A story that touches the psychological aspects of the characters ……
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ ..కుంచకో బోబన్, ఫహద్ ఫాసిల్, జ్యోతిర్మయి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగుతో సహా పలు భాషల్లో SonyLIV స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తిగా లో బడ్జెట్ సినిమా.. పాటలు లేవు. థియేటర్స్ లో ప్రదర్శన ద్వారా రూ. 35 కోట్లు వసూలు చేసింది. కథ మిస్టరీ, మానసిక పోరాటాలు, మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది. ఫామిలీ డ్రామా , సస్పెన్స్,ఇన్వెస్టిగేషన్ తో కూడిన సినిమా. అయితే కొంచెం ఓపిగ్గా చూడాలి. మొదటి అరగంట స్లో గా నడుస్తుంది. అక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఊహించని మలుపులు తిరుగుతుంది.
డాక్టర్ రాయ్స్ (కుంచకో బోబన్) తన భార్య రీతు (జ్యోతిర్మయి) పట్ల అత్యంత శ్రద్ధ చూపే భర్త. రీతూ కారు ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోతుంది. తద్వారా మానసిక ఆరోగ్యంతో బాధపడుతుంటుంది. రీతూ పెయింటింగ్స్ వేస్తూ కొంత ప్రశాంతతను పొందుతుంటుంది.
ఛాయా కార్తికేయన్ అనే యువతి అదృశ్యంపై విచారించడానికి ఏసీపీ డేవిడ్ (ఫహద్ ఫాసిల్) వారి ఇంటికి రావడంతో వారి ప్రశాంత జీవనం మలుపు తిరుగుతుంది.ఇక్కడి నుంచే కథ వేగం పుంజుకుంటుంది.
ఛాయా కార్తికేయన్ తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు మాయమవుతారు. వారు ఏమైనారు ? వారికి డాక్టర్ రాయ్ ఫ్యామిలీ కి సంబంధం ఏమిటి ? ఏసీపీ వీరి చుట్టూనే ఎందుకు తిరుగుతాడు ? అన్న విషయాలు సస్పెన్స్.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథలో కొన్ని లోపాలు .. కొన్ని లాజిక్ కి అందని అంశాలు ఉన్నప్పటికీ పాత్రల మానసిక కోణాలను టచ్ చేస్తూ కథ సాగుతుంది. కుంచకో బోబన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బోబన్ చివరివరకు కూల్ గా నటించాడు. ఫహద్ ఫాసిల్ నటించడానికి ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో స్కోప్ లేదు.మాయమైన ఆడపిల్లలను కాపాడాలన్న తపనను,అంతర్గత సంఘర్షణను తన కళ్ళల్లో ప్రతిఫలించేలా నటించాడు.
ఇక ఎక్కువ మార్కులు పడేది రీతూ పాత్ర పోషించిన జ్యోతిర్మయి కే. ఆపాత్రను అవగాహన చేసుకుని అద్భుతంగా నటించింది. కథలో కీలకమైన ఆ పాత్రకు ఆమె పాణం పోసింది. సెకండ్ హాఫ్ లో కథలో ట్విస్టులు .. ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆనంద్ చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సుశిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. నెమ్మదిగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ను ఒకసారి చూడవచ్చు .