తండ్రిని మించినోడు ఈ కిమ్ !

Sharing is Caring...

Great dictator
తనను మించిన నియంత మరొకరు లేరని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో మారు నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన ఏం చేశాడా అని ఆశ్చర్యపోకండి. కొంచెం ఓపిగ్గా ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమౌతుంది. కిమ్ కి ముందు ఉత్తర కొరియా ను ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలించారు. ఆయన కూడా నియంతే.

ప్రజలకు స్వేచ్ఛ నివ్వకుండా దేశాన్ని పాలించాడు. కిమ్ జోంగ్ ఇల్ మరణించి  పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇల్  సంస్మరణార్థం ఉత్తర కొరియా లో 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.ఈ సందర్భంగా కిమ్ కొన్ని ఆంక్షలు విధించి వార్తల్లో కెక్కారు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే ఈ11 రోజుల పాటు ప్రజలు నవ్వకూడదు. మద్యం సేవించకూడదు… ఎలాంటి వేడుకలు జరుపుకోకూడదు.

ఈ ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి.నియమాలను అనుసరించాలి. సంతాపదినాలు పాటించాలి అంటూ ప్రభుత్వ రేడియో లో ఈ మేరకు ప్రకటనలు జారీ చేయించారు. ఏమైనా నిత్యావసరాలు కావాల్సి ఉన్నప్పటికీ  దేశ ప్రజలు దుకాణాలకు వెళ్లకూడదు….అక్కడేమీ కొనకూడదు. ఈ 11 రోజుల్లో ఎవరైనా మరణించినా వారి కుటుంబ సభ్యులు పొరపాటున కూడా బిగ్గరగా ఏడ్వకూడదు. పుట్టిన రోజులైతే అసలు జరుపుకోవడానికి వీలే లేదు.

ఏమైనా తేడాలొస్తే మటుకు తోలు తీసేస్తారు. ఆ మాట అనలేదు కానీ అంతిమంగా జరిగేది అదే. మొత్తానికి ఏమొచ్చినా బిగ పట్టుకోవాల్సిందే. గతంలోకూడా సంతాప దినాల సమయంలో ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. అయితే కొన్ని చోట్ల ప్రజలు ఆదేశాలను పెడచెవిన పెట్టారు. కిరీటం లేని ప్రభువు మాటలను ధిక్కరించారు. పాపం కొందరైతే తాగుతూ దొరికిపోయారు. (దీంతో ఈ సారి కఠినమైన ఆంక్షలు విధించారు) 

వారందరిని నేరస్థుల కింద జమేసి శిక్షలు వేశారు. అలా శిక్షలు పడ్డ వారు మళ్ళీ కనబడలేదని అక్కడి ప్రజలే చెప్పుకుంటున్నారు. ఇక కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియాను ఏలారు. ఆయనది కూడా పచ్చి నియంతృత్వ వైఖరే. ఇల్ పాలనలో ప్రజలు స్వేచ్చా.. స్వతంత్రం లేక అల్లాడారు. 2011లో ఇల్ డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించారు.

ఇల్‌ మూడో కుమారుడే కిమ్ జోంగ్‌ ఉన్.ఈయన తండ్రిని మించిన వారని కొరియా ప్రజలు చెప్పుకుంటారు. కిమ్ జోంగ్ ఇల్ వర్థంతి రోజున ప్రతి ఏటా10 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. ఈసారి 10వ వర్థంతి కావడంతో ఆ సంఖ్యను 11 రోజులకు పెంచారు. అంటే ప్రతి ఏడాది సంతాప దినాల సంఖ్య పెరుగుతుంది. ఇక ఉత్తర కొరియా ప్రజలు కూడా కిమ్ పాలనకు.. ఆంక్షలకు అలవాటు పడిపోయారు.

అణుపరీక్షల మీద ఉన్న ఆసక్తి కిమ్ కి ప్రజల ఆకలి తీర్చ డంలో లేదనే విమర్శలున్నాయి. దేశంలో కరవు విలయ తాండవం చేస్తోంది.ప్రజలు ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఆహార కొరత ఏర్పడటంతో పిల్లలు పెద్దలు అన్నమో కిమ్ అంటూ మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటన చూసి  ప్రపంచం ఆశ్చర్యపోయింది.  కరవు సమయంలో 2025 వరకు ప్రజలంతా తక్కువ గా ఆహారం తీసుకోవాలని కిమ్ ఉచిత సలహా ఇచ్చారని  మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!