతో చక్కని నైపుణ్యంతో సంతోష జీవితం నేర్పిన స్నేహితుడిగా వెదురు తడికెకు వేలాడే గూడులో చక్కని దాంపత్య బంధానికి ప్రతీకగా నిలిచిన పిచ్చుకలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి.

మనిషి వైజ్ఞానికత వైపు అడుగులు వేస్తున్నానన్న భ్రమలో పిచ్చుకల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ చివరికి వాటిని అరుదైన పక్షులుగా మన భావితరాలకు పరిచయం చేసే పరిస్థితి తెచ్చిన తరుణంలో ప్రకృతిలో భాగమైన పిచ్చుకలను కాపాడు కుందామంటూ వాటి కోసం పరితపించే స్నేహితుడు మన పిచ్చుకల పిచ్చివాడు స్ఫూర్తి శ్రీనివాసుడు.

పిచ్చుకలను కాపాడుకుందామంటూ తన ఇంటిపేరుగా మారిన స్ఫూర్తిని సామాజిక స్పృహగా మారుస్తూ సేవ్ స్పారో ఆన్లైన్ ఆర్ట్ కాంటెస్ట్ రూపొందించి, ఎల్కేజి నుండి పీజీ దాకా ఆలోచన కలిగించే అనూహ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బ్రదర్. పిచ్చుకలపై చాటుతున్న మీ ప్రేమకి హృదయపూర్వక అభినందనలు.

మన హీరోలులో వివరంగా విపులంగా రాయాల్సిన వ్యక్తి కానీ ఈ ప్రయత్నాన్ని అభినందించేందుకు ముందుగానే ఈ మంచి కార్యక్రమాన్ని అభినందించకుండా ఉండలేకున్నా.. మా ఇంటి పిచ్చుక ఈ పిచ్చుకల ప్రియుడి గురించి రాసేలాగా చేసింది.అన్నట్టు శ్రీనివాస్ డ్రాయింగ్ టీచర్ గా చేస్తున్నారు. 300 మందికి పైగా వివిధ వయసుల వారికీ బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. అలాగే ఆయన ప్రకృతి ప్రేమికుడు కూడా. అపుడపుడు కొండలు,కోనలు,అడవుల్లోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ గడుపుతారు.

పిచ్చుకలు జీవన శైలి … పిచ్చుకలు అంతరించిపోవటానికి కొన్నికారణాలను శ్రీనివాస్ వివరించారు. పిచ్చుకలు సహజంగా గింజలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పిల్లలకు వివిధ ప్రాంతాల నుంచి మెత్తటి కీటకాలను తెచ్చి ఆహారంగా అందిస్తాయి. ఆహరం దొరకనప్పుడు ఉపవాసంతో చచ్చిపోతాయి. సాధారణంగా పిచ్చుకలు 2 నుండి 5 గుడ్లు పెడతాయి. ఉద్యానవనాల్లో, పంటలకు వాడే క్రిమిసంహారక మందుల వల్ల కూడా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి.

పిచ్చుకల దేహంలోకి విషం కలిసిన మందులు  చేరి వాటిని బలి తీసుకుంటున్నాయి. మొబైల్‌ ఫొన్ల్లు, వాటి విస్తరణకు కావాల్సిన టవర్లు పిచ్చుకల మనుగడకే ప్రమాదకరంగా మారాయి. పల్లె సీమల్లో తరిగిపోతున్న పిచ్చుకలను మనకు సన్నిహితంగా ఉండేటట్లు చూసుకోవాలి. పిచ్చుకల జీవితం కలకాలం పెరుగుతూ ఉండాలనే సంకల్పంతో పని చేయాలంటారు శ్రీనివాస్.

ఒక మాట- ఒక బొమ్మ పిచ్చుకల జాతి రక్షణకై వేసిన ముందడుగు. అందరూ భాగస్వాములై స్ఫూర్తి నింపుదాం మన స్నేహితులైన పిచ్చుకలను కాపాడుకుందాం..
#savesparrow #

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!