B00k on RSS………………………………..
కర్నాటక దళిత రచయిత దేవనూర మహాదేవ RSS పై రాసిన ఓ చిన్న పుస్తకం ఇప్పుడు కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పుస్తకం లోని విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్దం కాక బీజేపీ ,ఆరెస్సెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
రచయిత దేవనూర మహాదేవ రాసిన “ఆర్ఎస్ఎస్ ఆల మట్టు అగల” కన్నడ పుస్తకం మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి హాట్ హాట్ గా ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రంలోని మితవాద బృందాలు ఈ పుస్తకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రచయిత దేవనూరను ఎలాగైనా ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నాయి.
ఈ పుస్తకంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదొక ‘పీస్ ఆఫ్ ట్రాష్’ (వట్టి చెత్త) అని విశ్వేశ్వర భట్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్ లో విమర్శించారు. కన్నడ డైలీ ‘విశ్వవాణి’ కి ఆయన చీఫ్ ఎడిటర్ కూడా.. రోహిత్ చక్రతీర్థ అనే రచయిత కూడా ‘హోస దిగంత’ అనే డైలీలో ఈ పుస్తకాన్ని విమర్శించారు. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా వ్యతిరేక ప్రచారం చేశాయి.
ఆర్ఎస్ఎస్ ఆల మట్టు అగల బుక్ విడుదలైన వెంటనే 10 వేల కాపీలు అమ్ముడుపోయాయి. మరో 70 వేలకు పైగా కాపీలు ప్రింట్ దశలో ఉన్నాయి. వీటికి డిమాండ్ పెరుగుతూ… పబ్లిషర్లకు అందుతున్న ఆర్దర్లకు లెక్క లేదు. ఆర్ఎస్ఎస్ పోకడలమీద అభ్యంతరాలున్న వారు ఈ పుస్తకాన్ని ఎక్కువగా కొంటున్నారు.
ఈ పుస్తకం ప్రథమార్థంలో దేవనూర.. ఆర్ఎస్ఎస్ కోర్ ఎజెండా ఏమిటో వివరించారు. ప్రతి వ్యక్తికీ సమానత్వం ఉండాలన్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేయడానికి RSS చేస్తున్న ప్రయత్నం… చతుర్వర్ణ వ్యవస్థపై గల సోపానక్రమం స్థానే మనుస్మృతి రావాలన్న RSS ఆలోచన … భారత రాజ్యాంగం బదులు మనుస్మృతి వ్యవస్థ ఉండాలన్న RSS ఉద్దేశంలోని ఔచిత్యమేమిటి ?
‘టు డే మనుస్మృతి ఈజ్ హిందూ లా’ (ఈనాడు మనుస్మృతి హిందూ చట్టం) అన్న RSS భావజాలం నేటి సమాజానికి పనికి వస్తుందా ? అని రచయిత ప్రశ్నించారు. మన ఫెడరల్ వ్యవస్థలో మళ్ళీ మనుస్మృతిని ప్రవేశపెట్టడానికి RSS యత్నిస్తోందని, మైనారిటీలను, దళితులను అణగదొక్కాలన్న భావనను వ్యక్తం చేస్తోందని, సంస్కృతాన్ని రుద్దాలని ఒత్తిడి చేస్తోందని రచయిత తన మనసులో మాటలను నిర్మొహమాటంగా చెప్పారు. ఇదంతా నాజీ జర్మనీ పోకడలను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు.
ఇక రెండో భాగంలో వర్తమాన పరిస్థితులపై ఆయన తన ఆలోచనలకు పదునుపెట్టారు. జీఎస్టీ నుంచి ప్రైవేటీకరణ, హిజాబ్ నుంచి పౌరసత్వ సవరణ చట్టం, మత మార్పిడి వ్యతిరేక చట్టాలు వంటి వాటిని రచయిత ప్రస్తావించారు. వీటిలో ఒక్కొక్కదాన్ని ఆర్ఎస్ఎస్ తన ఎజెండాలకు అనుగుణంగా ఎలా మారుస్తూ వచ్చిందో వివరించారు.
చరిత్రలో మొదటిసారిగా రాజ్యాంగ సంస్కరణల ద్వారా మహిళలు, ఎస్సి, బీసీ, మైనారిటీలకు సంక్రమించిన ప్రయోజనాలను మార్చివేయడానికి ఎలాంటి ప్రయత్నం జరిగిందో రచయిత తన పుస్తకంలో వివరించారు. ఈ ప్రయత్నం మళ్ళీ ఈ వర్గాలను పాత కొలోనియల్ దశల్లోకి తీసుకువెళ్లేవిగా ఉందని, RSS బీజేపీ ఎమోషనల్ సమస్యలను తమకు అనువుగా మార్చుకోవడానికి చేసిన యత్నమే ఇదని రచయిత విశ్లేషించారు.
ఈ RSS ‘గ్రాండ్ స్కీం’ ని కూల్చివేయడానికి ప్రగతిశీల శక్తులు, విపక్షాలు, సివిల్ సొసైటీ సంస్థలు, ప్రజాఉద్యమాలకు పూనుకోవాలని, ఈ బృహత్తర బాధ్యత వీటిపై ఉందని రచయిత పిలుపు నిచ్చారు.దేవనూర రాసిన ఈ పుస్తకంలో కేవలం 64 పేజీలు మాత్రమే ఉన్నాయి.
పాఠకులు ఒక్కసారిగా దీన్ని చదివేయవచ్చు. మాస్ రైటర్ గా పాపులర్ అయిన ఈయన తన భావాలతో రీడర్ ని మెస్మరైజ్ చేశారు. దళిత రచయిత అయినప్పటికీ బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, ధార్వాడ్ వంటి అగ్రహారాలను దాటి ఆయన భావాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ‘కుసుమ బాలే’, ‘ఒదాలాల’ వంటి ఈయన పుస్తకాలు కర్ణాటకలో ప్రతి ఇంటా దర్శన మిస్తున్నాయి.
వీటికి రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు లభించాయి. ఆధునిక కన్నడ సాహిత్య రంగంలో దేవనూర కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పుస్తకాన్ని ఇతర భాషల్లోకి అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం లో ముద్రించేందుకు పలువురు ప్రచురణకర్తలు సిద్ధంగా ఉన్నారు.
—–Theja